logo

VK Pandian: పాండ్యన్‌ వీఆర్‌ఎస్‌.. వెంటనే కీలక బాధ్యతలు

ఐఏఎస్‌ అధికారి వి.కార్తికేయ పాండ్యన్‌ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) చేశారు. ఈ నెల 20న పాండ్యన్‌ వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేశారు. 23 రాత్రి కేంద్రం ఆమోదించింది.

Updated : 25 Oct 2023 08:25 IST

5టీ, నవీన్‌ ఒడిశా అధ్యక్షునిగా పాండ్యన్‌
దసరా సెలవుల్లో అనూహ్య  పరిణామాలు

నవీన్‌తో పాండ్యన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఐఏఎస్‌ అధికారి వి.కార్తికేయ పాండ్యన్‌(VK Pandian) స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) చేశారు. ఈ నెల 20న పాండ్యన్‌ వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేశారు. 23 రాత్రి కేంద్రం ఆమోదించింది. మంగళవారం ఉదయం ఆయనను 5టీ, నవీన్‌ ఒడిశా అధ్యక్షునిగా ప్రభుత్వం నియమించింది. క్యాబినెట్‌ మంత్రి హోదా కల్పిస్తూ సాధారణ పాలనా విభాగం ఉత్వర్వులు జారీ చేసింది. పాండ్యన్‌ ఇక ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆధ్వర్యంలో విధులు నిర్వహించనున్నారు. దసరా సెలవుల్లో జరిగిన ఈ అనూహ్య పరిణామాలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి.

సబ్‌ కలెక్టరుగా ప్రస్థానం

2000 బ్యాచ్‌ ఒడిశా క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి పాండ్యన్‌ తమిళనాడు వాసి. 2002 నుంచి 2004 వరకు కలహండి జిల్లా ధర్మగడ్‌ సబ్‌ కలెక్టరుగా విధులు నిర్వహించారు. తర్వాత మయూర్‌భంజ్‌ కలెక్టరుగా 2007 వరకు వ్యవహరించిన ఆయన 2007 నుంచి 2011 వరకు గంజాం కలెక్టరుగా విధులు నిర్వహించారు. 2011 నుంచి ఇంతవరకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రత్యేక కార్యదర్శిగా కీలక బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల ముందు పాండ్యన్‌కు 5టీ కార్యదర్శిగా సీఎం అదనపు పోస్టు కేటాయించారు.

2019 నుంచి ఆయన కీలకం

2019 ఎన్నికల ముందు నుంచి పాండ్యన్‌ సీఎంకు నమ్మకమైన అధికారి అయ్యారు. తెర వెనుక ఉంటూ పాలనలో, బిజద పార్టీలో కీలకమయ్యారు. ఇటీవల సీఎంవో పేరిట ఆయన నవీన్‌ ప్రతినిధిగా హెలికాప్టరులో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, సరికొత్త కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. దీనిపై విపక్షాలు శాసనసభ లోపల, వెలుపల దుయ్యబట్టాయి. పాండ్యన్‌ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

పార్టీ నేతలకు మార్గదర్శి

2019 ఎన్నికల సమయంలో బిజద అభ్యర్థుల టిక్కెట్ల కేటాయింపులో పాండ్యన్‌ ముఖ్య భూమిక పోషించిన దాఖలాలున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ ఆయనే మార్గదర్శిగా ముద్రపడ్డారు. ఉన్నతాధికారుల బదిలీలు, కీలక నిర్ణయాల్లో ప్రధానపాత్ర పోషించారు. పార్టీ సహచరుల కంటే పాండ్యన్‌కే సీఎం అధిక ప్రాధాన్యమిచ్చారు. నవీన్‌ను కలుసుకోలేని మంత్రులు, నాయకులు ఈ మాజీ అధికారి ఆజ్ఞలు శిరసావహిస్తున్నారని, ప్రజాప్రతినిధులు చులకనవుతున్నారని విపక్ష, అధికార పార్టీ నేతలు ఆరోపించారు.

విపక్ష నేతల నోళ్లకు తాళాలు

రాష్ట్ర ప్రభుత్వం పాండ్యన్‌ వీఆర్‌ఎస్‌ గురించి కేంద్రానికి తెలియపరిచిన వెంటనే ఆమోదం పొందింది. సెలవుల్లోనే అన్నీ జరిగిపోవడం ఆశ్చర్యకరం. దీంతో విపక్షనేతల నోళ్లకు తాళాలు పడ్డాయి. పాండ్యన్‌ ఇక పాలనలో, పార్టీలో కీలకంగా మారుతారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే వెసులుబాటు కలిగింది. తన సహచరులకంటే పాండ్యన్‌నే విశ్వసించిన సీఎం ఎన్నికల ముంగిట్లో వ్యూహం ప్రకారం ఉద్యోగానికి రాజీనామా చేయించారు. తన అధికారంతో పాండ్యన్‌కు రెండు ఉన్నత పదవులు అప్పగించారు. పాలనలో, పార్టీలో ఇక ఆయనే కీలకం కానున్నారు.

ఇక సూపర్‌ సీఎం

తెర వెనుక ఉంటూ అన్నీ తానై వ్యవహరించిన పాండ్యన్‌ ఇక తెరముందుకు రానున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే అవకాశం లేకపోలేదు. ఇదంతా నవీన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పరిశీలకులంటున్నారు. ఎన్నికలకు మరికొద్ది నెలలు మిగిలుండగా పాండ్యన్‌ సూపర్‌ సీఎంగా వ్యవహరిస్తారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాలనను, పార్టీని నియంత్రిస్తారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందుగా రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో మార్పులు, చేర్పులు తథ్యమని ప్రముఖ కాలమిస్టు రబిదాస్‌ మంగళవారం భువనేశ్వర్‌లో విలేకరులకు చెప్పారు.


ప్రజా సంక్షేమం ధ్యేయంగా... : శశిభూషణ్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం ధ్యేయంగా వి.కార్తికేయ పాండ్యన్‌కు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నూతన బాధ్యతలు అప్పగించారని ఆర్థికశాఖ మాజీ మంత్రి, బిజద అధికార ప్రతినిధి శశిభూషణ్‌ బెహరా చెప్పారు. మంగళవారం భువనేశ్వర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పాలనాధికారిగా సమర్ధంగా విధులు నిర్వహించిన పాండ్యన్‌ ఇకపై క్యాబినెట్‌ మంత్రి హోదాలో 5టీ, నవీన్‌ ఒడిశా అధ్యక్షునిగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళతారన్నారు. దూరదృష్టి గల సీఎం ఆయనకు రెండు కీలక పదవులు కేటాయించారన్నారు. పాండ్యన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారా? అన్నది బిజద అధినేత, సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. మూడు రోజుల వ్యవధిలో పాండ్యన్‌కు వీఆర్‌ఎస్‌ ఎలా సాధ్యమైందన్న దానిపై తాము చెప్పేదేమీ లేదని, దీనిపై కేంద్రాన్ని అడగాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు బెహరా సమాధానమిచ్చారు.


కళంకిత అధ్యాయానికి తెర: సామల్‌

ఒక ఐఏఎస్‌ అధికారి రాజ్యాంగేతర శక్తిగా మారి అధికారం చెలాయించడాన్ని తాము వ్యతిరేకించామని, కార్తికేయ పాండ్యన్‌ వీఆర్‌ఎస్‌తో కళంకిత అధ్యాయానికి తెరపడిందని భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్‌ సామల్‌ చెప్పారు. మంగళవారం ఆయన భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... రాజీనామాలు చేసిన ఐఏఎస్‌ మాజీ అధికారులు ప్యారీ మోహన్‌పాత్ర్‌, అపరాజిత షడంగి రాజకీయ రంగప్రవేశం చేశారన్నారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత బి.కె.పట్నాయక్‌, ఆర్‌.బాలకృష్ణన్‌ తదితరులు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారన్నారు. పాండ్యన్‌ విషయంలో తాము ఇదే కోరామన్నారు. నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం దుర్వినియోగం, అవినీతి, బంధుప్రీతితో వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని, ఎన్నికల సమరంలో ఈ అంశాలనే భాజపా ప్రచారాస్త్రాలుగా చేయనుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని