logo

అబద్ధాల అన్నొస్తున్నాహో!

జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు.

Published : 30 Apr 2024 04:22 IST

పాలకుడి దెబ్బకు ఊళ్లొదిలిన రైతన్నలు
నేడు టంగుటూరులో ముఖ్యమంత్రి ప్రచారం
గత హామీలకు పాతర        
మళ్లీ జగన్నాటక జాతర

ఈనాడు, ఒంగోలు: జగన్నాటకం మళ్లీ మొదలైంది. ఎన్నికలకు పక్షం రోజులే ఉండటంతో ఓటర్ల కళ్లకు గంతలు కట్టేందుకు ఆయన జనం చెంతకు వస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీలు గుప్పించి అధికార పీఠమెక్కి..ఆ తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదు. మార్కాపురం జిల్లా ఆశల్ని చిదిమేసి..వెలిగొండను అటకెక్కించేసి..గుండ్లకమ్మను నీరుగార్చేశారు. ఆయన నిర్వాకంతో  పొగాకు..సుబాబుల్‌.. మిర్చి..ఉద్యాన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ఊళ్లొదిలి  పిల్లాపాపలతో హైదరాబాద్‌కు వలసబాట పట్టారు. రాజులా బతికిన రైతులు కాస్తా..అక్కడ కూలీల్లా జీవితం వెళ్లదీస్తున్నారు. జిల్లాలో జనాగ్రహాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి మరోమారు అబద్ధాలు వల్లించడానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం టంగుటూరు ఎన్నికల ప్రచార సభకు ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారు. 


జగన్‌ దెబ్బకు పేదలకు రూ.1080 కోట్ల నష్టం

జిల్లాలోని ఒంగోలుతోపాటు పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్య విషమంగా ఉంది. ఆయన వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి తాగు, సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని ఆవేశంగా చెప్పారు. అదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో వారు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ప్రదర్శనలు చేస్తున్నారు. జిల్లాలో 7 లక్షల కుటుంబాలున్నాయి. ఇందులో మూడు లక్షల కుటుంబాలు రోజుకు రూ.20 చొప్పున నీటికి ఖర్చుచేస్తున్నాయి. ఇలా రోజుకు రూ.60 లక్షలు, నెలకు రూ.18 కోట్లు, ఏడాదికి రూ.216 కోట్లు తమ జేబుల్లోంచి వెచ్చించాల్సి వస్తోంది. ఇలా అయిదేళ్లలో రూ.1080 కోట్లు నీళ్లకే ఖర్చు చేయాల్సిన దుస్థితి కల్పించారు.


అమూల్‌కు కట్టబెట్టి.. పాడి రైతు పొట్టకొట్టి

ఒంగోలు డెయిరీ నష్టాల్లో ఉందని, అధికారంలోకి వస్తానే ఆదుకుంటామని పాదయాత్రలో జగన్‌ ప్రేమ ఒలకబోయారు. పాలు పోసిన రైతులకే రూ.12 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని తెదేపా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు 20వేల లీటర్ల పాలు సేకరించే డెయిరీని అమూల్‌కు కట్టబెట్టారు. తద్వారా డెెయిరీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. తదనంతరం అమూల్‌ కూడా చేతులెత్తేయడంతో జిల్లాలో పాడి రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. గత్యంతరం లేక ప్రైవేటు డెయిరీలకు అమ్ముకుంటున్నారు.


సంగమేశ్వరం ఏమైందన్నా..

పొన్నలూరు మండలంలోని చెన్నిపాడు వద్ద పాలేరు నదిపై సంగమేశ్వరం ప్రాజెక్టుకు పూర్తిచేసి కొండపి నియోజకవర్గంలోని పొన్నలూరు, జరుగుమల్లి, కొండపి, మర్రిపూడి మండలాల్లోని దాదాపు 10వేల ఎకరాలకు సాగు నీరు, 15 గ్రామాలకు తాగునీరు అందిస్తామని హామీలు గుప్పించారు. గతంలో 20 శాతం పనులు కాగా, మరో 15 శాతం పనులు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు పనులు మొత్తం పడకేశాయి.


బడుగుల జేబులకు రూ. కోట్లలో చిల్లు

జిల్లాకు చెందిన దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌ పదవిలో ఉన్నా ఆ వర్గాలను పట్టించుకోలేదు. తాను ప్రాతినిథ్యం వహించిన యర్రగొండపాలెంలో సమస్యలు తిష్టవేయడం, ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఆ నియోజకవర్గాన్ని వదిలేసి కొండపికి పలాయనం చిత్తగించారు. విదేశీ విద్య, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ లాంటి పథకాలు రద్దు కావడంతో దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. గత ప్రభుత్వంలో అమలుచేసిన పథకాలు రద్దు కావడంతో ఒక్కో కుటుంబం రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు నష్టపోయింది. ఇలా అయిదేళ్లలో రూ. కోట్ల మేర ఎస్సీ కుటుంబాలు నష్టపోయాయి.


సుబాబుల్‌ రైతునూ ముంచేశారు

జిల్లాలో సాగయ్యే వాణిజ్య పంటల్లో సుబాబుల్‌, జామాయిల్‌ది అగ్రస్థానం. తాను అధికారంలోకి రాగానే కర్రకు మద్దతు ధర రూ.5వేలు ఇప్పిస్తామని జగన్‌ హామీ ఇచ్చి విస్మరించడంతో అయిదేళ్ల క్రితం 1.20 లక్షల ఎకరాల్లో ఉన్న కర్ర సాగు ప్రస్తుతం 90 వేల ఎకరాలకు పడిపోయింది. నాలుగేళ్లుగా రూ.3వేలు కూడా కర్ర ధర దాటలేదు. రైతులంతా కర్ర సాగును వదిలేయడంతో డిమాండ్‌ పెరిగింది. ఇటీవల టన్ను రూ.4వేలు నుంచి రూ.4500 వరకు పలుకుతోందని, తమ వద్ద కర్ర లేని సమయంలో ధర పెంచినా ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.


ఎస్సీ సోదరుల 27 పథకాలకు మంగళం

జిల్లాలో ఎస్సీ జనాభా 6 లక్షలు, ఎస్టీలు లక్ష వరకు ఉన్నారు. కొండపి, యర్రగొండపాలెం, సంతనూతలపాడు రిజర్వు నియోజకవర్గాల్లోనే 3 లక్షల మంది ఉన్నారు. గత తెదేపా ప్రభుత్వంలో వారికి అందించిన 27 పథకాలను వైకాపా మంగళం పాడింది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లించింది. ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసింది.


ఆచరణ శూన్యం..రూ.20కోట్లు నష్టం

ఫిబ్రవరి 21న పొన్నలూరు మండలం తిమ్మపాలెం సమీపంలో ఏర్పాటుచేసిన రైతు సదస్సులో జగన్‌ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ప్రతి మండలంలో గిడ్డంగులు, శీతలీకరణ కేంద్రాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రత్యేక నిధి, బీమా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. దర్శి, మార్కాపురంలో గత ప్రభుత్వంలో ప్రారంభమైన శీతల గిడ్డంగుల నిర్మాణాలకూ నిధులివ్వలేదు. హామీ మేరకు జిల్లాలో 30కి పైగా శీతల గిడ్డంగులు నిర్మించాలి. ఒక్కటీ నిర్మించకపోవడంతో రైతుల్ని ఊసురోమంటూ ప్రైవేటు గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకున్నారు. కొండపి నియోజకవర్గంలో 7వేల మంది పొగాకు, 3వేల మంది శనగ రైతులున్నారు. వారంతా ప్రైవేటు గిడ్డంగుల్లో నిల్వ, అయినకాడికి అమ్ముకోవడం వల్ల రూ.కోట్లు నష్టపోయారు. ఒక్కో రైతు రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోయారు. ఇలా అయిదేళ్లలో 5వేల మంది రైతులు సగటున రూ.20 కోట్లు నష్టపోయారు.


ఆయనొస్తే చెట్లు నరకాల్సిందే..!

టంగుటూరు బస్టాండు వద్ద చెట్లు కొమ్మలను నరికివేశారిలా

టంగుటూరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా ఆ మార్గంలో ఉన్న చెట్లు నేలకొరగాల్సిందే. తాజాగా మంగళవారం ప్రకాశం జిల్లా టంగుటూరులో బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో టంగుటూరు జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి కాన్వాయ్‌లో టంగుటూరు బొమ్మల కూడలికి చేరుకుంటారు. అయితే ఈ మార్గంలో ఉన్న చెట్ల కొమ్మలను సోమవారం నరకడం మొదలుపెట్టారు. జగన్‌ కాన్వాయ్‌కు ఏమాత్రం అడ్డం లేని చెట్లను సైతం నరకడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని