logo

పార్టీ మారారని అక్కసు.. వైకాపా బరితెగింపు

ఎన్నికల వేళ ఓటమి భయం వైకాపా నాయకులను బరితెగించేలా చేస్తోంది. ప్రచారంలో తమకు ఎదురవుతున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారు. విధానాలు నచ్చక పార్టీ వీడిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.

Updated : 08 May 2024 07:42 IST

తెదేపా కార్యకర్తపై రాత్రి వేళ దాడి

సత్యనారాయణను పరామర్శిస్తున్న తెదేపా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి..

దర్శి, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ ఓటమి భయం వైకాపా నాయకులను బరితెగించేలా చేస్తోంది. ప్రచారంలో తమకు ఎదురవుతున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారు. విధానాలు నచ్చక పార్టీ వీడిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. దర్శి మండలం చందలూరులో సోమవారం రాత్రి చోటుచేసుకున్న సంఘటన ఇందుకు నిదర్శనం. శెట్టినేని సత్యనారాయణ వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ వర్గీయుడు. ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు అందం సత్యనారాయణ, మరికొందరితో కలిసి ఆయన గత నెల 19న తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి సమక్షంలో వైకాపాను వీడారు. అప్పటి నుంచి తెదేపా తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అదే గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం క్షేత్రసహాయకుడు వైకాపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించారు. పార్టీ మారడంతో పాటు ఉపాధి సిబ్బందిపై వేటుకు సత్యనారాయణే కారణమని వైకాపా నాయకులు అతడిపై కక్ష గట్టారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న అతని వద్దకు వైకాపా నాయకులు అడ్డగిరి నాగేశ్వరరావు, చవలం రామాంజి, గోపు శేఖర్‌ తదితరులు వచ్చి మూకదాడికి దిగారు. ఈ ఘటనలో సత్యనారాయణ తలకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న స్నేహితులు చికిత్స నిమిత్తం అతన్ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్శి సీఐ సమీముల్లా బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. గుంటూరులో ఉంటున్న వెంకటరావు అనే వ్యక్తి ప్రోద్బలంతోనే తనపై దాడికి పాల్పడినట్లు సత్యనారాయణ తెలిపారు.

బాధితుడి తలకు గాయం

ఓటమి భయంతోనే దాడులు...: తెదేపా నాయకుడిపై దాడి విషయం తెలుసుకున్న ఆ పార్టీ దర్శి నియోజకవర్గ అభ్యర్థిని ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితుడిని మంగళవారం పరామర్శించారు. ఓటమి భయంతోనే వైకాపా నేతలు ప్రత్యర్థులపై మూకదాడులకు దిగుతున్నారని విమర్శించారు. దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు