logo

మాది చేతల ప్రభుత్వం

తమది చేతల ప్రభుత్వమని, చెప్పింది చేస్తామని, భాజపా నేతల మాదిరి మాటలు చెప్పి మభ్యపెట్టబోమని ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన పట్నాయక్‌ చెప్పారు.

Published : 03 Dec 2022 00:54 IST

భాజపా మాదిరి మాటలతో మభ్యపెట్టం

పద్మపూర్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం నవీన్‌

ఝార్బంధ్‌ సభలో మహిళా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తున్న నవీన్‌

భువనేశ్వర్‌, బరగఢ్‌, న్యూస్‌టుడే: తమది చేతల ప్రభుత్వమని, చెప్పింది చేస్తామని, భాజపా నేతల మాదిరి మాటలు చెప్పి మభ్యపెట్టబోమని ముఖ్యమంత్రి, బిజద అధినేత నవీన పట్నాయక్‌ చెప్పారు. శుక్రవారం పద్మపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఝార్బంధ్‌, పైకమాల్‌, పద్మపూర్‌ సమితుల్లో ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. అధికారమే పరమావధిగా చేసుకున్న కేంద్ర మంత్రులు రాష్ట్రానికొచ్చి అవాస్తవాలు చెబుతున్నారన్నారు. అన్నదాతల గురించి చెప్పుకుంటున్న వారు వరికి మద్దతు ధర పెంచాలని స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని, ఈ విషయమై తాము ఎన్నిసార్లు కోరిని పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర రైతుల కోసం పీఎం ఫసల్‌ బీమా వాయిదాల కింద రూ.630 కోట్లు చెల్లించినా, సకాలంలో బీమా చెల్లించని కేంద్రం నేతలు ఇక్కడ అవాస్తవాలు చెబుతున్నారన్నారు. బరగఢ్‌, నువాపడా రైలు మార్గానికి స్థలం కేటాయించలేదని ఎన్నికల సభల్లో చెబుతున్నారని, నిర్మాణాలకు ఇంత వరకు సర్వే జరగలేదన్నారు. ఎంత స్థలం అవసరమవుతుందన్న వివరాలు ప్రభుత్వానికి తెలియజేయని దిల్లీ పెద్దలు ఇవాళ స్థలమిస్తే రేపు పనులు ప్రారంభిస్తామని ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించారు. బంగారంపై 3 శాతం వస్తుసేవల పన్ను వసూలు చేస్తుండగా, నిరుపేద కార్మికులు చేస్తున్న బీడీ ఆకుల సేకరణపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయడం అన్యాయం కాదా? అని ప్రశ్నించారు.  

జనం కోసం పనులు చేస్తున్నాం

పైకమాల్‌, పద్మపూర్‌ సభల్లో మాట్లాడిన సీఎం నాలుగున్నర కోట్ల రాష్ట్ర ప్రజలను తాము దేవుళ్లుగా ఆరాధిస్తున్నామన్నారు. పాలకులు సేవకులన్న వాస్తవాన్ని జీర్ణించుకున్న తాము నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. పనుల చేసేవారిని గెలిపించాలని, బిజద అభ్యర్థి బార్షారాణి సింగ్‌ బరిహను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. పైకమాల్‌, ఝార్బంధ్‌, పద్మపూర్‌ సభా వేదికలపై ఆయా సమితులకు చెందిన వివిధ కులాల పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఆయనను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

పైకమాల్‌ సభా వేదికపై నవీన్‌కు పాదాభివందనం చేస్తున్న బర్షారాణి సింగ్‌ బరిహ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని