logo

రాజకీయ రౌడీల్లో మాకేం కాదనే ధీమా

హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే.. ఎవరిని చంపినా మాకేం కాదనే దీమా రాజకీయ రౌడీల్లో పెరిగిపోయింది.

Updated : 10 Jun 2023 06:33 IST

దళితులపై కక్షగట్టిన జగన్‌ ప్రభుత్వం
చొక్కా విప్పిన మంత్రి ఇప్పుడు పట్టించుకోరేం!
విలేకరులతో తెదేపా నేతలు అనిత, స్వామి

హనుమాయమ్మ కుమార్తె మాధురిని ఓదారుస్తున్న అనిత.. చిత్రంలో కొండపి ఎమ్మెల్యే స్వామి, తెలుగు మహిళా నాయకురాళ్లు

టంగుటూరు, న్యూస్‌టుడే: ‘హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే.. ఎవరిని చంపినా మాకేం కాదనే దీమా రాజకీయ రౌడీల్లో పెరిగిపోయింది. ఈ పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. వైకాపా నాయకుడి చేతిలో దారుణ హత్యకు గురైన సవలం హనుమాయమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు కొండపి ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామితో కలిసి ఆమె టంగుటూరు మండలం రావివారిపాలేనికి శుక్రవారం వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులైన సుధాకర్‌, మారుతీరావు, మాధురిలతో మాట్లాడారు. తెదేపా అండగా ఉంటుందని చెప్పారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

* సరకుల కోసం ఇంట్లో తనిఖీలేంటి...: దళితురాలు.. పైగా అంగన్‌వాడీ టీచర్‌గా ఇరవై అయిదేళ్లు ప్రజలు, ప్రభుత్వానికి సేవ చేసిన మహిళ దారుణ హత్యకు గురైతే పరామర్శించడానికి ఏ అధికారీ రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యంత కిరాతకంగా హత్యకు గురైన వారిలో ఎక్కువమంది దళితులే ఉన్నారని చెప్పారు. రాజకీయ పలుకుబడితో తమకు ఏం కాదని, ఎవరూ ఏం చేయలేరని ధీమా హంతకుల్లో కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. క్షుణ్నంగా విచారణ చేపట్టాల్సిన పోలీసులు కేవలం గంటల వ్యవధిలో కుటుంబ వివాదమంటూ తేల్చేయడం ఏంటని ప్రశ్నించారు. మృతి విషయం తెలిసి కూడా పరామర్శించేందుకు రాని ఐసీడీఎస్‌ అధికారులు.. ఆ తర్వాత కుటుంబ సభ్యులను సంప్రదించకుండా ఇంట్లోకి అక్రమంగా చొరబడి అంగన్‌వాడీ సరకులు ఏమైనా ఉన్నాయేమోనని చూడటం దుర్మార్గం అన్నారు. పాలించేవారు సైకోలా ప్రవర్తిస్తుంటే కింది స్థాయి సిబ్బంది కూడా మానవత్వాన్ని మరుస్తున్నారని విమర్శించారు.

* వాళ్లూ.. ఓ మంత్రులేనా...: హోంమంత్రి పదవి పొందిన మహిళ ఇంటికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. యర్రగొండపాలెం పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు వ్యతిరేకంగా చొక్కా విప్పి అర్థనగ్న ప్రదర్శన చేసిన జిల్లా మంత్రి సురేష్‌ ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. దళితులమంటూ పదే పదే చెప్పుకొనే ఆయన ఓ మహిళ హత్యకు గురైతే పెదవి విప్పడం లేదేమిటన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున కూడా ఎక్కడా కనిపించడం లేదని.. అసలు వీళ్లంతా మంత్రులేనా అని ప్రశ్నించారు. హత్య కేసు విచారణ నిష్పక్షపాతంగా సాగలేదని అనుమానాలు వ్యక్తం చేశారు. కొండపి నియోజకవర్గ వైకాపా బాధ్యుడి కాల్‌ రికార్డును బయట పెట్టాలని కోరారు. అనిత, ఎమ్మెల్యే స్వామి వెంట సర్పంచి మద్దిరాల మమత, తెలుగు మహిళలు రాయిపాటి సీతమ్మ, పేముల విజయనిర్మల, తోకల భారతి, అరుణారెడ్డి, బొద్దులూరి ప్రసన్నలక్ష్మి, మల్లవరపు శ్రీదేవి, నిడమానూరి పావని, చుండూరి పద్మ, కొత్త మంగమ్మ, దేవూరి రత్తమ్మ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని