logo

65 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌

రాష్ట్రంలో తొలిదశలో మే 13న నిర్వహించనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల్లో 65 మందిపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో 48 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉండడం గమనార్హం.

Published : 08 May 2024 01:30 IST

మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఏడీఆర్‌ ప్రతినిధులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తొలిదశలో మే 13న నిర్వహించనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల్లో 65 మందిపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో 48 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉండడం గమనార్హం. ఒడిశా ఎన్నికల పరిశీలన, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) ఈ వివరాలను వెల్లడించింది. వాటి ప్రకారం... తొలిదశలో ఎన్నికలు నిర్వహించనున్న కొరాపుట్‌, నవరంగపూర్‌, కలహండి, బ్రహ్మపుర లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని 28 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 243 మంది బరిలో నిలిచారు. వీరిలో 65 మందిపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉండగా, 48 మందిపై తీవ్ర క్రిమినల్‌ కేసులున్నాయి. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం 2020, ఫిబ్రవరి 13న వివిధ రాజకీయ పార్టీల నుంచి కారణాలు అడిగిన విషయం తెలిసిందే. క్రిమినల్‌ కేసుల నేపథ్యం ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేయడానికి గల కారణాలను తెలపాల్సిందిగా ఆయా రాజకీయ పార్టీలకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీలకు చెందిన 64 శాతం మంది అభ్యర్థుల్లో 27 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నట్లు ఏడీఆర్‌ నివేదిక బహిర్గతం చేసింది.

భాజపా అభ్యర్థులే ఎక్కువ మంది

క్రిమినల్‌ కేసులున్న వారిలో భాజపా నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నట్లు ఏడీఆర్‌ పేర్కొంది. ఈ జాబితాలో భాజపా నుంచి 18 మంది ఉండగా, కాంగ్రెస్‌- 17, బిజద- 9, స్వతంత్రులు- 13, ఆప్‌ నుంచి ముగ్గురు ఉన్నట్లు వెల్లడించిన ఏడీఆర్‌ మిగతా అభ్యర్థులు వివిధ పార్టీలకు చెందినవారు ఉన్నారని బహిర్గతం చేసింది.

తుది విడతకు నోటిఫికేషన్‌ జారీ..

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: జూన్‌ 1న తుది విడత పోలింగ్‌ నిర్వహించనున్న మయూర్‌భంజ్‌, జాజ్‌పూర్‌, జగత్సింగ్‌పూర్‌, భద్రక్‌, బాలేశ్వర్‌, కేంద్రపడ లోక్‌సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు సంబంధించి ఎన్నికల సాంఘం (ఎస్‌ఈసీ) మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు 14వ తేదీ కాగా, 15న పరిశీలన, 17న ఉపసంహరణకు ముహూర్తంగా ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు