logo

సకుటుంబ స‘మేత’

పశ్చిమంలో తమ హయాంలో నయీం సోదరులుగా పేరొందిన ఆ సోదరద్వయం సాధించిన అరుదైన ఘనత. వాళ్లిద్దరే కాదు, ఆ ఎమ్మెల్యేకు పిల్లనిచ్చిన మామ, మేనత్త కుటుంబాలు సాగించిన అక్రమాలు అనేకం.

Updated : 09 May 2024 05:13 IST

పొరుగు స్థానంలో వాలిన గద్దలు
సొంత పార్టీ శ్రేణుల పైనే దౌర్జన్యాలు
బెంబేలెత్తుతున్న పశ్చిమ ప్రాంత వాసులు
న్యూస్‌టుడే, ఒంగోలు

భూ అక్రమాల కేసుల్లో ఏకంగా పదహారు మంది వీఆర్‌వోల సస్పెన్షన్‌. అక్రమ రిజిస్ట్రేషన్లతో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లపై వేటు. మండల కేంద్రంలో ఏకంగా పది మందికి పైగా తహసీల్దార్ల బదిలీ.

-ఇది అక్కడ ట్రాక్‌ రికార్డు కాదు.., రాష్ట్రంలోనే ఓ ఆల్‌టైమ్‌ రికార్డు

పశ్చిమంలో తమ హయాంలో నయీం సోదరులుగా పేరొందిన ఆ సోదరద్వయం సాధించిన అరుదైన ఘనత. వాళ్లిద్దరే కాదు, ఆ ఎమ్మెల్యేకు పిల్లనిచ్చిన మామ, మేనత్త కుటుంబాలు సాగించిన అక్రమాలు అనేకం. అక్కడ సాగించిన అవినీతి, అక్రమాలతో గెలుపు అసాధ్యమని తేలడంతో అధిష్ఠానం రాజకీయ బదిలీపై పొరుగు స్థానానికి గెంటేసింది. ఇప్పుడు ఆ గద్దలు పొరుగు స్థానంపై రెక్కలు చాచాయి.

రెవెన్యూలోని బంధువుల సాయంతో...

పశ్చిమంలోని ప్రధాన పట్టణంలో ఓ ప్రజాప్రతినిధి సోదరులపై ఉన్న ఆరోపణలు లెక్కలేనన్ని. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, పోలీసు అధికారులను నయానోభయానో తమ గుప్పిట్లో పెట్టుకుని వందల ఎకరాల భూములను అప్పనంగా కొల్లగొట్టారు. రెవెన్యూలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసే వీఆర్‌వోల్లో తమ బంధువులు కలిసొచ్చింది. వారి అండతో నియోజకవర్గంలో నయీం సోదరులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు.


దళితుల శ్మశానాన్నీ చెరబట్టి...

రాయవరం మెడికల్‌ కళాశాల ప్రాంతంలో ప్రభుత్వ భూములను తమ పేరిట ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. మార్కాపురం పట్టణంలో ఆర్యవైశ్యులకు భూములను వారిని భయభ్రాంతులకు గురిచేసి, దౌర్జన్యపూరితంగా స్వాధీనం చేసుకున్నారు. మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల ప్రాంతాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను కొల్లగొట్టారు. చివరకు దళితుల శ్మశాన భూములను సైతం వదిలిపెట్టకుండా ఆక్రమించేందుకు యత్నించారు. వీరికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్‌, పోలీసు శాఖల్లోని కొందరు అధికారులు, సిబ్బంది శక్తివంచన లేకుండా సహకరించారు. చివరకు ఆ పార్టీ సమన్వయకర్తగా వ్యవహరించిన నేతే.. బంధువులు మనకు బలం కావాలే తప్ప బలహీనతగా మారకూడదని వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


పదవులివ్వడంలోనూ పైసా వసూల్‌...

దరు ప్రజాప్రతినిధి ప్రతిపనిలోనూ పైసా వసూలే పరమావధిగా పనిచేశారు.

  • ఓ ఎంపీపీ పదవికి రెండున్నరేళ్లకు ఏకంగా ధర నిర్ణయించారు. అనంతరం రాజీనామా చేయాలనడంతో తన వద్ద తీసుకున్న మొత్తం ఇస్తేనే అని ఆమె పట్టుబడ్డారు. దీంతో సదరు ఎంపీపీ భర్తపై ఒక మహిళతో తప్పుడు కేసులు పెట్టించి వేధించారు. తాజాగా రాజకీయ బదిలీలు పూర్తయిన తర్వాత ఆమెతో రాజీనామా చేయించారు.
  • మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి ఇస్తామని ఒక మహిళా నాయకురాలిని మభ్యపెట్టి రూ.నాలుగు కోట్లు వసూలు చేశారు. ఆ ప్రతిపాదనకు అధిష్ఠానం అంగీకరించలేదని ఆమెకు మొండిచేయి చూపారు. ఆ నగదుతో హైదరాబాద్‌లో విల్లాలు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఆమె డబ్బులు తిరిగివ్వలేదు.
  • ఒక మైనార్టీ నాయకుడికి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్‌ పదవి ఇపిస్తామని నమ్మబలికి రూ.నాలుగు కోట్లు తీసుకున్నారు. అతను తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో చివరకు ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే కొన్నిగంటల ముందు అతనికి పదవి ఇచ్చి సర్దుబాటు చేశారు.

గెంటినా మారని తీరు...

అక్రమాలతో సిటింగ్‌ స్థానంలో మళ్లీ టికెట్‌ ఇచ్చే సాహసం ఆ పార్టీ అధిష్ఠానం చేయలేకపోయింది. పొరుగుకు బదిలీ చేసి చేతులు దులుపుకొంది. గత కొన్నాళ్లుగా అక్కడే మకాం పెట్టిన ఆ రాబంధువులు ఇప్పుడు ఓట్ల రాజకీయం నడుపుతున్నారు. గతానికి భిన్నంగా దౌర్జన్యపూరిత రాజకీయాలు నడుపుతున్నారు.

  • బేస్తవారపేటలో దొంతల లక్ష్మయ్య అనే ఆర్యవైశ్య వర్గానికి చెందిన నాయకుడు ఇటీవల తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. అదేరోజు సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసి తిరిగి వైకాపాలో చేర్చుకున్నారు.
  • అర్థవీడు ఎంపీపీ వెంకట్రావు తెదేపాలో చేరారనే అక్కసుతో మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు హాజరుకాకుండా అడ్డుకున్నారు. దీంతో పాటు తన రాజకీయం ఇంతకుముందున్న ప్రజాప్రతినిధి తరహాలో ఉండదని.. తన శైలే వేరంటూ హెచ్చరించారు. బెదిరించే ధోరణిలో మాట్లాడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక సొంత పార్టీ కార్యకర్తలే ఆందోళన చెందుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు