logo

వడ్డన మొదలు పెట్టారు...

ఆస్తి విలువ ఆధారంగా పన్నుల పెంపు విధానం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా నగరంలోని ఇళ్ల యజమానులకు ప్రత్యేక డిమాండ్‌ నోటీసుల జారీని గత నాలుగు రోజులుగా చేపట్టారు. గతంలో ఇంటి విస్తీర్ణం, నిర్మాణ స్వరూపం, అద్దె ప్రాతిపదికన ఇంటి పన్ను నిర్ణయించేవారు.

Published : 22 Jan 2022 04:26 IST

ఆస్తి విలువ ఆధారంగా పన్నులు

యజమానులకు ప్రత్యేక నోటీసులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే

ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం

ఆస్తి విలువ ఆధారంగా పన్నుల పెంపు విధానం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా నగరంలోని ఇళ్ల యజమానులకు ప్రత్యేక డిమాండ్‌ నోటీసుల జారీని గత నాలుగు రోజులుగా చేపట్టారు. గతంలో ఇంటి విస్తీర్ణం, నిర్మాణ స్వరూపం, అద్దె ప్రాతిపదికన ఇంటి పన్ను నిర్ణయించేవారు. వాణిజ్య వినియోగంలో ఉన్న కట్టడాలకు ఆమోదం పొందిన గెజిట్‌ను అనుసరించి విధించేవారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్‌ పట్టణాల్లో పన్నుల పునఃసమీక్ష చేపట్టారు. రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్న ఆస్తి విలువను బట్టి పన్నులు నిర్ణయించారు. దీంతో స్థలాలకు అధిక ధర ఉన్న ప్రాంతాల్లో వారికి పన్నులు మోత మోగింది. పెంచిన పన్నును ఒకేసారి కాకుండా ఏడాదికి 15 శాతం చొప్పున వసూలు చేయాలని నిర్ణయించారు. మొదటి విడతగా 2021లో డిమాండ్‌ నోటీసులు జారీ చేశారు. క్యాపిటల్‌ వాల్యూ ప్రకారం పెరిగిన 15 శాతం వసూలుకు ఇప్పుడు ప్రత్యేక నోటీసులు ఇస్తున్నారు.

రూ.80 లక్షల అదనపు భారం...: నగరంలో విలీనమైన 8 గ్రామాలతో కలిపి మొత్తం 66 వేల ఇళ్లు(అసెస్‌మెంట్లు) ఉన్నాయి. వాటి ద్వారా ఏడాదికి రూ.30 కోట్లు పన్నుల రూపంలో లభిస్తోంది. ఇప్పుడు ఆస్తి పన్ను ఆధారంగా తొలి ఏడాది రూ.80 లక్షలు అదనంగా వస్తుందని అంచనా. ఈ విధానంలో కొన్ని ప్రాంతాల వారిపై ఎక్కువ భారం పడనుంది. రిజిస్ట్రేషన్‌ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ట్రంకురోడ్డులో చదరపు అడుగు విలువ రూ.45 వేలు ఉంది. మంగమూరు రోడ్డులో రూ.33 వేలుగా ఉంది. కమ్మపాలెం ఎక్స్‌టెన్షన్‌లో రూ.14 వేలు, కొత్తగా విలీనమైన గ్రామాల్లో రూ.1500 నుంచి రూ.3 వేల వరకు ఉంది.

ప్రతి ఇంటికీ అదనపు భారం...: ఏటా ఆగస్టులో భూముల విలువల పెంపు ఉంటోంది. ప్రతి సంవత్సరం 15 శాతం చొప్పున పెరిగిన ఆస్తి విలువకు చేరుకునేవరకు పన్నుల భారం తప్పదు. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఇళ్లలో నివాసం ఉండే ఏరియా వరకు ఒక రకం, మిగిలిన విస్తీర్ణానికి ఒక ధర నిర్ణయిస్తారు. ఈ విధానంలో గతంలో కన్నా ప్రతి ఇంటి యజమాని రూ.150 నుంచి రూ. 3 వేల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

9 వేల గృహాలకు మినహాయింపు...

క్యాపిటల్‌ వాల్యూ పన్నుల విధానంలో పేదలకు రాయితీ కల్పించారు. 375 చదరపు అడుగుల్లోపు ఇళ్ల వారు ఏడాదికి రూ.54 చెల్లిస్తే సరిపోతుంది. ఆ విధంగా నగరంలో సుమారు 9 వేల గృహాల వారికి మాత్రమే వెసులుబాటు కలుగుతుంది. ఈ రాయితీ వల్ల నగర పాలక సంస్థకు గతంలో వచ్చే రాబడిలో రూ.20 లక్షలు తగ్గుతుందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని