logo

28 నియోజకవర్గాల్లో 70 మంది కోటీశ్వరులు

రాష్ట్రంలో తొలిదశలో ఎన్నికలు నిర్వహించనున్న 28 శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 70 మంది కోటీశ్వరులు ఉన్నారు.

Published : 09 May 2024 04:20 IST

టాప్‌-10లో అవిభక్త కొరాపుట్‌ నుంచి ఇందిరా, బాహినీపతి
ఏడీఆర్‌ నివేదికలో వెల్లడి
రాయగడ పట్టణం, న్యూస్‌టుడే

ఇందిరా నందో , తారాప్రసాద్‌ బాహినీపతి

రాష్ట్రంలో తొలిదశలో ఎన్నికలు నిర్వహించనున్న 28 శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 70 మంది కోటీశ్వరులు ఉన్నారు. మే 13న జరగనున్న ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల నుంచి మొత్తం 243 మంది బరిలో నిలవగా, వీరిలో 29 శాతం మంది కోటీశ్వరులే. ఆస్తులపరంగా టాప్‌-10లో అవిభక్త కొరాపుట్‌ జిల్లా నుంచి ఇందిరానందో (బిజద), తారాప్రసాద్‌ బాహినీపతి (కాంగ్రెస్‌) ఉన్నారు. ఒడిశా ఎన్నికల పరిశీలన, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) ఈ వివరాలను బహిర్గతం చేసింది. వాటి ప్రకారం... అభ్యర్థుల్లో ఎక్కువ మంది ధనికులు ప్రధాన పార్టీలకు చెందిన వారు కావడం గమనార్హం. వీరిలో ఎన్నికల బరిలో ఉన్న బిజద అభ్యర్థుల్లో 89 శాతం మంది కోటీశ్వరులు కాగా, భాజపా, కాంగ్రెస్‌ నుంచి 50 శాతం మంది ఉన్నారు. ఈ మూడు పార్టీల నుంచి 28 మంది చొప్పున పోటీ పడుతుండగా,  బిజద నుంచి 25 మంది, కాంగ్రెస్‌, భాజపా నుంచి 14 మంది చొప్పున రూ.కోట్లకు అధిపతులు ఉన్నారు. ఆప్‌ తరఫున 11 మంది బరిలో ఉండగా రూ.కోటి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నవారు ఇద్దరు ఉన్నారు.

బిప్లబ్‌ పాత్ర్‌

టాప్‌-10 అభ్యర్థులు వీరే

రూ.33.36 కోట్ల ఆస్తులతో దిగపొహండి బిజద అభ్యర్థి బిప్లబ్‌ పాత్ర్‌ మొదటి స్థానంలో ఉండగా, గోపాల్‌పూర్‌ బిజద అభ్యర్థి బిక్రమ్‌కుమార్‌ పండా రూ.15.94 కోట్లు, ధరమ్‌గఢ్‌ భాజపా అభ్యర్థి సుధీర్‌ రంజన్‌ పట్టజోషి రూ.12.01 కోట్లతో తరువాత స్థానాల్లో ఉన్నారు. తొలి పది స్థానాల్లో ఉన్నవారిలో జునాగఢ్‌ నుంచి బిజద అభ్యర్థి దివ్యశంకర్‌ మిశ్ర రూ.11.89 కోట్లు, జయపురం బిజద అభ్యర్థి ఇందిరా నందో రూ.11.46 కోట్లు, చికిటి బిజద అభ్యర్థి చిన్మయనంద శ్రీరూప్‌దేబ్‌ రూ.10.57 కోట్లు, పర్లాఖెముండి కాంగ్రెస్‌ అభ్యర్థి బిజయ్‌కుమార్‌ పట్నాయక్‌ రూ.9.41 కోట్లు, ఖారియార్‌ బిజద అభ్యర్థి ఆదిరాజ్‌ మోహన్‌ పాణిగ్రహి రూ.7.94 కోట్లు, నువాపడ కాంగ్రెస్‌ అభ్యర్థి శరత్‌ పట్నాయక్‌ రూ.7.31 కోట్లు, జయపురం కాంగ్రెస్‌ అభ్యర్థి తారాప్రసాద్‌ బాహినీపతి రూ.6.24కోట్ల విలువైన ఆస్తులు కలిగిఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని