logo

మంత్రి హత్య కేసు దర్యాప్తునకు హైకోర్టుకు విజ్ఞప్తి

మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్యకేసు దర్యాప్తునకు పదవిలో ఉన్న న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

Updated : 01 Feb 2023 06:01 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: మంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్యకేసు దర్యాప్తునకు పదవిలో ఉన్న న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. క్రైంబ్రాంచ్‌ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం హత్య జరిగిన బ్రజరాజ్‌నగర్‌ గాంధీ చౌక్‌కు క్రైంబ్రాంచ్‌ ఏడీజీ అరుణ్‌ బోత్రా ఇతర అధికారులు సందర్శించి అన్ని కోణాల్లో పరిశీలించారు. బోత్రా విలేకరులతో మాట్లాడుతూ... నిందితుడు గోపాల్‌చంద్ర దాస్‌ తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు చెప్పారు. రిమాండులోకి తీసుకొని అతడిని విచారించిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.


‘పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయింది’

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమీర్‌ మహంతి,
పక్కన పృథ్వీరాజ్‌ హరిచందన్‌, గోలక్‌ మహాపాత్ర్‌ తదితరులు

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : మంత్రి హత్య కేసు సీబీఐకి అప్పగించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సమీర్‌ మహంతి డిమాండ్‌ చేశారు. మంగళవారం భాజపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలీసు చేసిన హత్యను పోలీసులే దర్యాప్తు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. పోలీసులపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. హత్య జరిగి రెండు రోజులు గడుస్తున్నా.. డీజీపీ సునీల్‌ కుమార్‌ బన్సల్‌ ఘటనా స్థలాన్ని సందర్శించలేదన్నారు. మంత్రులకే భద్రత లేదని ఇక ప్రజలకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 23 ఏళ్లుగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ హోంశాఖ బాధ్యతలు చూస్తున్నారని ఈ ఘటనపై ఆయన నోరు విప్పడం లేదన్నారు. భాజపా నేతలు పృథ్వీరాజ్‌ హరిచందన్‌, గోలక్‌ మహాపాత్ర్‌ తదితరులు పాల్గొన్నారు.


అప్పుడే ఏమీ చెప్పలేం

విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ శిశిర్‌ మిశ్ర

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: మంత్రిని సర్వీసు రివాల్వరుతో ఏఎస్సై గోపాల్‌ దాస్‌ హతమార్చిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన క్రైం బ్రాంచి నలుగురు సభ్యుల బృందం మంగళవారం బ్రహ్మపుర చేరుకుంది. నగర శివారున జలేశ్వరఖండిలో ఉంటున్న కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు క్రైం బ్రాంచి డీఎస్పీ శిశిర్‌ మిశ్ర విలేకరులకు చెప్పారు. ఈ ఘటనలో బ్రహ్మపురకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని, అప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. నలుగురు సభ్యుల బృందంతోపాటు బ్రహ్మపుర పోలీసు జిల్లా డీఎస్పీ సంతోషిణి ఓరం, లంజిపల్లి ఔట్‌పోస్టు అధికారులున్నారు. కుటుంబ సభ్యుల్ని విచారించిన అనంతరం క్రైంబ్రాంచి అధికారులు ఏఎస్సై దాస్‌ అన్నయ్య సత్యనారాయణ దాస్‌ను తమ వెంట తీసుకెళ్లారు. మంత్రి నబ కిశోర్‌ దాస్‌ హత్య ఘటనలో నిందితుడు ఏఎస్సై గోపాల్‌ దాస్‌ బ్రహ్మపురకు చెందినవాడని తెలిసిందే. ఆయన భార్య, కుమార్తె, కొడుకు స్థానిక అంకులి పారిశ్రామికవాడలో నివాసముంటున్నారు.


సీబీఐకి అప్పగించాలి

విపక్ష నేత జయనారాయణ మిశ్ర మంగళవారం సంబల్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... మంత్రి దాస్‌పై కాల్పులు జరిగిన తర్వాత ఝార్సుగుడ ఆసుపత్రికి తరలించారని, అక్కడే అయన మృతి చెందినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. మృతదేహాన్ని ఎయిర్‌ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌ పంపించిన బిజద పెద్దలు మైలేజీ కోసం ఆడిన నాటకమని తీవ్ర విమర్శలు చేశారు. నిందితుడు గోపాల్‌ దాస్‌ మానసిక వ్యాధిగ్రస్థుడని ప్రచారం చేస్తున్నారని అలాంటప్పుడు అతని సర్వీసు కాలంలో 18 పర్యాయాలు ఉత్తమ పోలీసుగా పతకాలు ఎలా అందుకున్నాడని ప్రశ్నించారు. ఈ హత్యలో కుట్ర దాగి ఉందని, క్రైంబ్రాంచ్‌కి దర్యాప్తు బాధ్యత అప్పగించి కేసు పక్కదారి పట్టించాలని చూస్తోందన్నారు. దీనిపై డీజీపీ, హోంశాఖ ఉన్నతాధికారులు పెదవి విప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మిస్టరీ వీడాలంటే సీబీఐకి దర్యాప్తు బాధ్యత అప్పగించాలని డిమాండ్‌ చేశారు.


సీఎం దిగిపోవాలి

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుదర్శన్‌ దాస్‌ భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... పోలీసుశాఖలో ఇంకెంతమంది మానసిక రోగులున్నారో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సమాధానం చెప్పాలన్నారు. సీఎం పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. మంత్రి హత్యకేసు దర్యాప్తు ‘సిట్‌’ ద్వారా హైకోర్టు పర్యవేక్షణలో జరిపించాలన్నారు.


ఇంకెవరు చేస్తారు?

బిజద ఉపాధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ మిశ్ర మంగళవారం సాయంత్రం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. హత్య కేసుల దర్యాప్తు పోలీసులు కాకుండా ఇంకెవరు చేస్తారని ప్రశ్నించారు. క్రైంబ్రాంచ్‌ దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఇదంతా జరిగేటట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని