logo

ఓటేయకుంటే... గొంతులూ తడపం

గొంతులెండుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే.. ‘మీరు మా పార్టీ కాదు కదా’ అని ప్రశ్నిస్తూ అమానుషంగా ప్రవర్తిన్నారు వైకాపా నాయకులు.

Published : 07 May 2024 03:07 IST

ఎన్నికల వేళ వికృత రాజకీయం
అధికార పార్టీ సిఫార్సులకే ట్యాంకర్లు

గొంతులెండుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే.. ‘మీరు మా పార్టీ కాదు కదా’ అని ప్రశ్నిస్తూ అమానుషంగా ప్రవర్తిన్నారు వైకాపా నాయకులు. అయిదేళ్ల వైకాపా పాలనలో రక్షిత నీటి పథకాలతో దాహార్తి తీర్చలేకపోయారు. ఉన్న వాటి ఉసురు తీసి బిందెడు తాగునీటి కోసం పల్లెలు, పట్టణాలూ తల్లడిల్లేలా చేశారు. ఖాళీ బిందెలతో ఊరూరా మహిళలు రోడ్డెక్కాల్సిన దుర్గతిని సృష్టించారు. ఎన్నికల వేళ ట్యాంకర్లతో చేస్తున్న నీటి సరఫరాలోనూ రాజకీయానికి తెర లేపారు.

ఒంగోలు నగరం, గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే

ఒంగోలు వాసుల అవసరాలకు తగినట్లుగా ఓఎంసీ నీరు సరఫరా చేయడం లేదు. ట్యాంకర్లూ నడపటం లేదు. విధి లేని పరిస్థితుల్లో నాయకులను ఆయా ప్రాంతాల వాసులు ఆశ్రయిస్తున్నారు. ఇక్కడే కొందరు అధికార పార్టీ కార్పొరేటర్లు, డివిజన్‌ నాయకులు నీళ్లకు రాజకీయ రంగు పులిమి అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాము చెప్పిన వీధికే నీటి ట్యాంకర్లు పంపాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రతిపక్షాలకు చెందిన వార్డులకు ఆపేస్తున్నారు. నగరంలోని 17 కాలనీలకు నీరందించేందుకు 37 ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం మూడు నెలలకు రూ.40 లక్షలు చొప్పున బిల్లులు చెల్లిస్తున్నారు. ఇదంతా ప్రజాధనమే అయినప్పటికీ తాము సిఫార్సు చేసిన ప్రాంతాలకే ట్యాంకర్లు నడపాలంటూ.. వైకాపా నేతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ప్రశాంతినగర్‌ వాసులు

టెండర్‌ కట్టబెట్టి కుయుక్తులు...

గిద్దలూరు నగర పంచాయతీలో 15 ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ టెండర్‌ను వైకాపా నాయకులు ఓ గుత్తేదారుడికి కట్టబెట్టించారు. కేవలం ఆరు మాత్రమే నడుపుతున్నారు. రెండింటిని ఓ వైకాపా నేత తన వార్డుకే పరిమితం చేసుకున్నారు. మిగతా నాలుగింటితో వారు చెప్పిన చోటే సరఫరా చేయిస్తున్నారు. విసిగి వేసారిన ప్రశాంతినగర్‌ వాసులు ఇటీవల నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని