logo

పసుపు సంద్రం

సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు.

Published : 26 Apr 2024 04:06 IST

నామినేషన్లు వేసిన సంధ్యారాణి, విజయచంద్ర

మాట్లాడుతున్న సంధ్యారాణి, చిత్రంలో గీత

సాలూరు, న్యూస్‌టుడే: సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నివాసం నుంచి ఎన్టీఆర్‌ సెంటర్‌ వరకు దారి పొడవునా తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో జన సునామీని తలపించింది. ప్రచార రథంపై నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సంధ్యారాణి, కొత్తపల్లి గీత ప్రజలు, అభిమానులకు అభివాదం చేస్తూ నినాదాలు చేశారు. కూటమికి రోజురోజుకీ జనాదరణ పెరుగుతోందని చెప్పడానికి ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలే నిదర్శనమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు భంజ్‌దేవ్‌ అన్నారు. పలు కూడళ్లలో సంధ్యారాణికి మహిళలు హారతులు పట్టారు.

విజయచంద్ర‘హాసం’

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి కూటమి నుంచి తెదేపా అభ్యర్థి బి.విజయచంద్ర గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి తెదేపా, భాజపా, జనసేన నాయకులు తరలిరావడంతో జిల్లా కేంద్రం కిక్కిరిసిపోయింది. పట్టణంలోని పాతబస్టాండ్‌ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సాగిన ప్రదర్శనలో అరకు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత, బొబ్బిలి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బేబినాయన, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు, భాజపా జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, జనసేన సమన్వయకర్త ఎ.మోహనరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలు, వార్డుల నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఆయన ఆర్డీవో కార్యాలయానికి కుటుంబ సమేతంగా వెళ్లి నామపత్రాలు దాఖలు చేశారు. తెదేపా నాయకులు బి.సీతారాం, జి.వెంకటనాయుడు, జనసేన నాయకుడు ఎ.మోహనరావు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని