logo

ఉపాధి హరీ.. శ్రమజీవికి ఉరి

శ్రమను పెట్టుబడిగా..స్వేదాన్ని ఇంధనంగా మార్చి పారిశ్రామిక వెలుగులు పూయించిన కార్మిక వర్గం నేడు చీకట్లో మగ్గుతోంది. తెదేపా హయాంలో మద్దిపాడు గ్రోత్‌ సెంటర్‌..గెలాక్సీపురిలో గ్రానైట్‌ యూనిట్లు..మార్కాపురంలో పలకల పరిశ్రమలు శ్రమజీవులతో కళకళలాడేవి.

Published : 01 May 2024 02:58 IST

జగన్‌ దెబ్బకు పరిశ్రమల మూత
గ్రోత్‌ సెంటర్‌లో రోడ్డునపడ్డ ఏడువేలమంది
కళావిహీనంగా గ్రానైట్‌, పలకల పరిశ్రమలు
నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
ఈనాడు, ఒంగోలు- న్యూస్‌టుడే, మద్దిపాడు, సంతనూతలపాడు, మార్కాపురం

శ్రమను పెట్టుబడిగా..స్వేదాన్ని ఇంధనంగా మార్చి పారిశ్రామిక వెలుగులు పూయించిన కార్మిక వర్గం నేడు చీకట్లో మగ్గుతోంది. తెదేపా హయాంలో మద్దిపాడు గ్రోత్‌ సెంటర్‌..గెలాక్సీపురిలో గ్రానైట్‌ యూనిట్లు..మార్కాపురంలో పలకల పరిశ్రమలు శ్రమజీవులతో కళకళలాడేవి. అయిదేళ్ల క్రితం జగన్‌ ప్రభుత్వం కొలువుదీరాక తీసుకున్న ఒక్కో తప్పుడు నిర్ణయంతో ఒక్కో యూనిట్‌ మూతపడుతూ వచ్చింది. ఫలితంగా యంత్రాల గుండెచప్పుడు నిలిచిపోయింది..కార్మిక వర్గం దిక్కులేనిదైంది. 

గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో పరిశ్రమలతో కళకళలాడిన జిల్లా నేడు కళావిహీనంగా మారింది. రాయితీలు ఎత్తేయడంతో యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మద్దిపాడు గ్రోత్‌ సెంటర్‌ నేడు ఎలాంటి అలికిడి లేకుండా ఉండటం కార్మిక వర్గానికి ఆవేదన   కలిగిస్తోంది. గతంలో గ్రోత్‌ సెంటరులోని పారిశ్రామికవాడను 1350 ఎకరాల్లో నెలకొల్పారు. 630 ఫ్లాట్లలో సుమారు 270 కంపెనీల వరకు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా గ్రానైట్, రసాయన, ప్లాస్టిక్‌, సిమెంట్ బ్రిక్స్‌, అల్యూమినియం, రొయ్యలు, కోళ్ల మేత కంపెనీలున్నాయి. వీటిలో సుమారు పది వేల మంది వరకు కార్మికులుండే వారు. వారిని నమ్ముకొని పరోక్షంగా పదుల సంఖ్యలో కుటుంబాలు చిరు దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగించేవారు. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాలు, రాయితీలను నిలిపివేయడం, విద్యుత్తు ఛార్జీల బాదుడుతో దాదాపు సగం పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పుడు కేవలం 100 నుంచి 150 కంపెనీలు మాత్రమే నడుస్తున్నాయి. నాడు పదివేలమంది పనిచేసేశారు. ఇప్పుడు కేవలం 3,000ల మంది వరకు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన దాదాపు 7,000ల మంది కార్మికులు రోడ్డున పడ్డారు.

గెలాక్సీపురిలో అప్పట్లో లక్షమందికి...

ప్రత్యక్షంగా పాతిక వేలు, పరోక్షంగా లక్ష మందికి పైగానే ఉపాధి కల్పిస్తున్న గ్రానైట్‌ పరిశ్రమ గత కొన్నేళ్లుగా కుదేలైంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో గడ్డు పరిస్థితి నెలకొంది.  గత అయిదేళ్లుగా కనీసం వేతనాలు పెంచమని డిమాండ్‌ చేయలేని పరిస్థితుల్లో కార్మికులు నలిగిపోతున్నారు. చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం, బూదవాడ పంచాయతీల పరిధిలో సుమారుగా 40 సంస్థలు గెలాక్సీ గ్రానైట్‌ క్వారీయింగ్‌ చేస్తున్నాయి. ఈ క్వారీలకు అనుబంధంగా జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల వరకు గ్రానైట్‌ ఫ్యాక్టరీలున్నాయి. అందులో రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తుండేవారు.

సంస్థలు కార్యకలాపాలు నిలిపేసి..

గత కొంతకాలంగా గెలాక్సీ గ్రానైట్‌ పరిశ్రమ పరిస్థితి దయనీయంగా మారింది. రెండేళ్ల కిందట చీమకుర్తి ప్రాంతంలో 43 సంస్థలు కార్యకలాపాలు నిర్వహించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 35కి పడిపోయాయి. అసలే అంతర్జాతీయంగా మాంద్య పరిస్థితులు ఎదురవుతున్న తరుణంలో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవవడం.. పన్నుల రూపంలో భారాలు మోపడంతో వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిన చందంగా మారిందని యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నారు.

కొన్ని క్వారీలు మూత దిశగా సాగుతున్నాయి. రెండు మూడు నెలలకు కూడా వేతనాలు ఇవ్వడం లేదు. యాజమాన్యాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. జాకీ కార్మికులకు వేతన సవరణ చేయాలని గెలాక్సీ గ్రానైట్‌ కార్మికుల సంఘం కొన్నేళ్లుగా యాజమాన్యాలకు నోటీసులిస్తున్నారు.

నాడు వంద ఫ్యాక్టరీలు.. నేడు పన్నెండు

  • గతంలో పారిశ్రామికవాడలో వంద గ్రానైట్ ఫ్యాక్టరీల్లో 2,500 మంది పనిచేస్తుండగా, నేడు 12 మాత్రమే నడుస్తున్నాయి. వీటిలో కేవలం వందమంది పనిచేస్తున్నారు. మిగిలిన వారు పనులు లేక స్వగ్రామాలకు, వలసలు పోతున్న పరిస్థితి.
  • గ్రానైట్ ఎస్‌ఈజెడ్‌లో 15 ఫ్యాక్టరీలుండగా, వీటిలో 3వేల మంది వరకు పనిచేసేవారు. ప్రస్తుతం 750 మంది వరకు మాత్రమే ఉన్నారు. వారిలో ఎక్కువుగా స్థానికులతో పాటు రాజస్థాన్‌, గుజరాత్‌, అసోం, యూపీ, ఒడిశా ప్రాంతాలకు చెందిన వారు ఉండేవారు.  ఇప్పుడు వారికి ఉపాధి కరవైంది.

మార్కాపురం పారిశ్రామికవాడలో రాతిని చీల్పులు చేస్తున్న కార్మికులు

పలకలకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం నేడు ఉనికి కోల్పోయింది. క్వారీలోని రాతిని బయటకు తీసి వాటిని చీల్పులు చేసి అనంతరం అందమైన ఆకృతులుగా తీర్చిదిద్ది అమెరికా, సింగపూర్‌, దుబాయ్‌, మలేసియా, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు. జగన్‌ సర్కార్‌ విధించిన రాయల్టీ చెల్లించలేక పరిశ్రమల యజమానులు డీలాపడ్డారు. మార్కాపురం, కంభం, అర్థవీడు, బేస్తవారపేట, రాచర్ల, కొమరోలు, తర్లుపాడు, కొనకనమిట్ల, పెద్దారవీడు మండలాల్లో గతంలో 10 వేల నుంచి 15 వేల మందికిపైగా కార్మికులు పలకల క్వారీలు, పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవించేవారు. పారిశ్రామిక వాడలో గతంలో 70 వరకు పరిశ్రమలున్నాయి. ప్రస్తుతం 20 పరిశ్రమల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయి. వాటిల్లో 450 నుంచి 600 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఏడాదికి గతంలో 15వేల టన్నుల సరకును ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం 500 టన్నుల నుంచి వెయ్యి టన్నులలోపే పంపుతున్నారు.

చీమకుర్తిలోని ఓ పరిశ్రమలో నిండిపోయిన గ్రానైట్‌ స్లాబులు

రూ.నూట పది కోట్ల స్థానే..అయిదుకోట్ల టర్నోవర్‌

గతంలో 70 పరిశ్రమల్లో వార్షిక టన్నోవర్‌ 110 కోట్ల వరకు పరిశ్రమల మీద వ్యాపారం జరిగేది. అయితే ప్రస్తుతం రూ.5 కోట్ల వ్యాపారం కూడా జరగడం మార్కాపురం పారిశ్రామికవాడలో 60 ఏళ్ల కిందట నిర్మాణం చేసిన రహదారులు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ప్రస్తుతం అన్ని రహదారులు మట్టి రోడ్లుగా మారిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారినా పాలకులు పట్టించుకోవడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని