logo

ఓటుందో.. లేదో చూసుకుందామా..

 రానున్న ఎన్నికలు చాలా కీలకమైనవి. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలపై ఉంది. జాబితాలో పేరుందా? లేదా? అని తనిఖీ చేసుకోవడం ఓటర్ల కనీస బాధ్యత.

Published : 21 Jul 2023 03:43 IST

* పార్వతీపురం మన్యం జిల్లా లక్ష్మీనారాయణపురం గ్రామంలో సున్నా ఇంటి నంబరుతో 30 ఓట్లు ఉన్నాయి. పార్వతీపురం పట్టణంలోని రాయగడ రోడ్డులో సున్నా ఇంటి నంబరుతో ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయని గత నెల 30న మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఉప తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. ఇదేలా సాధ్యమని ప్రశ్నించారు.


*మార్చి 13 తేదీన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో విజయనగరంలో కస్పా ఉన్నత పాఠశాల కేంద్రంలో 33 మంది ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఓటేయడానికి వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమేష్‌చంద్ర పట్నాయక్‌ తన ఓటు రద్దు కావడంపై అధికారులను నిలదీశారు. ఛాలెంజింగ్‌ ఓటు ఇవ్వాలని కోరుతూ ఆయన పోలింగ్‌ కేంద్రం వద్దే నిరసన తెలిపారు. కావాలనే రద్దు చేశారని ఆరోపించారు. సంగీత కళాశాల పోలింగ్‌ కేంద్రంలో 80 ఓట్లు ఒకే పేరుతో రెండేసి ఉన్నట్లు గుర్తించారు.


ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్న ఎన్నికల అధికారులు, బీఎల్వోలు (పాతచిత్రం)

విజయనగరం అర్బన్‌, విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికలు చాలా కీలకమైనవి. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఓటర్లు, ప్రతిపక్ష పార్టీలపై ఉంది. జాబితాలో పేరుందా? లేదా? అని తనిఖీ చేసుకోవడం ఓటర్ల కనీస బాధ్యత. ఏమాత్రం అలక్ష్యం చేసినా.. రాబోయే ఎన్నికల్లో ఓటేసే అవకాశం కోల్పోనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024లో భాగంగా శుక్రవారం నుంచి నెల రోజుల పాటు బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్వో) ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయనున్నారు.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల తమ పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని ఓటర్ల ఆరోపణలు ఉన్నాయి. శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో సంతకం చేయడం రాని వారు కూడా పట్టభద్రుల ఓటేయడానికి పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


ప్రతిపక్షాలకు గొప్ప అవకాశం

పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీల ఏజెంట్లు బీఎల్వోల వెంట వెళ్లి తనిఖీలో పాల్గొనేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల రోజులు ప్రతిపక్ష పార్టీలు క్షేత్రస్థాయిలో వారు గుర్తించిన అవకతవకలను సరిచేయించొచ్చు. అర్హులు ఓటు హక్కు కోల్పోకుండా చూడొచ్చు. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఇతర నకిలీ ఓట్లను ఆధారాలు చూపించి జాబితా నుంచి తొలగించేలా చేయొచ్చు. అర్హులకు ఓటు హక్కు లేకపోతే వారి వివరాలను నమోదు చేయించొచ్చు. అర్హులైన వారివి తొలగించి ఉంటే మళ్లీ దరఖాస్తు చేయించొచ్చు. ఒకే డోర్‌ నంబరుతో వందల సంఖ్యలో బోగస్‌ ఓట్లు ఉంటే వాటిని తొలగింపజేయొచ్చు. అక్టోబరు 17న ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంది.  అందులో అర్హులకు ఓటు లేకపోతే అక్టోబరు 17 నుంచి నవంబరు 30 వరకూ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించొచ్చు. అవన్నీ పరిగణనలోకి తీసుకుని 2024 జనవరి 5న ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తుంది. దానిలో లోపాలున్నా దరఖాస్తు చేయించి సరిచేయించొచ్చు.
సున్నా ఇంటి నంబరుతో ఉన్నా, ఒకే ఇంటి నంబరుతో ఎక్కువ ఓట్లు ఉన్నా, వందేళ్లు పైబడిన ఓట్లను ప్రధానంగా పరిశీలించనున్నారు. ఇటువంటి వారిని గుర్తించి ఫారం-8లో నమోదు చేసి దరఖాస్తు చేయిస్తారు. ఈ మూడు కేటగిరీల వారు సర్వేలో ఓటును సరిచేసుకునేలా చైతన్యవంతులు కావాల్సి ఉంది.


ఇంత మంది ఉన్నారు

2023 సమగ్ర సవరణ జాబితా ప్రకారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 15,12,129 మంది ఓటర్లు ఉన్నారు. ఈ జాబితా ఆధారంగా సర్వే చేయనున్నారు. విజయనగరం జిల్లాలో 1848 మంది బీఎల్వోలు సర్వేలో పాల్గొంటున్నారు.


వీటిని చూసుకోవాలి..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేసేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఈ పరిస్థితి ఉంది.  
* ఒకే ఇంట్లో భర్తకు ఓటు ఉంటే భార్యకు ఉండదు.
* దశాబ్దాల తరబడి ఒకే చిరునామాలో నివసిస్తున్న వారి పేర్ల మీద ఆ ప్రాంతంలో ఓటుహక్కు లేకపోవచ్చు.
* బతికున్న వారికి ఉండవు.
* ఏళ్ల కిందట చనిపోయిన వారికి ఇంకా ఓటు హక్కు ఉండవచ్చు.
* గత స్థానిక సంస్థల ఎన్నికల్లో  ఓటేసిన వారి పేర్లు ప్రస్తుత జాబితాలో కనిపించకపోవచ్చు.
* కుటుంబంలో కొందరి ఓట్లు ఒక పోలింగ్‌ కేంద్రంలో ఉంటే మరికొందరివి వేరే కేంద్రాల్లో ఉంటాయి.
* మరికొన్ని కుటుంబాల్లో ఓట్లు గల్లంతయ్యాయి.
* ఒకే ఇంటి నంబరులో వందల సంఖ్యలో ఓటర్లున్నట్లు జాబితాలో నమోదైన పరిస్థితి ఉంది.
* జాబితా నుంచి ఓటు తొలగించడానికి ముందు వారికి తప్పనిసరిగా అధికారులు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
* మరణించిన ఓటర్లు పేర్లను సంబంధిత కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చిన అనంతరం తొలగించాలి.


ప్రజలు సహకరించాలి

బీఎల్వోలకు ప్రజలు సహకరించాలి. ఇంటింటికీ వచ్చి ఓటర్ల జాబితాలను తనిఖీ చేస్తారు. పూర్తి సమాచారం అందించడం ద్వారా తప్పొప్పులకు తావులేని ఓటర్ల జాబితా రూపొందించడానికి వీలు కలుగుతుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లు తనిఖీల్లో పాల్గొనవచ్చు.

నాగలక్ష్మి, కలెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని