logo

నిత్యం పరేషాన్‌

ఇంటింటికీ ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటం చేయడం తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఏ ప్రాంతంలో ఎప్పుడు సరకులిస్తారో తెలియదు..  సమయ పాలన ఉండదు.

Published : 04 May 2024 06:28 IST

ఇంటింటికీ బియ్యం ఊసేలేదు
రేషన్‌ సరఫరా అస్తవ్యస్తం
వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు

ఒంగోలులో ఒకేచోట ఎండీయూ వాహనం నిలిపి బియ్యం పంపిణీ

ఇంటింటికీ ఎండీయూ(మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటం చేయడం తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఏ ప్రాంతంలో ఎప్పుడు సరకులిస్తారో తెలియదు..  సమయ పాలన ఉండదు. వీధిలో ఓ వైపు నిలిపి పంపిణీ చేయడంతో వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నిత్యావసరాల ధరలు మండుతున్న వేళ కందిపప్పునకు ఎగనామం పెట్టడంతో పేదలకు దిక్కుతోచడం లేదు.

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో 1392 రేషన్‌ దుకాణాలు ఉండగా, వాటి పరిధిలో 6,55,525 బియ్యం కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలకు ప్రతి నెలా అర కిలో పంచదార, కిలో కందిపప్పు రాయితీపై అందిస్తోంది. కార్డులోని కుటుంబ సభ్యులకు అయిదు కిలోల చొప్పున బియ్యం పంపిణీ జరుగుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం కిలో రూపాయికే ఇస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాయితీ బియ్యాన్ని కొనసాగిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తన కోటాను నిలుపుదల చేసి ఉచితంగా పంపిణీ చేస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి నెలా పౌరసరఫరాల గిడ్డంగుల నుంచి స్థానిక రేషన్‌ దుకాణాలకు సరకుల తరలిస్తారు. కార్డుదారులకు సరఫరాను బట్టి సదరు డీలర్లు ఎండీయూ వాహనాలకు సరకులు అందిస్తారు. అందుకు జిల్లా వ్యాప్తంగా 385 ఎండీయూ వాహనాలను కేటాయించారు. వాటి ద్వారా ఇంటింటికి సరకులు అందజేసే బాధ్యత ఆపరేటర్లదే.

అన్నీ అసౌకర్యాలే!

ఎండీయూ వాహనం ఇంటికొస్తుందన్న ప్రభుత్వ ప్రచారమే తప్ప..ఎక్కడా అమలు కావడం లేదు. దీనికితోడు ఇంటి దగ్గర ఉన్నవారికే సరకులు అందుతున్నాయి. ఇక కూలి పనులకు వెళ్లే వారు బండి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరో పక్క వృద్ధులు, దివ్యాంగులు వీధి చివరికి వెళ్లి సరకులు తెచ్చుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇంటి వద్దకే సరకులు అంటూ వాహనాలు తీసుకురావడం వల్ల ప్రభుత్వానికి భారం తప్ప తమకు ఎలాంటి ప్రయోజనం లేదని కార్డుదారులు వాపోతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన జిల్లా అధికార యంత్రాంగం ఆ బాధ్యతను గాలికొదిలేసింది.

రెండేళ్లుగా కందిపప్పు ఊసే లేదు

ప్రతి నెలా కార్డుదారులకు సరఫరా నిమిత్తం జిల్లాకు 655 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అవసరం కాగా, అందుకు గత రెండేళ్లుగా నెలకు సరాసరిన 100 నుంచి 150 మెట్రిక్‌ టన్నుల మాత్రమే కేటాయించారు. దీంతో పురపాలక, మండల కేంద్రాలకు ప్రాధాన్యాన్నిచ్చి అక్కడ పంపిణీ చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా లేకపోవడంతో కార్డుదారులకు స్వస్తి చెప్పారు. బయట మార్కెట్లో ఉప్పు నుంచి పప్పుల వరకు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుదారులు రేషన్‌ దుకాణాల్లో ఇచ్చే సరకులపైనే ఆధారపడుతున్నారు.

బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.180

ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కందిపప్పు కిలో రూ.180 వరకు పలుకుతోంది. పౌర సరఫరాల దుకాణాల ద్వారా రాయితీ పోనూ కిలో రూ.67కే ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా రాయితీని ప్రభుత్వం భరించలేక పప్పు సరఫరా ఆపేసింది. కిలోతోనే పేద కుటుంబాలు నెలంతా నెట్టుకొచ్చేవారు. మరోపక్క బయట మార్కెట్లో పెరిగిన ధరకు కొనుగోలు చేయడం పేదలకు భారంగా మారింది. గత పది నెలలుగా పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి పంపిణీ చేస్తుండగా, అది కూడా నాలుగోవంతు మందికే అందించి చేతులు దులుపుకుంటున్నారు.

ఇచ్చేది తక్కువ..కొనేదే ఎక్కువ

సాధారణంగా రేషన్‌ పంపిణీ చేసే సమయంలో డీలర్‌ తప్పనిసరిగా సహాయకుడిని కూడా పెట్టుకోవాలి. అయితే వాహనాల వెంబడే రేషన్‌ డీలర్లు ఉంటున్నారు. వారే సహాయకుడి పాత్ర పోషిస్తున్నారు. బియ్యాన్ని దాదాపు 80 శాతం మంది తీసుకోవడం లేదు. కార్డుదారుల నుంచి  బయోమెట్రిక్‌ నమోదు చేసి వారికి కిలోకు రూ.10 నుంచి రూ.12 వరకూ ముట్టజెప్పి ఆ బియ్యాన్ని డీలర్లు తమ వద్దే ఉంచేసుకుంటున్నారు. దీంతో రేషన్‌ సరఫరా అంతా అభాసు పాలవుతోంది. ఎక్కువ ప్రాంతాల్లో డీలరు, ఆపరేటర్‌ కలిసే బియ్యం కొనుగోలు చేస్తుండగా; మరికొన్ని చోట్ల వేర్వేరుగా సేకరిస్తున్నారు. వాటిని ఆ రోజు డిమాండ్‌ను బట్టి కిలో రూ.16 నుంచి రూ.20 వరకు బయటి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఇక పంచదార ప్రతి కుటుంబానికి అర కిలో ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో దీని ధర ఎక్కువగా ఉండటంతో కార్డుదారులందరూ తప్పనిసరిగా దీన్ని  తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని