logo

ఉల్లంఘనలు కనిపించడం లేదా?

పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగారావు ఏం చేసినా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది.

Published : 20 Apr 2024 03:53 IST

రెడ్డివానివలసలో ప్రచారం చేస్తున్న జోగారావు

సీతానగరం, న్యూస్‌టుడే: పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగారావు ఏం చేసినా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఆయన సీతానగరం మండలం రామవరం పంచాయతీ రెడ్డివానివలసలో శుక్రవారం ఉదయం 6 నుంచి 8.30 వరకు ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతి పొందారు. వైకాపా నాయకులు గ్రామానికి ఉదయాన్నే వచ్చినప్పటికీ ఎమ్మెల్యే జోగారావు 8.20కి చేరుకొని ప్రచారం ప్రారంభించారు. సమయం మించిపోయినా 9.10 వరకు ప్రచారం చేశారు. దీంతో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని స్థానికులు సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటికే అక్కడున్న ఎఫ్‌ఎస్‌టీ బృందం సభ్యుడు చిన్నారావు ప్రచారం నిలిపేయాలని కోరడంతో స్థానిక నాయకుడి ఇంట్లో టీ తాగి 9.30 సమయంలో గ్రామం నుంచి వెళ్లిపోయారు. సీవిజిల్‌ ఫిర్యాదు మేరకు వెంటనే ప్రచారం ముగించినట్లు ఎఫ్‌ఎస్‌టీ బృందం సభ్యులు, ఎంపీడీవో ఈశ్వరరావు తెలిపారు.

బొత్స నామినేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగి

గరివిడి, న్యూస్‌టుడే: చీపురుపల్లిలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ప్రభుత్వ ఉద్యోగి ఉండడం గమనార్హం. విజయనగరం గ్రామీణ నీటి సరఫరా విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన గణేష్‌ను ఎనిమిది నెలల క్రితం మన్యం జిల్లా డ్వామా విభాగానికి ఏవోగా బదిలీ చేశారు. అక్కడి నుంచి జీఏడీకి డిప్యుటేషన్‌ వెళ్లి మంత్రి బొత్స సత్యనారాయణ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కొనసాగుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆయన రిలీవ్‌ కావాలి. కానీ ఇంకా కొనసాగుతూ మంత్రి వెంట వెళ్లారు. దీనిపై ఎన్నికల అధికారులు స్పందించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని