logo

అమ్మఒడి ...ఆంక్షల ముడి

భరోసా ఇవ్వాల్సిన ‘అమ్మఒడి’ రోజుకో నిబంధనలతో లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. గత ఏడాది వరకు సాయం అందుకున్న అనేకమంది అర్హుల పేర్లు తాజా జాబితాల్లో మాయమయ్యాయి. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. విద్యుత్తు వాడకం అధికంగా ఉందని, 75 శాతం హాజరు లేదంటూ అనేకమందికి కోత విధించారు

Published : 25 Jun 2022 03:15 IST

నిబంధనలు పేరిట కోత

జిల్లాలో పది వేల మందికి పైగా మొండిచేయి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే:

భరోసా ఇవ్వాల్సిన ‘అమ్మఒడి’ రోజుకో నిబంధనలతో లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. గత ఏడాది వరకు సాయం అందుకున్న అనేకమంది అర్హుల పేర్లు తాజా జాబితాల్లో మాయమయ్యాయి. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. విద్యుత్తు వాడకం అధికంగా ఉందని, 75 శాతం హాజరు లేదంటూ అనేకమందికి కోత విధించారు. తాము తక్కువ యూనిట్లే వినియోగించామంటూ పలువురు బిల్లులు సైతం చూపిస్తున్నా ప్రయోజనం లేకపోతుంది. రేషన్‌ కార్డుల్లో పేర్లున్నా లేవంటూ మరికొందరికి సాయం నిలిపేశారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు ఏడు వేల ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. 2021-22 విద్యా సంవత్సరం కింద 4,88,063 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ ఏడాది అర్హులైన విద్యార్థుల తుది జాబితాలు తాజాగా అన్ని సచివాలయాలకు చేరాయి. నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో 2021తో పోలిస్తే సుమారు 10 వేల మందికిపైగా జిల్లాలో తగ్గినట్లు భావిస్తున్నారు.

పథకం ఇలా...

రాష్ట్ర ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. ఒకటి నుంచి ఇంటర్‌ వరకు అర్హత కలిగిన విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాలకు తొలి ఏడాది రూ.15 వేలు ఇవ్వగా, రెండో ఏడాది రూ.14 వేల చొప్పున జమ చేశారు. పారిశుద్ధ్యం నిర్వహణకు ఈ ఏడాది అదనంగా మరో రూ.వెయ్యి కోత విధించనున్నారు. దీంతో అర్హులైన తల్లుల ఖాతాలో ఈ నెల 27న రూ.13 వేల చొప్పున జమ కానుంది. నాలుగు చక్రాల వాహనం ఉన్నా..ఆదాయ పన్ను చెల్లిస్తున్నా.. మీటరు రీడింగ్‌ నెలకు 300 యూనిట్లు దాటినా..ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా..పట్టణ ప్రాంతంలో ఇంటి నిర్మాణంతోపాటు, ఖాళీ స్థల విస్తీర్ణం కూడా 1,000 చదరపు అడుగులపైన ఉన్నా అనర్హులే. కొత్త బియ్యం కార్డు తప్పనిసరిగా ఉండాలి. రేషన్‌కార్డులో తల్లి, విద్యార్థి పేరు లేకపోవడంతో అర్ఞత కోల్పోయిన వారు ఆధార్‌ నంబర్లను సచివాలయంలో గ్రీవెన్స్‌ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

75 శాతం హాజరు ఉండాలంటూ

నవంబరు 8 నుంచి ఏప్రిల్‌ నెలాఖరు వరకు పాఠశాలల పనిదినాలను పరిగణనలోకి తీసుకున్నారు. 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉంటేనే పథకం వర్తిస్తోంది.నవంబరు, డిసెంబర్‌లో కరోనా కేసులు లేకున్నా; మూడో దశలో జనవరి నుంచి పెరిగాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాజిటివ్‌ రావడంతో కొందరు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇళ్లలో ఉన్నారు. దీంతో హాజరు తగ్గింది.

ఇక ఆరు నెలలకు సరాసరిన విద్యుత్తు రీడింగ్‌ 300 యూనిట్లకు దాటకూడదు. ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండలు అధికంగా ఉండటంతో వాటిని తట్టుకోలేక పంకాలు, ఏసీ వినియోగించారు. అలాంటి ఇళ్లకు వేసవిలో నెలకు 300 యూనిట్లు దాటడం సహజం. అంతే ఆ ఇంట్లోని విద్యార్థులు అనర్హుల జాబితాలో చేరిపోయారు.

అర్హత లేదంటూ...

త్రిపురాంతకం మండలంలోని 21 సచివాలయాల పరిధిలో 7055 మందిని అర్హులుగా తేల్చారు. విద్యుత్తు, హాజరు పేరుతో మరో 610 మంది అర్హత కోల్పోనున్నారు. అలాగే మూడెకరాలకు మించి సాగు భూమి, పదెకరాలకు మించి మెట్ట భూమి... కుటుంబంలో రూ.12 వేలకు మించి వేతనంతో ఉద్యోగం చేస్తున్న వారు.. తదితర నిబంధనలతో కోత విధించారు అన్నసముద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రెండు ఇళ్లకు మీటర్లూ ఉన్నాయి. ఒక మీటరుకు నెలకు రూ.50 మించి బిల్లు రాదు. 300 యూనిట్లకు పైగా వినియోగిస్తున్నారంటూ తొమ్మిదో తరగతి చదువున్న కుమార్తెకు అమ్మ ఒడిని నిలిపివేశారు. సరి చేయించి 300 యూనిట్ల లోపు వాడుతున్నట్లు పత్రాన్ని ఇచ్చినా పథకానికి నోచుకోలేదు. ఆకవీడు గ్రామానికి చెందిన ఉషారాణి కుమార్తె స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. గతంలో నానమ్మ రేషన్‌ కార్డులో ఉమ్మడిగా ఉండేవారు. ఇటీవల ఉషారాణి పేరిట నూతన కార్డు మంజూరైంది. అందులో విద్యార్థిని పేరు కూడా ఉంది. కార్డులో ఆమె లేరంటూ అమ్మఒడిలో అనర్హురాలిగా చూపారు. దీనిని సరిచేసేందుకు సచివాలయంలో ప్రయత్నించినా సంబంధిత సవరణ వివరాలు కనిపించలేదు. -న్యూస్‌టుడే, రాచర్ల, త్రిపురాంతకం గ్రామీణం

విద్యుత్తు వాడకం ఎక్కువన్నారు

రాచర్ల మండలం ఆకవీడు గ్రామానికి చెందిన ఖాదర్‌బాషా కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. వీరు నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగానే విద్యుత్తు వినియోగిస్తున్నారు. అంతకంటే అధికంగానే వినియోగిస్తున్నట్లు అమ్మఒడి జాబితాలో చూపించి పథకానికి దూరం చేశారు. ఏఈ వద్ద 2020 మార్చి నుంచి వచ్చిన బిల్లుల వివరాలు తీసుకున్నా తక్కువ యూనిట్లే కనిపించాయి. అయినా ఎందుకు పథకం వర్తించలేదో తెలియదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఒంగోలు మండలం బొద్దులూరివారిపాలేనికి చెందిన వై.భవ్య ఈ ఏడాది పదో తరగతి చదివింది. గత నెల ప్రచురించిన అమ్మఒడి జాబితాలో విద్యుత్తు అధిక వినియోగం కారణంగా అనర్హులైనట్లు పేర్కొన్నారు. ఏఈ వద్దకు వెళ్లి వివరాలు సమర్పించారు. గత ఆరు నెలలుగా సరాసరిన 287 యూనిట్ల చొప్పున మాత్రమే వినియోగించినట్లు సచివాలయంలో తెలపగా ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. తాజాగా ఇచ్చిన తుది జాబితాలో పాఠశాలలో ఆధార్‌ అనుసంధానం పొరపాటు జరిగిందని.. తద్వారా అనర్హురాలుగా పేర్కొనడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒంగోలు మండలం దేవరంపాడు దళితవాడ సచివాలయ పరిధిలో బొద్దులూరివారిపాలెం, దేవరంపాడు..దళితవాడ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 307 మంది విద్యార్థులకుగాను 169 మందిని అమ్మఒడికి అర్హులుగా గుర్తించారు. కరవది సచివాలయం-1 పరిధిలో 165 మందికి 143 మందినే అర్హులుగా గుర్తించారు.

చేయని తప్పిదానికి..

మేడపికి చెందిన ఈపూరి శ్రీను ఒక విద్యుత్తు దీపం, పంకా వినియోగిస్తుండగా నెలకు రూ.50 నుంచి రూ.80లోపు బిల్లు వచ్చేది. మీటరులో సాంకేతిక కారణాల వల్ల ఏడాది క్రితం రూ.35 వేల బిల్లు వచ్చింది. అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. ఎనిమిది నెలల క్రితం రూ.5వేలు కట్టినా నెల నెలా బిల్లు పెరుగుతోంది. దీంతో ఇంటర్‌ చదువుతున్న కుమారుడికి అమ్మ ఒడిలో చోటు దక్కలేదు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.వేల బిల్లు చెల్లించడమే కాకుండా పథకానికి నోచుకోలేకపోయామని ఆవేదన చెందుతున్నారు.

ఎన్నెన్నో కారణాలు

దర్శి, న్యూస్‌టుడే: గత ఏడాదితో పోలిస్తే దర్శి మండల పరిధిలో 889 మందికి ఈ సారి అమ్మఒడిలో చోటు దక్కలేదు. గతంలో 9,610 మంది లబ్ధి పొందగా ప్రస్తుతం 8721 మందికి మాత్రమే సాయం అందనుంది. దొనకొండ మండలంలో గతంలో 6300 లబ్ధిదారులుండగా ఇప్పుడు 300 మంది తగ్గిపోయారు. కురిచేడు మండలంలో 4477 మందికి జాబితాలో చోటు లభించగా 421 మంది దూరమవుతున్నారు. అనేకమంది హాజరుశాతం తగ్గడం వల్ల దూరమవుతున్నట్లు కారణాలు చూపిస్తున్నారు. రేషన్‌ కార్డుల్లో తల్లి పేర్లు లేకపోవడం, ఆధార్‌లో మార్పులు, 4 చక్రాల వాహనాలు, 300 యూనిట్ల కంటే విద్యుత్తు వినియోగించడం వంటివి మిగతావారికి చూపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని