logo

ఫ్లోరైడ్‌ ఊసెత్తక.. నిమ్జ్‌ మాటెత్తక..

జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల ప్రచార సభ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. కనిగిరి ప్రాంత సమస్యలపై గట్టి హామీలిస్తారని..తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది.

Published : 04 May 2024 06:22 IST

చప్పగా సాగిన జగన్‌ ప్రసంగం
కనిగిరి సభతో వైకాపా శ్రేణులు డీలా

తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాల ప్ల కార్డును చూపుతున్న ముఖ్యమంత్రి జగన్‌

కనిగిరి, న్యూస్‌టుడే: జిల్లాలో ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల ప్రచార సభ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. కనిగిరి ప్రాంత సమస్యలపై గట్టి హామీలిస్తారని..తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. కనిగిరి పట్టణంలోని దుర్గం బాప్టిస్ట్‌ సెంటర్‌లో శుక్రవారం ఆయన నిర్వహించిన బహిరంగ సభ చప్పగా సాగింది. ఫ్లోరైడ్‌ విష జలంతో విలవిల్లాడుతున్న తమకు ఊరట కల్పిస్తారని, వెలిగొండ ప్రాజెక్ట్‌, మోపాడు జలాశయం మరమ్మతులు, నిమ్జ్‌, ట్రిపుల్‌ ఐటీ వంటి కీలక అంశాలపై మాట్లాడతారనుకుంటే, వాటిని వదిలేసి జనసేన నేత పవన్‌, తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలపై విమర్శలు గుప్పించడంతో కార్యకర్తలు, అభిమానులు డీలా పడిపోయారు. ఇటీవల జరిగిన టంగుటూరు సభ మాదిరే, కనిగిరి సభ కూడా తుస్సుమనడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారు.

అసలే ఊకదంపుడు..ఆపై గంట ఆలస్యం:  గత ఎన్నికల సమయంలో కనిగిరిలో నిమ్మ, బత్తాయి మార్కెట్లు ఏర్పాటు చేయిస్తానని, ప్రతి ఇంటికి సాగర్‌ జలాలు అందిస్తానని, కనిగిరి కమ్యూనిటీ వైద్యశాలను 100 పడకల వైద్యశాలగా మారుస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. శుక్రవారం నాటి ప్రసంగంలో వాటి ఊసెత్తలేదు. అసలే గంట ఆలస్యంగా సభ ప్రారంభం కావడం.. దానికితోడు ఊకదంపుడు ఉపన్యానం కొనసాగించారు. దీంతో జనం జారుకున్నారు. ఎక్కడ నీడ కన్పిస్తే అక్కడకు వెళ్లి తలదాచుకున్నారు. జగన్‌ ప్రసంగం మొదలుపెట్టిన అయిదు నిమిషాలకే పలువురు సభ ప్రాంగణం నుంచి వెనుదిరిగారు. సీఎంపై గులకరాయి దాడి ఘటన నేపథ్యంలో జనం కన్నా పోలీసులే ఎక్కువగా కన్పించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో స్థానికులు నానా అవస్థలకు గురయ్యారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని