అమెరికన్‌ యాస రాదన్నారు!

అమ్మాయిలు చదువుకోవడానికి విదేశాలకు వెళ్లడం... వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడటం తెలిసిందే! కానీ చదివిన దానికి భిన్నంగా ముప్పయ్యో పడిలో మరో వృత్తిని ఎంచుకుని రాణించడం కచ్చితంగా చెప్పుకోదగ్గ అంశమే.

Published : 22 May 2024 01:41 IST

అమ్మాయిలు చదువుకోవడానికి విదేశాలకు వెళ్లడం... వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడటం తెలిసిందే! కానీ చదివిన దానికి భిన్నంగా ముప్పయ్యో పడిలో మరో వృత్తిని ఎంచుకుని రాణించడం కచ్చితంగా చెప్పుకోదగ్గ అంశమే. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితులైన జయ బాడిగ ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు మహిళ. తన ప్రయాణాన్ని ‘వసుంధర’తో పంచుకున్నారిలా..!

మీ బాల్యం గురించి...

పుట్టింది విజయవాడలోనే అయినా పెరిగిందంతా హైదరాబాద్‌లో. నాన్న రామకృష్ణ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ. అమ్మ ప్రేమలత. నలుగురు పిల్లల్లో నేను మూడో అమ్మాయిని. సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌లో చదువుకున్నా. మిషనరీ స్కూల్‌ కావడంతో సోషల్‌సర్వీస్‌ కూడా చేయించేవారు. కొంత నాన్న నుంచీ నేర్చుకున్నా. అలా చిన్నప్పట్నుంచే సమాజం గురించి ఆలోచించడం అలవాటైంది. అమ్మకి నన్ను లా చదివించాలని ఉండేది. కానీ నాన్నకి బయటకు పంపడం ఇష్టం లేదు. దాంతో ఉస్మానియా నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో డిగ్రీ చేశా.

మరి ఈ వృత్తిలోకి ఎలా...

నిజానికి ఈ వృత్తిలోకి అనుకోకుండా వచ్చా. బోస్టన్‌ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ చేశాక కొన్నాళ్లు ‘వీవ్‌’(విమెన్‌ ఎస్కేపింగ్‌ ఎ వయొలెంట్‌ ఎన్విరాన్‌మెంట్‌) అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేశా. అక్కడే మహిళల సమస్యలు లోతుగా అర్థమయ్యాయి. ముఖ్యంగా మనదేశం నుంచి వచ్చిన మహిళలకి ఇక్కడి కోర్టులు, చట్టాల గురించి పెద్దగా అవగాహన ఉండదు. స్థానిక మహిళలకీ ఎన్నో సమస్యలు. పిల్లలపై లైంగిక దాడులు... ఇవన్నీ విన్నాక ‘నేనే లా చదివితే ఎలా ఉంటుంది?’ అనే ఆలోచన వచ్చింది. అలా శాంటాక్లారా విశ్వవిద్యాలయంలో లా డిగ్రీలో చేరా. మావారు ప్రవీణ్‌ అప్పట్లో ఇంటెల్‌లో హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌. లా చేస్తున్నప్పుడే పాప పుట్టింది. తనతో కాలిఫోర్నియా బార్‌ ఎగ్జామ్‌కి సిద్ధమవ్వడం కష్టమనిపించింది. అందుకే ఇండియాలో అమ్మ దగ్గర తనని వదిలి ఎగ్జామ్‌ రాశా. ఆ వెంటనే పాపను తెచ్చేసుకున్నా. ఇక రిజల్ట్స్‌.. ఆ రోజు చూడాలి నా టెన్షన్‌. పాపను ఒళ్లో పెట్టుకుని ల్యాప్‌ట్యాప్‌ తెరిచి ‘దేవుడా దేవుడా’ అనుకుంటూ కూర్చున్నా. బార్‌ కౌన్సిల్‌ రిజిస్టర్‌లో నా పేరు చూసుకున్నాక హమ్మయ్య అనుకున్నా. కుటుంబ సహకారం తోడవ్వడంతో కాలిఫోర్నియాలో ఫ్యామిలీ లా నిపుణురాలిగా రాణించగలిగా. 2018 నుండి 2022 వరకూ సొంతంగా ప్రాక్టీసు చేశా. ఆపై కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్, గవర్నర్స్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌లోనూ అటార్నీగానూ చేశా. 2022 నుంచి సుపీరియర్‌ కోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్నా.

వృత్తిజీవితంలో సవాళ్లు!

అన్నిచోట్లా ఉన్నట్టే ఇక్కడా లింగవివక్షతో సహా ఎన్నో సవాళ్లుంటాయి. న్యాయవాదిగా పనిచేస్తున్న తొలినాళ్లలో నాకు అమెరికన్‌ యాస రాదని ఎగతాళి చేసేవారు. అవేమీ పట్టించుకోకుండా... కోర్టులో నేనేంటో నిరూపించుకున్నా. సామాన్యులు కోర్టు ఖర్చుల్ని భరించలేరు. పైగా విడాకుల కేసుల్లో పిల్లలు నలిగిపోతారు. అందుకే సాధ్యమైనంత వరకూ ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ చేసి సర్దిచెప్పేదాన్ని. నావల్ల కొందరికైనా న్యాయం అందాలనుకునేదాన్ని.

పిల్లల పెంపకంలో...

పనిచేసుకుంటూ, పిల్లల్ని చూసుకోవడం పెద్ద టాస్కే. మొదట్లో అమ్మ, అత్తమ్మ సపోర్ట్‌ ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు కాబట్టి సొంతంగా చేసుకోగలుగుతున్నారు. కానీ మనవాళ్లకి ఇక్కడి బాలల చట్టాలపై అవగాహన లేక ఇబ్బందులు పడుతుంటారు. ఆ మధ్య నాకు తెలిసిన ఓ కుటుంబంలో ఏదో వేడుక... అర్ధరాత్రి టీ చేసుకుని తాగుతున్నారు. ఈ టీ కాస్తా పొరపాటున పక్కనే ఉన్న పాప చేతిమీద ఒలికింది. మర్నాడు హాస్పిటల్‌కి తీసుకెళితే... అంత రాత్రి వరకూ పిల్లలను ఎందుకు నిద్రపుచ్చలేదు, స్టవ్‌ దగ్గరకు ఎందుకు రానిచ్చారు? అంటూ పెద్ద చర్చ...కేసు. అంతేనా... స్కూల్లో చిన్నారుల బిహేవియర్‌లో ఏమాత్రం తేడా ఉన్నా పెద్దవాళ్లమీద నిఘా పెట్టేస్తారు.  

మన సంస్కృతిపై మీ అభిప్రాయం...  

ఎక్కడ ఉన్నా మన మూలాల్ని మరిచిపోకూడదు. అందుకే పండగలు జరుపుకోవడంతోపాటు వరలక్ష్మీ వ్రతం కూడా చేస్తుంటా. ఓసారి పూజలో పడి కేసు వాయిదా మర్చిపోయా. ఫోన్‌ రాగానే వెంటనే వెళ్లి... వచ్చాక మళ్లీ పేరంటానికి హాజరయ్యా. ఓ తల్లిగా మా పిల్లలకీ మన ఆచార వ్యవహారాలు నేర్పిస్తుంటా. అలాగే వాళ్ల అవసరాలన్నీ దగ్గరుండి చూసుకుంటా. ఏ స్థాయికి వెళ్లినా కుటుంబ జీవితంలోనే కదా అసలైన ఆనందం దొరికేది!

జడ్జి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?  

చాలా కష్టం! 2021లో అప్లై చేస్తే ఫలితాలు ఇప్పుడొచ్చాయి. అప్లికేషన్‌ పూర్తిచేయడానికే రెండు మూడు నెలలు పడుతుంది. ఇష్టాయిష్టాల నుంచి మొదలుపెట్టి స్కూల్, కాలేజీ డేస్‌ గురించీ రాయాలి. న్యాయవాదిగా ఎలాంటి కేసులు డీల్‌ చేశానో చెప్పాలి. కనీసం నా జీవితంలోని 75 మంది గురించి ప్రస్తావించాలి. అప్లికేషన్‌ పూర్తయ్యేటప్పటికి మన జీవితం తెరిచిన పుస్తకంలా అనిపిస్తుంది. ఆ వివరాలన్నీ చెక్‌ చేసి జ్యుడిషియల్‌ కమిటీకి పంపిస్తే వాళ్లు నామినేట్‌ చేస్తారన్నమాట. తరవాత మరో బృందం స్క్రూట్నీ చేస్తుంది. అందులో మనం చెప్పిన 75మందికి మరికొందరిని చేర్చి మొత్తం 250 మందిని ప్రశ్నిస్తారు. ఆ తరవాతే ఇంటర్వ్యూ. వాళ్లలో ఏ ఒక్కరు నెగెటివ్‌గా చెప్పినా... దాని గురించి ఇంటర్వ్యూలో అడుగుతారు. వాళ్లు కన్విన్స్‌ అయి గవర్నర్‌కి పంపాక, ఖాళీ ఉంటే అప్పుడు మరో ఇంటర్వ్యూ. ఇంత కథ ఉంటుంది కాబట్టే... ఆ పోస్టుకు అంత గుర్తింపు మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్