logo

తోటపల్లి పార్కు జీవం తీసేశారు

మన్యంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తెదేపా హయాంలో 2016-17 మధ్య తోటపల్లి ప్రాజెక్టు గట్టుకు ఆనుకొని ఐటీడీఏ ఆధ్వర్యంలో పార్కు ఏర్పాటు చేశారు.

Published : 20 Apr 2024 04:07 IST

మూలకు చేరిన షికారుకు తీసుకువచ్చిన పడవ

పార్వతీపురం, గరుగుబిల్లి, న్యూస్‌టుడే: మన్యంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా తెదేపా హయాంలో 2016-17 మధ్య తోటపల్లి ప్రాజెక్టు గట్టుకు ఆనుకొని ఐటీడీఏ ఆధ్వర్యంలో పార్కు ఏర్పాటు చేశారు. పర్యాటకంగా తీర్చిదిద్దడం, నిర్వాసిత గిరిజన కుటుంబాలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూ.60 లక్షలు వెచ్చించారు. గిరిజనుల సంస్కృతి ఉట్టిపడేలా బొమ్మలు, చిన్నారులకు ఆహ్లాదం కలిగించేలా జారుడు బల్లలు, ఊయలలు, జంపింగ్‌ పరికరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ జలాశయంలో జలవిహారం చేసేందుకు బోట్లు సమకూర్చారు. దీంతో పాటు జలాశయంలో జలవిహారం చేసేందుకు రూ.5 లక్షలతో పడవను కొనుగోలు చేశారు. దీంతో పరిసర ప్రాంతాలతో పాటు తోటపల్లి దేవస్థానానికి వచ్చే వివిధ జిల్లాల ప్రజలకు ఇక్కడికి వెళ్లి సేదతీరేవారు. ఆ సమయంలో సందర్శకుల నుంచి రూ.5 వసూలు చేసేవారు. ఇదంతా గతం..

వైకాపా అధికారంలోకి వచ్చాక మన్యంలో ఐటీడీఏను కనుమరుగు చేసేసింది. దీంతో ఎంతో పేరున్న ఐటీడీఏ పార్కు పూర్తిగా జీవం కోల్పోయింది. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన జారుడు బల్లలు, ఊయలలు ముక్కలుగా విరిగిపోయాయి. గతంలో పచ్చగా కళకళలాడిన పార్కు నేడు ఎండిన గడ్డి, రాళ్లతో దర్శనమిస్తోంది. సౌకర్యాలు లేకపోయినా గతంలో రూ.5గా ఉన్న టికెట్‌ ధరలు రూ.20గా మార్చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్తు దీపాలు తూతూమంత్రంగా వెలుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని