logo

మునుగుతున్నాం.. కొనేద్దాం!

2019 ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చారు. అమలు చేయమని అడిగితే పోలీసులను ఉసిగొల్పి అన్ని వర్గాలపై ఉక్కుపాదం మోపించారు. గత అయిదేళ్లుగా ఎక్కడా అభివృద్ధి లేదు. మరోసారి జనం నమ్మే పరిస్థితి ఎలాగూ లేదు. మరోపక్క విద్యుత్తు ఛార్జీలతో పాటు, అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు పెరిగాయి.

Published : 08 May 2024 04:49 IST

ఓటమి భయంలో ‘అధికార’ అభ్యర్థులు
ఊరూరా ఓట్ల కొనుగోలుకు బేరసారాలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే

2019 ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చారు. అమలు చేయమని అడిగితే పోలీసులను ఉసిగొల్పి అన్ని వర్గాలపై ఉక్కుపాదం మోపించారు. గత అయిదేళ్లుగా ఎక్కడా అభివృద్ధి లేదు. మరోసారి జనం నమ్మే పరిస్థితి ఎలాగూ లేదు. మరోపక్క విద్యుత్తు ఛార్జీలతో పాటు, అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు పెరిగాయి. తమ పాలనపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోందని ఆ పార్టీ నేతలు, అభ్యర్థులకే తెలిసొచ్చింది. దీంతో అడ్డదారులు తొక్కైనా గెలవాలనే ఉద్దేశంతో బరి తెగిస్తున్నారు. ఓటుకు నోటు చూపుతూ గంపగుత్తగా ఓట్ల బేరానికి తెర లేపింది.

‘తపాలా’లోనే తేలిపోయింది..!

జిల్లావ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు వైకాపాను వీడి ప్రధాన ప్రతిపక్షం తెదేపాలో చేరారు. జగన్‌ అయిదేళ్ల పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన వికృత విధానాలతో రాష్ట్రాన్ని దివాళా అంచున నిలిపారంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్న తపాలా బ్యాలెట్‌ పోలింగ్‌లోనే ఉద్యోగుల వైఖరి ఆ పార్టీకి పూర్తిగా తెలిసొచ్చింది. దీంతో ఓటర్లకు గాలం వేసేందుకు ముందుగానే నగదు పంపిణీకి శ్రీకారం చుట్టింది. జనం మద్దతు లేకున్నా ధన బలంతోనైనా ఎన్నికలు ఎదుర్కొనే కుతంత్రానికి కొందరు తెర లేపారు.

జిల్లా కేంద్రంలో అప్పుడే మొదలు...

ఆ పార్టీ నాయకులు, ఓఎంసీకి చెందిన కొందరు కార్పొరేటర్లు సోమవారం రాత్రి నుంచి ఒంగోలు నగరంలోని అన్ని డివిజన్లలో ప్రలోభాలకు గేట్లు ఎత్తారు. ఓటుకు రూ.3 వేలు చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మొత్తాన్ని అందిస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా ఈ తంతు కొనసాగింది. ప్రధానంగా శివారు కాలనీల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులతో పాటు, రోజువారీ పనికి వెళ్లే కూలీలపై దృష్టి సారించారు. నగదు, మద్యం వంటి తాయిలాలతో గాలం వేస్తున్నారు. ప్రచారంలోనూ భోజనాలతో పాటు, మద్యం, నగదు ఇస్తూ తమ వెంట తిప్పుకొంటున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక, ఉన్నత జీవితం కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లిన వలస ఓటర్లను ఓటుకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఛార్జీలతోపాటు, ఓటుకు ప్రత్యేకంగా నగదు ఇస్తామని ఆశ చూపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు