logo

కలెక్టరేట్‌కే దిక్కులేదు.. రాజధానులు కడతారా!!

ప్రభుత్వం ఎంత విఫలమైందో జిల్లాలో పాలన చూస్తే తెలుస్తుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌.. పార్వతీపురం మన్యం జిల్లాగా ఆవిర్భవించి రెండేళ్లు దాటుతున్నా కలెక్టరేట్‌, ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క భవనం కూడా నిర్మించలేకపోయారు.

Published : 09 May 2024 04:28 IST

న్యూస్‌టుడే, పార్వతీపురం

ప్రభుత్వం ఎంత విఫలమైందో జిల్లాలో పాలన చూస్తే తెలుస్తుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌.. పార్వతీపురం మన్యం జిల్లాగా ఆవిర్భవించి రెండేళ్లు దాటుతున్నా కలెక్టరేట్‌, ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క భవనం కూడా నిర్మించలేకపోయారు. ప్రస్తుతం అన్ని శాఖలు పరాయి పంచన కునారిల్లుతున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లాకు కలెక్టర్‌ కార్యాలయ సముదాయం నిర్మాణానికి రూ.99.90 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఓ జీవో ఇచ్చింది. ఆ మేరకు భవన సముదాయం నిర్మాణానికి అడ్డాపుశిల వద్ద కొండపై అధికారులు స్థలం గుర్తించారు. ఇది నిర్మాణానికి అనువైనది కాదని, నిర్మాణ వ్యయం రెండింతలు అవుతుందని ఇంజినీరింగ్‌ శాఖ అభ్యంతరం చెప్పింది. కొందరు అధికారులు, నేతలు చెప్పిన మేరకు ఆ స్థలమే అనువైందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అక్కడితో అంతే.. ఇప్పటి వరకు భూమిపూజ జరగలేదు.

ఎక్కువ కార్యాలయాలు నడుస్తున్న ఆర్సీఎం పాఠశాల

అన్నీ గిరిజన సంక్షేమ శాఖవే

జిల్లా కేంద్రంలో కార్యాలయాలకు ఉపయోగిస్తున్న భవనాలు అన్నీ గిరిజన సంక్షేమ శాఖకు చెందినవే ఉన్నాయి. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణలు ఇచ్చేందుకు నిర్మించిన కేంద్రంలో ఎస్పీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. గతంలో ఐటీడీఏ పీవో నివాసం ఉండేందుకు ఏర్పాటు చేసిన భవనాన్ని సంయుక్త కలెక్టర్‌కు కేటాయించారు. ఐటీడీఏ సిబ్బంది ఉండేందుకు కట్టిన నివాస సముదాయంలో జల వనరుల శాఖ, ర.భ.శాఖ, వ్యవసాయ శాఖ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటికి గిరిజన శాఖకు రూపాయి అద్దె చెల్లించడం లేదు.  

తెదేపా హయాంలో నిర్మించినదే దిక్కు

పార్వతీపురం కలెక్టరేట్‌కు ఎటువంటి భవనం లేక.. గత తెదేపా హయాంలో రూ.5 కోట్లతో నిర్మించిన ఐటీడీఏ భవనమే దిక్కయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు ఇవ్వక సగంలో ఆగిపోయిన భవనానికి ఐటీడీఏ సొమ్ముతో హంగులు చేశారు. కలెక్టరేట్‌, కలెక్టర్‌ బంగ్లాలో ప్రహరీ, సిమెంట్‌ రోడ్లు, ఇతర పనుల కు రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేశారు.


గోదాములు లేక..

వైద్యారోగ్య శాఖకు గోదాము సదుపాయం లేక ఇలా ఆరుబయటే మందులు ఉంచాల్సి వస్తోంది

వైద్య ఆరోగ్య శాఖ ప్రతి నెలా ఆసుపత్రులకు మందులు పంపిణీ చేయాలి. వీటిని నిల్వ చేసేందుకు గోదాములు లేక మందుల పెట్టెలు కార్యాలయ సముదాయం బయటే వరండాలో ఉంచుతున్నారు. మలేరియా నివారణ విభాగం మందులు, పిచికారీ ద్రావణాలు ఆరుబయటే పెట్టాల్సి వస్తోంది.


అన్నీ సమస్యలే

ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురుగా ఉన్న మిషనరీ పాఠశాలను అద్దెకు తీసుకున్నారు. ఇందులోనే వ్యవసాయం, దానికి అనుబంధంగా ఉండే నాలుగైదు శాఖలు, విద్య, వైద్యం, వాటికి అనుబంధ శాఖలు, సంక్షేమ శాఖలు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా కార్యాలయం, ఆడిట్‌, రిజిస్ట్రేషన్‌, జిల్లా జల యాజమాన్య సంస్థ కార్యాలయం, వైద్య శాఖ గోదాములు, ఇతర కార్యాలయాలు నడుస్తున్నాయి.

చాలీచాలక..

కొన్ని కార్యాలయాల్లో ఒకే గదిలో అధికారి నుంచి గుమస్తా వరకు కూర్చొని పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో అందరూ పక్కపక్కనే కూర్చొంటున్నారు. మత్స్యశాఖ, కీటకజనిత వ్యాధుల నియంత్రణ విభాగం పరిస్థితీ ఇంతే.

బహుళ అంతస్తుల్లో..

మనుషులు ఉండే బహుళ అంతస్తు భవనాల్లో దేవదాయ, భూగర్భ జల, అద్దె గృహాల్లో పరిశ్రమలు, గనుల శాఖలు ఉన్నాయి. కొన్ని శాఖల కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో కూడా ప్రజలకు  తెలియదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని