logo

పది నెలలు.. 912 మంది క్షతగాత్రులు

పట్టణాలు, మండల కేంద్రాల నుంచి వెళ్లే ప్రధాన రహదారులతో పాటు, గ్రామాలకు వెళ్లే అనుసంధాన రోడ్లు గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయి.

Published : 28 Nov 2022 02:46 IST

పల్లె రోడ్లపై ప్రాణసంకటంగా ప్రయాణాలు
బిల్లుల భయంతో ముందుకు రాని గుత్తేదారులు
న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణండలం

కోతకు గురై ప్రమాదకరంగా ఉన్న సంతమాతలపాడు మండలం
వేములపాడు- చిలకపాడు గ్రామాల మధ్య రహదారి

పట్టణాలు, మండల కేంద్రాల నుంచి వెళ్లే ప్రధాన రహదారులతో పాటు, గ్రామాలకు వెళ్లే అనుసంధాన రోడ్లు గుంతలు పడి అధ్వానంగా ఉన్నాయి. అందులో 90 శాతం వరకు పంచాయతీరాజ్‌ విభాగంలోనివే. ఏళ్ల తరబడి వీటి మరమ్మతుల గురించి అటు ప్రజాప్రతినిధులు.. ఇటు అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కొంతమేర కొట్టుకుపోవడం.. భారీ గుంతలు ఏర్పడి చిన్నపాటి వర్షం పడినా అందులోకి నీరు చేరి నిలుస్తోంది. ఇలాంటి అధ్వాన రహదారులపై ప్రయాణం వాహన చోదకులకు ప్రాణ సంకటంగా మారింది. గత 10 నెలల కాలంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో 912 మంది గాయాలపాలవ్వడం రహదారుల దుస్థితికి అద్దం పడుతోంది.

జిల్లా వ్యాప్తంగా 603 పంచాయతీరాజ్‌ రోడ్లకు సంబంధించి 693.62 కి.మీ మేర మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు అవసరమైన నిధుల మంజూరు కోరుతూ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. అందులో 293.60 కి.మీ బీటీ; 38.27 కి.మీ మెటల్‌; 361.75 కి.మీ గ్రావెల్‌ రోడ్లు ఉన్నాయి. వీటి మరమ్మతులకు చివరిసారిగా సంబంధిత అధికారులు గత ఏడాది ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. ఈ నేపథ్యంలో పది నెలల క్రితం రూ.50.55 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో 84 పనుల కింద 275.52 కి.మీ మేర రహదారుల మరమ్మతులకు ప్రతిపాదించారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు అత్యవసరంగా రెండు, మూడు చోట్ల పనులు చేస్తున్నా.. చాలాచోట్ల వాటి ఊసే లేదు.

ప్రారంభానికి నోచనివి 356...

2021-22 ఆర్థిక సంవత్సరానికి జిల్లా ప్రజాపరిషత్‌ సాధారణ నిధుల కింద రహదారులతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాల కింద 877 పనులకు రూ.44.11 కోట్ల నిధులు మంజూరు చేశారు. వీటిలో 398 పనులు పూర్తవ్వగా, మరో 123 పురోగతిలో ఉన్నాయి. 356 ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. ముందు చేసిన పనులకే బిల్లులు ఇవ్వకపోవడంతో కొత్తగా చేసేందుకు గుత్తేదారులు కానీ, స్థానిక అధికార పార్టీ నాయకులు కానీ ముందుకు రావడం లేదు.

క్వారీ డస్టు పోసి.. మధ్యలోనే వదిలేసి...

గత ప్రభుత్వ హయాంలో ఆసియా మౌలిక వసతులు, పెట్టుబడుల బ్యాంకు రుణంతో జిల్లా వ్యాప్తంగా పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని 203 రహదారుల లభివృద్ధికి శ్రీకారం చుట్టారు. టెండర్లు పిలవడం ద్వారా అప్పట్లోనే గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఆ తర్వాత కొన్ని అరకొరగా సాగగా; మరికొన్ని ప్రాంతాల్లో నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. కొన్నింటికి ఏడాది క్రితమే క్వారీ డస్టు పోసి మధ్యలోనే వదిలేశారు. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకున్న వారు లేరు. దీంతో ప్రయాణానికి నిత్యం అవస్థలు తప్పడం లేదు. ఏఐఐబీ ఆర్థిక సాయంతో 2018లో అప్పటి ప్రభుత్వం జిల్లాలోని 235 గ్రామాలకు 407.01 కిలో మీటర్ల మేర 203 రహదారుల నిర్మాణానికి రూ.263.56 కోట్ల అంచనాతో నిధులు మంజూరు చేసింది. అందులో బీటీ, సీసీ రోడ్లు ఉన్నాయి. ఈ నిధులను నియోజకవర్గాల వారీగా నాలుగు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. అప్పట్లో చాలా వరకు పనులు ప్రారంభించారు. నాటి నుంచి నాలుగేళ్లు గడిచినా క్షేత్రస్థాయిలో ఎక్కువ శాతం పనులు నాలుగో వంతు కూడా పూర్తి కాలేదు. 2019లో ప్రభుత్వం మారడంతోనే ఎక్కడికక్కడ నిలిచిపోయాయని స్థానికులు భావిస్తున్నారు. కొవిడ్‌ దృష్ట్యా గుత్తేదారుల విన్నపం మేరకు ఇప్పటికే రెండు, మూడుసార్లు గడువును పొడిగించారు. అయినా బిల్లుల మంజూరులో జాప్యం కారణంగా గుత్తేదారులు ముందుకు రావడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో గుంతలు తేలి అధ్వానంగా మారిన రహదారులపై రాకపోకలు సాగిస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని