logo

విభేదాలను దాటి అధికారం ‘చే’ జిక్కించుకుంటారా?

అంతర్గత కలహాలు, ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపం, అభ్యర్థుల కొరత రాష్ట్రంలో కాంగ్రెస్‌ను వేధిస్తున్నాయి. ఎన్నికల ముందు, టికెట్ల కేటాయింపు సమయంలో పలువురు నేతలు బిజద, భాజపాల్లో చేరడంతో పార్టీకి దిశా నిర్దేశం చేసేవారి కొరత ఏర్పడింది.

Published : 01 May 2024 03:17 IST

నేతల మధ్య సమన్వయలోపం

90 స్థానాలు తమవే అంటున్న నాయకులు

 

అంతర్గత కలహాలు, ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపం, అభ్యర్థుల కొరత రాష్ట్రంలో కాంగ్రెస్‌ను వేధిస్తున్నాయి. ఎన్నికల ముందు, టికెట్ల కేటాయింపు సమయంలో పలువురు నేతలు బిజద, భాజపాల్లో చేరడంతో పార్టీకి దిశా నిర్దేశం చేసేవారి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమైన హస్తం పార్టీ రాష్ట్రంలో 90 అసెంబ్లీ స్థానాలు, 15 లోక్‌సభ స్థానాలు సాధిస్తామని చెబుతోంది. ఇది ఎంతవరకు సాధ్యమో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. -భువనేశ్వర్‌, న్యూస్‌టుడే

 రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రతిష్ఠ మసకబారింది. 21 లోక్‌సభ స్థానాలకుగాను కొరాపుట్‌ సీటు మాత్రమే నిలబెట్టుకుంది. శాసనసభలో 9 సీట్లకు పరిమితమైంది. అసెంబ్లీలో విపక్ష హోదా కోల్పోయి తృతీయ స్థానానికి దిగజారింది. తర్వాత జరిగిన పంచాయతీ, పురపాలక సంఘాల పోరు, అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లోనూ పరాభవం పాలైన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్‌ ఆశల సారథిÅ రాహుల్‌ గాంధీ

 మూడు వంతుల టికెట్లు కొత్తవారికే...

ఈసారి ఎన్నికల మందుగా ‘ప్రగమన్‌’ యాప్‌ ద్వారా టికెట్లు ఆశిస్తున్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్‌ నాయకత్వం మూడు వంతుల టికెట్లు కొత్తవారికి కేటాయించింది. ఒక వంతు సీనియర్‌ నేతలను అభ్యర్థులుగా చేసింది. ఎన్నికల ముందు, టికెట్ల కేటాయింపు సమయంలో బిజద, భాజపాల్లోకి పలువురు హస్తం నేతలు చేరిపోవడంతో ఆ పార్టీకి గట్టి విఘాతం తగిలింది. తామంతా కలిసే ఉన్నామని పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ పునరుద్ఘాటిస్తున్నా, ఆ పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదు. నేతల మధ్య ఏకాభిప్రాయం, సమన్వయం కరవైంది. పీసీసీ అధ్యక్షులను తరచూ మార్చడం, ప్రజల్లో ఆ పార్టీ పట్ల ఆదరణ కనిపించకపోవడంతో చోటానేతలు, కార్యకర్తలు డీలా పడుతున్నారు.

 గ్యారంటీలపై నమ్మకం

కాంగ్రెస్‌ గ్యారంటీల హామీ ఓటు బ్యాంకును కొల్లగొడుతుందన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో ఉంది. యువతకు నిరుద్యోగ భృతి, మహిళల బ్యాంకు ఖాతాలకు నెలకు రూ.3 వేలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500లకే గ్యాస్‌ సిలిండరు, అన్నదాతల రుణాల మాఫీ, ఏడాది కాలంలో నిరుద్యోగులకు ఉపాధి హామీలు జనాలకు చేరువ చేస్తామంటున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ గ్యారంటీలను కరపత్రాలుగా ముద్రించి ఇంటింటికి పంచుతున్నారు. రాహుల్‌ గాంధీ రాకతో నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆదివారం సాలెపూర్‌లో జరిగిన రాహుల్‌ బహిరంగ సభకు ఉత్తరకోస్తా ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం ఇందుకో కారణం.

3న రాయగడకు రాహుల్‌

మే 3న రాయగడకు రాహుల్‌ మళ్లీ వస్తారని కాంగ్రెస్‌ అధికార వర్గాలు తెలిపాయి. మే 13న కొరాపుట్‌, నవరంగపూర్‌, బ్రహ్మపుర లోక్‌సభ స్థానాలతోపాటు పశ్చిమంలోని కలహండి, ఈ నాలుగు స్థానాల పరిధుల్లోని 28 అసెంబ్లీ సీట్లకు పోలింగ్‌ జరగనుంది. దక్షిణ ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు అభ్యర్థుల విజయానికి కీలకమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రి వర్గ సహచరులు తెలుగు ప్రాంతాల్లో ప్రచారానికి వస్తున్నారని తెలిసింది. మే 10న ప్రియాంక గాంధీ నవరంగపూర్‌ వస్తారని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఉత్తర కోస్తాలో ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

 విజయావకాశాలు పుష్కలం

పీసీసీ అధ్యక్షుడు, శరత్‌ పట్నాయక్‌ మంగళవారం నువాపడలో విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో బిజద పాలనా వైఫల్యాలు, అవినీతి, అధికార దుర్వినియోగం గమనించిన ఓటర్లు మార్పునకు శ్రీకారం చుడతారన్న నమ్మకం ఉందన్నారు.

కేంద్రం, రాష్ట్రంలో పట్టం

కేంద్ర మాజీ మంత్రి భక్తచరణ్‌దాస్‌ భవానీపాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ. కాంగ్రెస్‌ గ్యారంటీలు కర్ణాటక, తెలంగాణాల్లో అమలు జరిగాయని, ఒడిశా ప్రజలు ఇవి కోరుకుంటున్నారని, రాహుల్‌పై నమ్మకం పెంచుకున్న వారంతా లోక్‌సభ, అసెంబ్లీల్లో కాంగ్రెస్‌కు పట్టం కడతారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని