logo

రూ.లక్షల వ్యయం.. తీరని దాహం

మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు.

Published : 29 Mar 2024 01:49 IST

నీటి తొట్టెల నిర్వహణను గాలికొదిలిన వైకాపా ప్రభుత్వం
మూగజీవాలకు తప్పని కష్టం

తురిమెళ్ల సమీపంలోని పొలాల్లో దెబ్బతిన్న తొట్టె

కంభం, న్యూస్‌టుడే : మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. వాటికి అక్షరాలా రూ. 11.57 లక్షలు ఖర్చు చేశారు. ఇవి కాకుండా  ఉపాధి హామీ పథకంలోనూ గ్రామాల్లో తొట్టెలు నిర్మించారు. వాటి నిర్వహణ పంచాయతీలకు అప్పగించారు. అయితే నాసిరకంగా నిర్మించడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పలు ప్రాంతాల్లో ఇవి ధ్వంసమయ్యాయి. అక్కడక్కడా కొన్ని ఉన్నా వాటిల్లో నీరు నింపడాన్ని పంచాయతీ అధికారులు మరిచిపోయారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. వాగులు, వంకల్లో సైతం నీరు లేకపోవడంతో మేతకు వెళ్లిన పశువులు, జీవాలు నీటికి ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామాల సమీపం, పొలాల్లో కట్టిన వాటిల్లో నీరు ఎక్కడా ఉండడం లేదు.

తెదేపా హయాంలో ముందుచూపుతో..:  బేస్తవారపేట, కంభం, రాచర్ల, గిద్దలూరు, కొమరోలు మండలాల్లో 89 తొట్టెలను నిర్మించారు. కంభం మండలం తురిమెళ్ల, లింగోజిపల్లి, కంభం, బేస్తవారపేట పంచాయతీ పాపాయిపల్లి, కలగొట్ల తదితర గ్రామాల్లోని నిర్మాణాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాటి ఆనవాళ్లు లేకుండా పాడైపోయాయి. ఎంతో ముందుచూపుతో  అప్పటి తెదేపా ప్రభుత్వం వాటిని నిర్మించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్వాహణ గాలికొదిలేశారు. ఎక్కడా వాటిల్లో నీరు కనిపించడం లేదు. తొట్టెలను నీటితో నింపాల్సిన పంచాయతీ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. కనీసం వేసవిలోనైనా వాటిల్లో జలం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పశుపోషకులు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ క్షేత్ర సిబ్బందితో మాట్లాడి గ్రామాల్లోని తొట్టెలకు అందుబాటులో నీరు ఉంటే వాటిల్లో నింపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ట్యాంకర్లను ఏర్పాటు చేసి తొట్టెల్లో జలం నింపడం కష్టమని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని