logo

ఎన్నికల బరి... ఇంతులే మరి

జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ రెండు పార్టీలు నారీమణులను బరిలో దింపి పావులు కదుపుతున్నాయి.

Published : 01 May 2024 03:04 IST

జయపురం, న్యూస్‌టుడే: నవరంగపూర్‌ జిల్లాలో 29 ఏళ్ల తరువాత బిజద, కాంగ్రెస్‌ పార్టీలు మహిళా అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పించాయి. జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ రెండు పార్టీలు నారీమణులను బరిలో దింపి పావులు కదుపుతున్నాయి. నవరంగపూర్‌ నియోజకవర్గంలో బిజద అభ్యర్థినిగా సిటింగ్‌ ఎమ్మెల్యే సదాశివ్‌ ప్రధాన్‌ భార్య కౌసల్య ప్రధాన్‌, ఉమ్మర్‌కోట్‌లో మాజీ ఎమ్మెల్యే సుభాష్‌ గండ్‌ భార్య నబీనా గండ్‌, కాంగ్రెస్‌ తరఫున జొరిగావ్‌లో ఆదివాసీ మహిళా హరాబతి గండ్‌, డాబుగావ్‌లో మాజీ ఎమ్మెల్యే భుజబల్‌ మాఝి కుమార్తె డా.లిపికా మాఝి పోటీ పడుతున్నారు. వీరంతా ఎమ్మెల్యే అభ్యర్థులుగా మొదటి సారి పోటీ పడుతున్నారు.

ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు

 నవరంగపూర్‌ అభ్యర్థిని కౌసల్యకు రాజకీయాలు కొత్త. భర్త బాటలో నడిచి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయంలోకి వచ్చారు. మొదటిసారి 2019లో తన భర్త కోసం ప్రచారంలో పాల్గొన్నారు. ఈసారి తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సుభాష్‌ గండ్‌ భార్య, రాయ్‌ఘర్‌ సమితి బిజద అధ్యక్షురాలు నబీనా గండ్‌. గతంలో తన భర్త ఎమ్మెల్యే కావడంతో తనకు కలిసొస్తుందనే నమ్మకంతో ఆమె ఉన్నారు. భాజపాకు కంచుకోటైన ఉమ్మర్‌కోట్‌లో ఆమె బిజద శంఖం పూరించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజలకు గుర్తుచేస్తూ గ్రామాల్లో మహిళా ఓటర్లను తను వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. డాబుగావ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిని డా।।లిపికా మాఝి, 2022లో పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మనోహర్‌ రంధారిపై గెలుపొంది సత్తా చాటుకుంది. జిల్లాలోని 26 జిల్లా పరిషత్‌ జోన్‌లలో ఏకైక కాంగ్రెస్‌ అభ్యర్థినిగా గెలిచి సత్తా చాటుకున్నారు. ఇప్పుడు మళ్లీ పార్టీ టికెట్‌ ఇవ్వడంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జొరిగావ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని హరాబతిగండ్‌ ఇప్పటికే ప్రజలను ఆకర్షించుకుని పార్టీని బలోపేతం చేశారు. రాజకీయాలు ఆమెకు కొత్త కాత్తయినా ఆదివాసీలకు భూమి, నీరు, అడవిపై హక్కుల కోసం యంత్రాంగంతో పోరాడిన ఫైర్‌బ్రాండ్‌గా ఆమె అందరి మన్ననలను పొందారు.

29 ఏళ్ల తర్వాత అవకాశం

దాదాపు 29 ఏళ్ల తరువాత జిల్లాలో ఆయా పార్టీలు మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించినట్టు సమాచారం. 43 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ మూడు నియోజకవర్గాల్లో మహిళలకు అవకాశం ఇవ్వగా ముగ్గురు అతివలు ఎమ్మెల్యేలుగా గెలిచి సత్తా చాటుకున్నారు. ఉమ్మర్‌కోట్‌లో పరమ పూజారి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, 1980లో డాబుగావ్‌ నియోజకవర్గంలో స్వర్గత్‌ ఫులమణి శాంతా, 1985లో జొరిగావ్‌లో భగవతి పూజారి గెలుపొందిన వారిలో ఉన్నారు. అందరూ మొదటి సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న నలుగురు నారీమణులు గెలిచి చరిత్ర సృష్టిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని