logo

వేదాలు, ఉపనిషత్తులు సత్కర్మలకు ప్రేరణ

వేదాలు, ఉపనిషత్తులు సత్కర్మలకు ప్రేరణ అని భక్తి, జ్ఞానమార్గాలు అనుసరణీయమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయరు స్వామి చెప్పారు.

Updated : 25 Jan 2023 05:20 IST

బక్షిపల్లిలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయరు స్వామి

ఆధ్యాత్మికోపన్యాసం చేస్తున్న చినజీయరు స్వామి

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: వేదాలు, ఉపనిషత్తులు సత్కర్మలకు ప్రేరణ అని భక్తి, జ్ఞానమార్గాలు అనుసరణీయమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయరు స్వామి చెప్పారు. గోపాల్‌పూర్‌కి చేరువలోని బక్షిపల్లి తెలుగు ప్రజల గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాట్లాడిన స్వామి పూరీ శ్రీక్షేత్రం, కోణార్క్‌ సూర్యనారాయణ స్వామి క్షేత్రాల విశిష్టత గురించి విపులంగా వివరించారు. మానవ జన్మ మహత్తరమైనదని, ప్రతి ఒక్కరూ జ్ఞాన, భక్తి భావాలు అలవర్చుకుని సేవాభావంతో మెలిగి జన్మ సార్ధకం చేసుకోవాలన్నారు. నేను, నాది అన్న స్వార్ధం దుఃఖానికి, అశాంతికి కారణమవుతుందని, స్వార్ధ చింతన వీడితే సదా శాంతి ఉంటుందన్నారు.

బక్షిపల్లి విద్వాన్‌పల్లి..

బక్షిపల్లిని విద్వాన్‌పల్లిగా అభివర్ణించిన చినజీయరు స్వామి భక్తుల్లో ఉన్న శ్రద్ధాసక్తులు, నిష్కామ కర్మలు ఆదర్శప్రాయమన్నారు. మంగళవారం ఈ గ్రామంలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయ ప్రాంగణంలో సామూహిక దీక్షా కార్యక్రమం జరిగింది. వందల సంఖ్యలో భక్తులు పాల్గొని గురుమంత్ర ఉపదేశం పొందారు. దీనికి ముందుగా శాస్త్రోక్తంగా పూజలు, పంచకర్మలు నిర్వహించారు.  అయిదువేల మందికి  నిర్వాహకులు తీర్ధప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేశారు. బక్షిపల్లి మాజీ సర్పంచి డి.పద్మనాభం, గ్రామ పెద్దలు బి.వరంబాబు, ఎ.కృష్ణారావు, జి.శ్యాంసుందర్‌రావు, పండిత శ్రీనివాస ఆచార్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన శ్రీమన్నారాయణ కోలాటం, తప్పెటగుళ్లు తదితర ప్రదర్శనలు అలరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని