logo

పాలబుగ్గలపైనా పాలకుడి పగ

ప్రజాక్షేమమే పాలకుల అంతిమ లక్ష్యం..అయితే అయిదేళ్ల క్రితం కొలువుదీరిన ఆంధ్రా పాలకుడు మాత్రం దీనికతీతం. అధికార పీఠమెక్కాక ఆయన కర్కశంగా ప్రాథమిక విద్య గొంతు నులిమేశారు. పాఠశాలల విలీనమంటూ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఇటు చిన్నారులు..అటు ఉపాధ్యాయులు విలవిల్లాడారు.

Published : 08 May 2024 04:42 IST

చిన్నారులు విలవిల.. ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి
ప్రాథమిక విద్యకు విలీనం దెబ్బ
ఒంగోలు నగరం, న్యూస్‌టుడే

ప్రజాక్షేమమే పాలకుల అంతిమ లక్ష్యం..అయితే అయిదేళ్ల క్రితం కొలువుదీరిన ఆంధ్రా పాలకుడు మాత్రం దీనికతీతం. అధికార పీఠమెక్కాక ఆయన కర్కశంగా ప్రాథమిక విద్య గొంతు నులిమేశారు. పాఠశాలల విలీనమంటూ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఇటు చిన్నారులు.. అటు ఉపాధ్యాయులు విలవిల్లాడారు. బుడిబుడి అడుగులేసే వారిపైనా ఆయన కత్తిగట్టడం ఏమిటని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉపాధ్యాయ పోస్టులు తగ్గించి కాసులు మిగుల్చుకునేందుకే దీనికి ఒడిగట్టారని వారు ఆవేదన చెందుతున్నారు.

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రాథమిక విద్య కుదేలవ్వడంతో ప్రవేశాలు గణనీయంగా పడిపోయాయి. ఫలితంగా ప్రైవేటు పాఠశాలలకు మేలు జరిగింది. ఆయన రెండేళ్ల క్రితం 117 జీవో జారీ చేసి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీనిద్వారా మూడు నుంచి పదో తరగతి వరకు ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్‌ని నియమించి మెరుగైన బోధన చేస్తామంటూ గప్పాలు పలికారు. ఒక కిలోమీటరు దూరంలో ఉన్నత పాఠశాల ఉంటే ఆ సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో 3,4,5 తరగతుల పిల్లలను అందులో విలీనం చేశారు.

విలీనమైన సీఎస్‌పురంలోని ఎ.కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల

ప్రమాదకర రహదారులున్నా.. 

కాలువలు, ప్రమాదాలకు ఆస్కారమున్న జాతీయ రహదారులు అడ్డుగా ఉన్నచోట విలీనం చేయవద్దని మార్గదర్శకాల్లో పేర్కొన్నా వాటిని పాటించకుండా ఇష్టారీతిన కలిపేశారు. ఉదాహరణకు త్రోవగుంట, పేర్నమిట్టలోని ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలకు వెళ్లడానికి మధ్యలో ప్రధాన రహదారులు దాటాలి. బుడిబుడి అడుగులేసే చిన్నారులు ఇవి దాటి ఎలా వెళ్లగలరన్న స్పృహ పాలకులకు కొరవడింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రైవేటు స్కూళ్లలో తమ చిన్నారుల్ని జాయిన్‌ చేశారు. ఆ విధంగా పిల్లలు తగ్గిపోయి పాఠశాలల్లో టీచర్‌పోస్టులు మిగులుగా తేలాయి. నిబంధన ప్రకారం 30 మందికి ఒక టీచర్‌ ఉండాలి. విలీనం తరువాత వందమంది ఉన్నచోట 40 మందికి పడిపోయారు. ఇలా ముగ్గురు టీచర్లు ఉన్న పాఠశాల ఒకరితో ఏకోపాధ్యాయగా మారిపోయింది. జిల్లాలో 310 పాఠశాలలు ప్రస్తుత ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి.

డీఎస్సీలో పోస్టులకు మంగళం

మూడు నుంచి పదో తరగతి వరకు సబ్జెక్టు టీచర్లను నియమిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటన అమలుకు నోచుకోలేదు. ఉద్యోగోన్నతులు కల్పించనందున పలు పాఠశాలల్లో పూర్తిస్థాయిలో టీచర్లు లేక బోధన కుంటుపడుతోంది. దీనికి తోడు ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టులను మిగులుగా చూపించడం వల్ల డీఎస్సీ నోటిఫికేషన్‌లో జిల్లాలో పోస్టులు లేకుండా పోయాయి. కేవలం 315 స్కూలు అసిస్టెంట్‌ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. చివరికి అది కూడా జరగలేదు. ఎస్జీటీ పోస్టులు ఖాళీలు లేక పోవడంతో డీఎడ్‌ చదివిన సుమారు 7 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. వారికి భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది.

విలీన చిత్రం

  • విలీనమైన ప్రాథమిక పాఠశాలలు : 404
  • విలీనం చేసుకున్న ఉన్నత పాఠశాలలు : 272
  • మిగులుగా తేలిన టీచర్లు : 1102 మంది (1080 పాఠశాలలు)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు