logo

పశ్చిమం చిత్తవుతోంది...

మార్కాపురం పట్టణంలో విద్యాసంస్థలు నానాటికీ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పెద్దారవీడు జాతీయ రహదారి వెంట ఇంజినీరింగ్‌ కళాశాలున్నాయి. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు చదువుల కోసం

Updated : 27 Jun 2022 05:15 IST

యథేచ్ఛగా గంజాయి విక్రయాలు
అలవాటు పడుతున్న విద్యార్థులు, యువకులు

* మార్కాపురం పట్టణంలో విద్యాసంస్థలు నానాటికీ విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పెద్దారవీడు జాతీయ రహదారి వెంట ఇంజినీరింగ్‌ కళాశాలున్నాయి. దీంతో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు చదువుల కోసం పట్టణానికి వస్తున్నారు. స్థానికంగా ఉంటూ విద్యాభ్యాసం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ నేరుగా లేకపోవడంతో ఇటువంటి వారిలో కొందరు మత్తు పదార్థాలకు బానిసలయ్యారనే ఆరోపణలున్నాయి.

* ఓ మైనార్టీ కళాశాల ఎదురుగా ఓ భవనం ఉంది. రాత్రయితే చాలు ఇక్కడి గదుల పైభాగానికి కొందరు యువకులు చేరుకుంటారు. గంజాయితో నింపిన సిగరెట్లను తాగుతూ మత్తులో జోగుతున్నారు.

* మార్కాపురం శివారులోని ఓ సినిమా థియేటర్‌ సమీపంలో శ్మశాన వాటిక ఉంది. ఆ పక్కనున్న పాత భవనం వ్యసనపరులకు అడ్డాగా మారింది. సాయంత్రం అయితే కొందరు యువకులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకుని గంజాయి మత్తులో తూలుతున్నారు. కొన్నిసార్లు విచక్షణ మరిచి ఆ ప్రాంతంలో వీరంగం సృస్టిస్తున్నారు. దీంతో ఇటుగా రాకపోకలు సాగించాలంటే భయపడాల్సిన దుస్థితి నెలకొంది.

* చోరీకి గురైన చరవాణిని ఓ యువకుడి నుంచి మార్కాపురం పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తి గంజాయి మత్తులో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని వీరంగం సృష్టించాడు. తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో చేతిపై గాయం చేసుకుని భయబ్రాంతులకు గురి చేశాడు.

మార్కాపురం గడియార స్తంభం, పొదిలి- న్యూస్‌టుడే: పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, పొదిలి ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటి బారిన పడుతున్న యువత జీవితాలు చిత్తవుతున్నాయి. రోజు రోజుకు వినియోగం పెరుగుతూండటం విపత్కర పరిస్థతులకు దారి తీస్తోంది. ఈ పరిణామాలపై పలువురు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో సెబ్‌, పోలీసు శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇవిగివిగో అడ్డాలు...: మార్కాపురం పట్టణంలో చాలా చోట్ల యువకులు బహిరంగంగానే గంజాయి పీలుస్తున్నారు. చెరువు కట్ట సమీపంలో, పోలేరమ్మ దేవస్థానం, పదో వార్డు శివారు ప్రాంతాల్లో మత్తులో జోగుతున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా ఈ వ్యవహారం సాగుతోంది. పట్టణానికి ప్రధానంగా పొదిలి, తర్లుపాడు, దోర్నాల ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా అవుతున్నట్టు ప్రచారం. ః పొదిలిలోని చిన్నబస్టాండ్‌, రథం రోడ్డు, ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్న కొందరి వద్ద గంజాయి పొట్లాలు లభిస్తున్నట్టు సమాచారం. శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి తెచ్చి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి విక్రయాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడి నుంచి చుట్టుపక్కల మండలాలకు కూడా రవాణా అవుతోంది. వ్యసనాలకు బానిసలైన తమ బిడ్డలను ఏ విధంగా మంచి మార్గంలోకి తెచ్చుకోవాలో తెలియక పలువురు తల్లిదండ్రులు దీనంగా రోదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు, సెబ్‌ సంయుక్త దాడులు చేపట్టి మత్తు మూలాలను సమూలంగా నిర్మూంచే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

దాడులు ముమ్మరం చేస్తాం...

- శ్రీనివాస్‌నాయుడు, ఇన్‌ఛార్జి ఈఎస్‌, మార్కాపురం సెబ్‌ యూనిట్‌

మార్కాపురం సెబ్‌ యూనిట్‌ పరిధిలో గంజాయి విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. దాడులు, తనిఖీలు మరింత ముమ్మరం చేసి పట్టుబడిన వారిపై కఠిన చర్యలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని