logo

రాష్ట్రంలో ఒంగోలు నుంచే మార్పు మొదలు

‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు.

Published : 01 May 2024 02:51 IST

ఫార్మా హబ్‌గా ప్రకాశాన్ని తీర్చిదిద్దుతాం
ఆయన జనం ‘చెవి’లో పువ్వులు పెట్టే ‘రెడ్డి’
యువగళం సభలో  నారా లోకేశ్‌

యువతతో మాట్లాడుతున్న తెదేపా జాతీయ కార్యదర్శి లోకేశ్‌

ఈనాడు, ఒంగోలు: ‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు. మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపించి ప్రకాశం జిల్లా తెదేపా అడ్డా అని నిరూపిద్దాం. అధికారంలోకి రాగానే జిల్లాను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. ఫార్మా హబ్‌గా అభివృద్ధి చేసి యువతకు జిల్లాలోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తాం..’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జిల్లా యువతకు భరోసా ఇచ్చారు. ఒంగోలులో మంగళవారం నిర్వహించిన యువగళం ఎన్నికల సమరభేరి సభలో ఆయన ప్రసంగించారు. ఒక్క అవకాశం అన్న మాటకు ప్రజలు పడిపోయి వైకాపాను గెలిపించారన్నారు. గద్దెనెక్కిన జగన్‌ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. అయిదేళ్లలో రాష్ట్ర ప్రజలు ఎంతగానో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మార్పు ఒంగోలు నుంచే ప్రారంభమైందని, మరో పన్నెండు రోజుల్లో సైకో పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతపురంలో కియా మోటార్స్‌ను చంద్రబాబు తెస్తే, జగన్‌ గంజాయి రాష్ట్రంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. మైకు పట్టుకుని మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా ప్రజల పక్షాన పోరాడేవారందరి పైనా కేసులు పెట్టారని దుయ్యబట్టారు. పంచాయతీ రాజ్‌ మంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశానికి అధిక నిధులు ఖర్చుచేశామని, ఒంగోలులో దామచర్ల జనార్దన్‌ ఆధ్వర్యంలో రూ.2,500 కోట్లు అభివృద్ధికి వెచ్చించామన వివరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెవిలో పువ్వుల రెడ్డని, ఆయన అక్కడ ఎర్రచందనం కొల్లగొట్టి ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేక ఇక్కడికి వచ్చి ఒంగోలు వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని, ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని యువతను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని