logo

గెలిచి వదిలేస్తారా?.. సమస్యలు పరిష్కరిస్తారా?

కంటాబంజి... బొలంగీర్‌ జిల్లాలోని ఈ ప్రాంతం వలసలకు చిరునామా. తరాల మారినా తమ తలరాతలు మారలేదని ఉసూరుమనే ప్రజలు రాష్ట్రేతర ప్రాంతాల్లో అసంఘటిత రంగాల్లో పనులు చేస్తూ కుటుంబాలకింత బువ్వ పెట్టేందుకు తపిస్తున్నారు.

Published : 09 May 2024 04:25 IST

విపక్ష నేతల విమర్శలు
నిన్న బిజేపూర్‌, నేడు కంటాబంజిలో నవీన్‌ పోటీ

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: కంటాబంజి... బొలంగీర్‌ జిల్లాలోని ఈ ప్రాంతం వలసలకు చిరునామా. తరాల మారినా తమ తలరాతలు మారలేదని ఉసూరుమనే ప్రజలు రాష్ట్రేతర ప్రాంతాల్లో అసంఘటిత రంగాల్లో పనులు చేస్తూ కుటుంబాలకింత బువ్వ పెట్టేందుకు తపిస్తున్నారు. కంటాబంజి అసెంబ్లీ నియోజకవర్గం దుస్థితిపై శాసనసభలో పలుసార్లు చర్చ జరిగినా పాలకులు స్పందించలేదు. పశ్చిమ ఒడిశాలోని ఈ వెనుకబడిన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పోటీ చేస్తున్నారు.

నెరవేరని జిల్లా ఏర్పాటు హామీ..

1997లో గంజాం జిల్లా అస్కా లోక్‌సభ స్థానం నుంచి తన రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన నవీన్‌ 2000లో ఈ నియోజకవర్గంలోని హింజిలి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తర్వాత 2004, 2009, 2014, 2019లో అక్కడి నుంచే వరుస విజయాలు సాధించారు. ఈసారి మళ్లీ ఇక్కడి నుంచి నామపత్రాలు దాఖలు చేశారు. గతసారి సీఎం హింజిలితోపాటు పశ్చిమ ఒడిశాలోని బరగఢ్‌ జిల్లా బిజెపూర్‌ నుంచి పోటీ చేశారు. రెండుచోట్లా గెలిచిన ఆయన బిజెపూర్‌ వదులుకున్నారు. గతసారి నవీన్‌ బిజెపూర్‌ నుంచి పోటీ చేయడానికి కారణం భాజపా దూకుడుకు కళ్లెం వేయడానికేనన్న వ్యాఖ్యలు వినిపించాయి. అప్పట్లో ప్రచారానికి వచ్చిన ఆయన బిజెపూర్‌ వాసులకు ఎన్నో హామీలిచ్చారు. బరగఢ్‌ జిల్లాలోని పదంపూర్‌ సబ్‌డివిజన్‌ను జిల్లా చేస్తానన్నారు. బిజెపూర్‌ సీటు వదులుకున్న సీఎం ఆ తర్వాత ఆ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని, అన్ని రంగాల్లో అగ్రగామి చేస్తానన్నారు. పదంపూర్‌ జిల్లా కల ‘అందని మానిపండు’ చందం కాగా ప్రజలు ఇబ్బందులు అలాగే కొనసాగుతున్నాయి.

బొలంగీర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వలస వెళుతున్న కార్మికులు

పత్తికేదీ గిట్టుబాటు?

ఈసారి నవీన్‌ హింజిలితోపాటు కంటాబంజి నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. వనరులు పుష్కలంగా ఉన్నా, సద్వినియోగానికి నోచుకోని కంటాబంజి వలసలకు పెట్టింది పేరు. ఈ నియోజకవర్గంలోని తురైరెలా సమితిలో అత్యధికంగా 40 వేల మంది రాష్ట్రేతర ప్రాంతాల్లో అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్నారు. విస్తారంగా పత్తి ఉత్పత్తి అయ్యే ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర లేదు. వ్యాపారులు, దళారులు చెప్పిందే ధర. దీనిపై పాలకుల నిఘాలేదు. ఈ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించి అభివృద్ధిలోకి తేవాలన్న రెండు దశాబ్దాల ప్రజల డిమాండు నెరవేరలేదు. విద్య, వైద్యం, మౌలిక సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయి. దీనిపై బొలంగీర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ నేత నర్సింగ మిశ్ర పలుసార్లు శాసనసభలో ప్రస్తావించారు. వెనుకబాటు, వలసలకు చిరునామా అయిన కంటాబంజిని సీఎం ఈసారి ఎంపిక చేసుకుని పోటీ చేయడానికి కారణం ఓటు బ్యాంకు కోసమేనన్నది స్పష్టం. తాను బరిలో దిగితే పశ్చిమ జిల్లాలపై ప్రభావం పడుతుందని, భాజపాను నిలవరించడానికి, ప్రజా వ్యతిరేకతను తుడిచి పెట్టేయడానికి ఇది ఎత్తుగడ కావచ్చని పరిశీలకులంటున్నారు.

సూరత్‌ మినీ గంజాం

24 ఏళ్లుగా గంజాం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నవీన్‌ ఉపాధి కల్పనలో విఫలమయ్యారన్నది నిష్ఠుర సత్యం. అయిదు లక్షల మంది (కార్మికశాఖ వివరాల ప్రకారం) ఈ జిల్లా వాసులు రాష్ట్రేతర ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. సూరత్‌ (గుజరాత్‌)లో అత్యధికంగా 3 లక్షల మంది ఉంటున్నారు. అందుకే సూరత్‌ను అంతా ‘మినీ గంజాం’గా పేర్కొంటారు. నేత, వజ్రాల కటింగ్‌ మిల్లుల్లో, ఇతర అసంఘటిత రంగాల్లో పనులు చేస్తున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న హింజిలి నియోజకవర్గంలో వలసలు ఎక్కువ. పండగలు, శుభకార్యాలకు చుట్టం చూపుగా వచ్చే వారంతా మళ్లీ వెళ్లిపోతుంటారు. అక్కడే పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు ఆయా పరిశ్రమల యాజమాన్యాల మోసాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయాల్లో రాజకీయ పార్టీలు వారి రాకపోకల ఖర్చులు భరించి తీసుకువస్తుంటాయి. రెండు పుష్కరాలుగా తనను ఆదరిస్తున్న గంజాం జిల్లాలో సూక్ష్మ, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పించి ఉంటే ప్రజలు వలసపోయే పరిస్థితి ఉండేది కాదు. ఈ దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టని నవీన్‌ గంజాం జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నా సద్వినియోగం చేయలేకపోయారు. 35 శాతం పంటపొలాలకు నీటి పారుదల లక్ష్యం నెరవేరలేదు. ఉత్పత్తుల నిల్వకు శీతల గిడ్డంగులు లేవు. మత్స్య సంపదకు మార్కెటింగ్‌ సౌకర్యం లేదు. పర్యాటక రంగం అభివృద్ధి సాధించలేదు. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. ప్రభుత్వాసుపత్రుల పరిస్థితి దయనీయం. వైద్యులు లేని దవాఖానాలు ఆశించిన సేవలు అందించలేకపోతున్నాయి. డ్రాపౌట్లు యథాతథంగా ఉన్నాయి. ఇది స్థూలంగా గంజాం జిల్లా ముఖ చిత్రం.  


వలసలపై ఇదీ బిజద సమాధానం

బిజు కార్మిక సమాఖ్య సమన్వయకర్త, కటక్‌ నగర మేయరు సుభాష్‌ సింగ్‌కు సీఎం కంటాబంజి ఎన్నికల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. రాజకీయ వ్యూహకర్తగా బిజదలో గుర్తింపు పొందిన ఆయన రంగంలోకి దిగారు. మంగళవారం రాత్రి సుభాష్‌ విలేకరులతో మాట్లాడుతూ... వలసలపై భిన్నంగా మాట్లాడారు. ఎక్కువ సంపాదించాలన్న ధ్యేయం గలవారు సూరత్‌, ముంబయి, బెంగుళూరు, చెన్నై తదితర నగరాలకు వెళ్లి ఇటుకల బట్టీలు, ఇతర కర్మాగారాల్లో పనులు చేస్తున్నారన్నారు. వలస వెళ్లడాన్ని మరికొందరు గౌరవంగా భావిస్తున్నారన్నారు. పశ్చిమ ఒడిశా ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కంటాబంజిని ఎంచుకున్న సీఎంను ప్రజాబంధుగా అభివర్ణించారు. కంటాబంజి వికాసానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేశారన్నారు.  


బూటకం హామీలు

కంటాబంజి సిటింగ్‌ ఎమ్మెల్యే సంతోష్‌ సింగ్‌ సలూజా మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గతసారి బిజెపూర్‌ వాసులకు మాయమాటలు చెప్పిన సీఎం ఈసారి కంటాబంజికి వచ్చారన్నారు. టెక్స్‌టైల్‌ మిల్లు ఏర్పాటు చేయాలని, వలసల నివారణకు శాశ్వత కార్యక్రమాలు ప్రారంభించాలని అసెంబ్లీలో చేసిన వినతులు పట్టించుకోని నవీన్‌ బూటకం హామీలివ్వడానికి కంటాబంజి వచ్చారని ప్రజలంతా భావిస్తున్నారన్నారు.


ఏం చెబుతారు?

కంటాబంజిలో జనాదరణ గల లక్ష్మణ్‌బాగ్‌ను భాజపా నిలబెట్టింది. ఉన్నత విద్యావంతుడైన ఆయన ఆదర్శభావాలు గల సామాజిక కార్యకర్త. మాతృభూమికి సేవలు చేయాలన్న సత్సంకల్పంతో పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆదరిస్తారని విలేకరులకు చెప్పారు. భాజపాకు పశ్చిమంలో సానుకూల పవనాలు వీస్తున్నందున ఓటమి భయం గల సీఎం తాను పోటీ చేస్తే పరిస్థితి కొంతమేర మారుతుందన్న ఎత్తుగడ వేశారని దీన్ని ఓటర్లు చిత్తు చేస్తారన్నారు. కంటాబంజికి ఏం చేశారని ప్రశ్నిస్తున్న వారికి నవీన్‌ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.


పాండ్యన్‌ కోసమే ఈ సన్నాహం

భాజపా రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు గోలక్‌మహాపాత్ర్‌ బుధవారం భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... హింజిలి, కంటాబంజిలో పోటీ చేస్తున్న సీఎం తనకు అండగా ఉన్న వి.కార్తికేయ పాండ్యన్‌ కోసం ఒక సీటు రిజర్వు చేయడానికి ఎత్తుగడ వేశారన్నారు. రెండు చోట్ల గెలిస్తే ఒకదాన్ని వదులుకుని పాండ్యన్‌కు అసెంబ్లీకి ఎంట్రీ చేయించాలన్న దురాలోచనతో ఉన్నారని, ఇది నెరవేరదని, ప్రజలు ఈసారి గుణపాఠం చెబుతారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు