logo

Crime News: కుటుంబాన్ని చిదిమేసిన ఆర్థిక ఇబ్బందులు?.. భార్య, కుమార్తెను చంపేసి..

వెంటాడుతున్న సమస్యలను ఎదుర్కోలేక ఓ యువకుడు అమానుష చర్యకు పాల్పడ్డాడు. ఆలి, కన్న కూతురిని చంపేసి.. అతడూ ఆయువు తీసుకున్నాడు.

Updated : 14 Feb 2023 09:02 IST

కుమార్తె ఇషాతో లింగరాజ్‌, జ్యోత్స్న

సిమిలిగుడ, న్యూస్‌టుడే: వెంటాడుతున్న సమస్యలను ఎదుర్కోలేక ఓ యువకుడు అమానుష చర్యకు పాల్పడ్డాడు. ఆలి, కన్న కూతురిని చంపేసి.. అతడూ ఆయువు తీసుకున్నాడు. కొరాపుట్‌ జిల్లాలోని లక్ష్మీపూర్‌ సమితి తొయపుట్‌ గ్రామంలో ఓ యువకుడు భార్య, కుమార్తెను హతమార్చి.. ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది.

లక్ష్మీపూర్‌ ఠాణా అధికారి శ్వేత పద్మ శెఠి అందించిన వివరాల ప్రకారం....  తొయపుట్‌కు చెందిన లింగరాజు బిశోయ్‌ (27) స్థానికంగా చరవాణి దుకాణం పెట్టుకుని జీవించేవాడు. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండడంతోపాటు అప్పుల పాలైపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఆదివారం సాయంత్రం చరవాణి దుకాణం నుంచి ఇంటికి చేరుకుని అన్ని తలుపులు వేసి, ముందుగా భార్య జ్యోత్స్న (24) మెడకు చరవాణి ఛార్జర్‌ వైరు బిగించి హతమార్చాడు. పక్కనే ఉన్న రెండేళ్ల కుమార్తె గొంతుకు తాడు చుట్టి చంపేశాడు. అనంతరం తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

చాలాసేపు ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో రాత్రి 9 గంటలకు పొరిగింటి వారు తలుపు తట్టారు. లోపల నుంచి స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగును పిలిచారు. అందరూ తలుపులు విరగ్గొట్టి చూడగా ఒకే గదిలో మూడు మృతదేహాలు కనిపించాయి. కుటుంబమంతా నిర్జీవంగా పడి ఉన్న దృశ్యం చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. సమాచారం అందుకున్న లక్ష్మీపూర్‌ పోలీసులకు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటిని సీజ్‌ చేశారు. సోమవారం ఉదయం మృతదేహాలను పరీక్షకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులతోనే లింగరాజు అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. బంధువుల రోదనలతో తోయపుట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని