logo

ప్రసవానికొచ్చిన అమ్మకు ఎంతకష్టం

పురిటి నొప్పులతో వచ్చిన నిండు గర్భిణిని పరీక్షించకపోగా.. బిడ్డ అడ్డం తిరిగిందని, కాన్పు కష్టమంటూ వేరే చోటికి వెళ్లాలని ఉచిత సలహాలిచ్చారు. నొప్పులతో ఎక్కడికీ వెళ్లలేమన్నా.. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చూయించుకునే ఆర్థిక స్థోమత లేదంటూ వేడుకున్నా..

Published : 25 Jan 2022 03:28 IST


పండంటి బిడ్డతో నాగవరపమ్మ

పురిటి నొప్పులతో వచ్చిన నిండు గర్భిణిని పరీక్షించకపోగా.. బిడ్డ అడ్డం తిరిగిందని, కాన్పు కష్టమంటూ వేరే చోటికి వెళ్లాలని ఉచిత సలహాలిచ్చారు. నొప్పులతో ఎక్కడికీ వెళ్లలేమన్నా.. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చూయించుకునే ఆర్థిక స్థోమత లేదంటూ వేడుకున్నా.. కనికరించలేదు. చీరాల ఏరియా వైద్యశాలలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మండల పరిధిలోని రామన్నపేట పంచాయతీ సమైక్యనగర్‌కు చెందిన పిట్ల ఏడుకొండలు, నాగవరపమ్మ భార్యాభర్తలు. ఆమె నిండు గర్భిణి కావడంతో రాత్రి ఏడు గంటల సమయంలో పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో ఏడుకొండలు, కుటుంబ సభ్యులు ఆమెను 108 వాహనంలో చీరాల ఏరియా వైద్యశాలలోని ప్రసూతి విభాగానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న సిబ్బంది గర్భిణిని కొద్దిసేపటి వరకు పరీక్షించలేదు. చివరికి బిడ్డ అడ్డం తిరిగి ఉంటుందని.. వైద్యం తమ వల్ల కాదన్నారు. ఒంగోలు లేదా గుంటూరు తీసుకెళ్లాలని సూచించారు. నొప్పులతో ఎక్కడికీ తీసుకెళ్లలేమని.. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని వారు చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చేసేదేమీ లేక రెండు గంటల తర్వాత నొప్పులతో బాధపడుతున్న నాగవరపమ్మను జాండ్రపేటలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పురుడు పోయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ విషయమై ఏరియా వైద్యశాల సూపరింటెండెండ్‌ డాక్టర్‌ శేషుకుమార్‌ని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ప్రసూతి విభాగంలో సేవలందించాల్సిన గైనకాలజిస్ట్‌ గడిచిన బుధవారం నుంచి సెలవులో ఉన్నట్టు తెలిపారు. మరో డాక్టరుని కేటాయించాలని ఉన్నతాధికారులను కోరినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. గర్భిణి పరిస్థితి విషమంగా ఉంటే ఒంగోలు లేదా గుంటూరు తీసుకెళ్లాలని సిబ్బంది రిఫర్‌ చేసి ఉంటారే కానీ వైద్యం చేసేందుకు నిరాకరించడం అనేది చేయొకపోవచ్చని చెప్పారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తామన్నారు. - న్యూస్‌టుడే, వేటపాలెం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని