logo

బిజదలో చీలిక తెచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా యోచన: పాండ్యన్‌

తొలివిడత పోలింగ్‌కు మూడు రోజుల వ్యవధి మిగిలున్న తరుణంలో బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Published : 10 May 2024 03:16 IST

గోపాల్‌పూర్‌లో బిజద నేతలు, పాత్రికేయులతో పాండ్యన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: తొలివిడత పోలింగ్‌కు మూడు రోజుల వ్యవధి మిగిలున్న తరుణంలో బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గంజాం జిల్లాలో రెండు రోజులు ఎన్నికల ప్రచారం చేసిన పాండ్యన్‌ గోపాల్‌పూర్‌లో విడిది చేశారు. బిజదకు అనుకూలంగా ఉన్న కొన్ని ప్రసార మాధ్యమాల ముందు మాట్లాడారు.

కుటిల యత్నాలు...

రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసే ఉద్దేశం భాజపాకు లేదన్నారు. 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లు వస్తే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో గతంలో చేసిన కుటిల యత్నాలు ఒడిశాలోనూ చేయాలన్న ధ్యేయంతో ఉందన్నారు. బిజదలో చీలికలు తెచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టే ఎత్తుగడలో ఉన్న భాజపాకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మెజారిటీ సీట్లు సాధించలేమన్న సంగతి భాజపా పెద్దలకు తెలుసునని, కుయుక్తులతో గద్దె ఎక్కాలన్న ‘మిషన్‌’ అమలుకు శ్రీకారం చుట్టారని పాండ్యన్‌ చెప్పారు.

ధర్మేంద్ర పదేళ్లలో ఏం చేశారు?

ముఖ్యమంత్రి నవీన్‌ను తరచు విమర్శిస్తున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాతృభూమికి గడిచిన పదేళ్ల కాలంలో ఏం చేశారని పాండ్యన్‌ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో గెలిచిన 8 మంది భాజపా ఎంపీలు లోక్‌సభలో రాష్ట్రం ఇబ్బందులు, హక్కుల గురించి ఒక్కసారైనా ప్రస్తావించారా? అని అడిగారు. రాష్ట్ర గౌరవం, సంస్కృతి గురించి తరచూ మాట్లాడుతున్న భాజపా నేతలు శ్రీజగన్నాథ్‌, శామలాయి ఆలయాల కారిడార్‌ నిర్మాణాలపై విమర్శలు చేస్తున్నారని, అభివృద్ధి పనులపైనా బురద జల్లుతున్నారని, ఇదంతా ప్రజలు చూస్తున్నారన్నారు.

ఆగ్రహించిన భాజపా

పాండ్యన్‌ వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడ్డారు. ఆ పార్టీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు సమీర్‌ మహంతి బుధవారం రాత్రి భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి సీఎం వద్ద గుమస్తాగా ఉంటూ పాలనాయంత్రాంగాన్ని గుప్పిట్లోకి తీసుకోవడానికి వేసిన ఎత్తుగడను చిత్తుచేస్తామన్నారు. ఓడిపోతామన్న భయంతో బిజద నేతలు అవాస్తవాలు చెబుతున్నారన్నారు.

భువనేశ్వర్‌ లోక్‌సభ అభ్యర్థి అపరాజిత షడంగి గురువారం విలేకరులతో మాట్లాడుతూ... నవీన్‌ సామర్థ్యం కొరవడిన సీఎంగా ముద్రపడ్డారని, వెనుకబాటు, వలసలు, ఖనిజసంపదల దుర్వినియోగం, అవినీతికి నిలువుటద్దమన్నారు. భాజపాకు అసెంబ్లీలో ఆధిక్యత లభిస్తుందని, గుమస్తాను తమిళనాడు పంపిస్తామని ఘాటుగా విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని