logo

ఆలయాల్లో సౌరవిద్యుత్తు

ఇటీవల రామారెడ్డి కాళభైరవస్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలు పెద్దఎత్తున ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Updated : 18 May 2024 04:47 IST

ఏడాదికి  రూ.30 లక్షల ఆదా
ప్రతిపాదనలు రూపొందించిన దేవాదాయశాఖ

ఇటీవల రామారెడ్డి కాళభైరవస్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలు పెద్దఎత్తున ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలతోపాటు సామూహిక భజనలు చేస్తున్నారు. ఇంతలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగి భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

దేవాలయాల్లో నిత్యపూజలతో పాటు ప్రత్యేక పండగలు, కల్యాణోత్సవాల సందర్భంగా కరెంట్‌ పోయి భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులను దూరం చేసి నిరంతరం సరఫరా ఉండేలా ఆ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో సౌరవిద్యుత్తు ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో  పరిస్థితి..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో మొత్తం 1357 ఆలయాలున్నాయి. వీటిలో రూ.కోటి వరకు ఆదాయం ఉన్న ఆలయాలు 6(ఏ) కింద 6, అలాగే రూ.25 లక్షలలోపు ఉన్నవి 6(బీ) కింద 11, రూ.2 లక్షల వరకు ఉన్నవి 6(సీ) కింద 1340, మఠాలు 6(డీ) కింద రెండు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో రోజు విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లు, ఏసీలు పనిచేస్తూనే ఉంటాయి. ఆయా దేవాలయాలకు ప్రతి నెల సుమారు రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. ఇక ప్రత్యేక పూజలు, ఉత్సవాల్లో అలంకరించే రంగురంగుల దీపాలు, ఇతర వాటితో వినియోగం పెరిగి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వస్తున్న బిల్లులు చెల్లిస్తున్నారు. ఒక్కో దేవాలయానికి ఏడాదికి రూ.లక్షకు పైగా బిల్లులు చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

భూమి  పరిశీలన..

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు దేవాదాయశాఖ కసరత్తు చేస్తోంది. విద్యుత్తు బిల్లులు చెల్లించకుండా నిరంతరాయంగా సరఫరా చేసేందుకు సౌరవిద్యుత్తు సౌకర్యం కల్పించనున్నారు. మందిర ప్రాంగణాల్లో సౌరఫలకాలను ఏర్పాటు చేయడానికి సంప్రదాయ ఇంధనవనరుల పొదుపు సంస్థ(టీఎస్‌రెడ్కో) శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ఇటీవలే జానకంపేట్‌ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని, పరిసరాల్లో వృథాగా ఉన్న భూమిని పరిశీలించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రధాన ఆలయాలతోపాటు మిగిలిన వాటిల్లో ఒక్కసారి సౌరవిద్యుత్తు ఏర్పాటు చేస్తే ఏడాదికి సుమారు రూ.30 లక్షల వరకు ఆదా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.


భూములు కబ్జా కాకుండా..

- సహాయ కమిషనర్‌ సుప్రియ

ఆలయాలకు వచ్చే ఆదాయంలో 20 నుంచి 40 శాతం విద్యుత్తు బిల్లులకే చెల్లించే పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించేందుకు ఇంధన వనరుల పొదుపు సంస్థ అధికారులతో చర్చించాం. ముందుగా ఉమ్మడి జిల్లాలోని 11 ప్రధాన దేవాలయాల్లో సౌరవిద్యుత్తు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాం. రాష్ట్రశాఖకు త్వరలో పంపిస్తాం. ఆలయాలకు చెందిన వృథా భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు వాటిల్లో సౌరఫలకాల ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఆ శాఖకు లీజుకు ఇవ్వనున్నాం. ముందుగా జానకంపేట్‌ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి చెందిన 9 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు