logo

మాటల మామ.. చేతలు మమ

ప్రభుత్వ కళాశాలల్లో పేద, వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఎక్కువ. కనీసం బస్‌పాస్‌ ఛార్జీలు కూడా చెల్లించలేని పరిస్థితి కొందరిది.

Updated : 22 Jun 2023 04:26 IST

పుస్తకాలకే దిక్కులేదు.. ట్యాబ్‌లంటూ ఆశలు
 పేద విద్యార్థులకు భారంగా ఇంటర్‌ చదువులు

‘ఇంటర్మీడియట్‌లోనూ బైజూస్‌ కంటెంట్‌ ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలి. తర్వాత దశలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసేలా సన్నద్ధం కావాలి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ప్రతి మండలంలోనూ రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలి. నాడు- నేడు కింద అదనపు తరగతి గదులు, వసతులు కల్పించాలి...’ ఇవీ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మాటలు.
వాస్తవంలో చూస్తే అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. బైజూస్‌ కంటెంట్‌ అందించే విషయం అటుంచితే.. విద్యార్థులు చదివేందుకు అవసరమైన పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


కంభం, న్యూస్‌టుడే: ప్రభుత్వ కళాశాలల్లో పేద, వ్యవసాయ కూలీల కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఎక్కువ. కనీసం బస్‌పాస్‌ ఛార్జీలు కూడా చెల్లించలేని పరిస్థితి కొందరిది. వసతి గృహాల్లో ఉంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు విద్యాభ్యాసం కొనసాగిస్తుంటారు. ఇటువంటి వారిపై పాలకులు ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులేవీ కనిపించడం లేదు. పుస్తకాలను విద్యార్థులే కొనుగోలు చేసుకోవాలని ఇప్పటికే ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడనుంది. గతేడాది పుస్తకాలు లేక ఉత్తీర్ణతా శాతం గణనీయంగా తగ్గిపోయింది. పుస్తకాలు లేని చదువులతో ఈ ఏడాది కూడా అవే ఫలితాలు పునరావృతమవుతాయని పలువురు విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఏటా పెరుగుతున్న రుసుములు...

తెలంగాణ రాష్ట్రంలోని సర్కారీ కళాశాలల్లో ఉచిత విద్య అందిస్తుండగా.. ఇక్కడ మాత్రం పేద విద్యార్థులపై ఏటా రుసుముల భారం మోపుతున్నారు. 2023-24 ఏడాదిలో మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు రూ. 2,185, హెచ్‌ఈసీ, సీఈసీ రూ. 1,297, వృత్తి విద్యా కోర్సుల వారు రూ. 2,434 చెల్లించాల్సి ఉంది. రెండో ఏడాది ఎంపీసీ, బైపీసీ వారు రూ. 1,385, హెచ్‌ఈసీ, సీఈసీ రూ. 941, వృత్తివిద్యా కోర్సుల వారు రూ. 1,634 కట్టాలి. ఏటా 10 శాతం ఫీజులు పెంచుతుండటం పేదల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.


తీసుకున్నవి తిరిగిస్తేనే టీసీలు...

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న కళాశాలల్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సుమారు 6 వేల మంది ఉన్నారు. ఈ ఏడాది మొదటి సంవత్సరం మరో 6 వేల మంది వరకు చేరే అవకాశం ఉందని అంచనా. వీరందరికీ గత ప్రభుత్వ హయాంలో అందజేసిన పాఠ్యపుస్తకాలనే అధ్యాపకులు ఇప్పుడు అందించాల్సిన దుస్థితి. ప్రథమ సంవత్సరంలో ఇచ్చినవి తిరిగి అప్పగిస్తేనే రెండో ఏడాదికి సంబంధించినవి ఇస్తున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యను పూర్తిచేసుకుని బయటకు వెళ్లే వారు పుస్తకాలను అప్పగించాల్సి ఉంది. అలా అయితేనే టీసీలు ఇస్తుండటం గమనార్హం. ఈ సంవత్సరం పుస్తకాలు సరఫరా చేయలేమని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వాటిని బహిరంగ మార్కెట్‌లో కొనాలంటే ఒక్కో విద్యార్థిపై సుమారు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు భారం పడనుంది. ఈ నిర్ణయంంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కళాశాలల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. ప్రస్తుతం ఆ పథకం అటకెక్కించారు. ఫలితంగా ఆకలి మంటలు భరిస్తూ చదువులు కొనసాగించాల్సిన దుస్థితి.


ఏకరూప దుస్తులు  కొనాల్సిందేనా...

ఏకరూప దుస్తులకు సంబంధించిన వస్త్రం నమూనా

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులకు ఈ ఏడాది కొత్తగా ఏకరూప దుస్తుల విధానం అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. గతేడాదే భావించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఈ సంవత్సరం తప్పనిసరి చేశారు. విద్యార్థి నుంచి రూ. 380, విద్యార్థినుల నుంచి రూ. 450 వస్త్రానికి వసూలు చేయాలని భావిస్తున్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నారు. దీనికితోడు ఒక్కో జతకు కట్టు కూలి అదనంగా మరో రూ.600 కాంది. కనీసం రెండు జతలు కుట్టించుకోవాలనుకున్నా రూ. 2 వేలకు పైగా వెచ్చించాల్సి ఉంది. ఇది కూడా పేద విద్యార్థులకు ఇది మరింత భారమే అవుతుంది.


ఉన్నంత వరకు ఇస్తున్నాం

ఆదర్శ, ప్లస్‌ టు పాఠశాలలు, కేజీబీవీలకు ఇంటర్‌ ఉచిత పాఠ్యపుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన వాటికి రాకపోవచ్చు. ప్రభుత్వం నుంచి సరఫరా లేకపోవడంతో ఉన్నంత వరకు విద్యార్థులకు అందజేస్తున్నాం.

సైమన్‌ విక్టర్‌, ఆర్‌ఐవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు