logo

ఎవడ్ని ఎక్కడ పెట్టాలో తెలుసు: వైకాపా అభ్యర్థి సతీమణి వ్యాఖ్యలు

రవీ.. నా అంతట నేనే చెబుతున్నాను. మహేషో., దుర్గారెడ్డో., కుమ్మిత అంజిరెడ్డినో నమ్మి అయితే మేము ఎలక్షన్‌ చేయట్లా.. నేను నీకు చెబుతున్నాను గుర్తుపెట్టుకో.. నేనుగానీ, సార్‌గానీ, పెద్దామెగానీ దర్శి నాయకులను పెట్టుకుని ఎలక్షన్‌ చేయట్లేదు.

Updated : 09 May 2024 10:03 IST

పోలింగ్‌ వరకే ఆ పెద్ద తలలు
వాళ్లని నమ్మి పోటీ చేయడం లేదు
దర్శి వైకాపా అభ్యర్థి సతీమణి నందిని మాటలు వైరల్‌
న్యూస్‌టుడే, ఒంగోలు

రవీ.. నా అంతట నేనే చెబుతున్నాను. మహేషో., దుర్గారెడ్డో., కుమ్మిత అంజిరెడ్డినో నమ్మి అయితే మేము ఎలక్షన్‌ చేయట్లా.. నేను నీకు చెబుతున్నాను గుర్తుపెట్టుకో.. నేనుగానీ, సార్‌గానీ, పెద్దామెగానీ దర్శి నాయకులను పెట్టుకుని ఎలక్షన్‌ చేయట్లేదు. మాకు తెలుసు.. మేం 2014లో దెబ్బతిన్నది ఎక్కడో కూడా మాకు తెలుసు. అందుకుని వాళ్లను నమ్మి మేం ఎలక్షన్‌ చేయట్లేదు. వాళ్లని ఏంటంటే ఇరవై ఏళ్లుగా ఉన్నారు కాబట్టి, పెద్ద తలకాయలు పెద్ద తరహాగా ఉండాలి కాబట్టి వాళ్లని అలా అడ్డుపెట్టాము. అది గుర్తు పెట్టుకోండి’.. ఇవీ వైకాపా దర్శి నియోజకవర్గ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సతీమణి నందిని చేసిన వ్యాఖ్యలు.

సుమారు రెండు నెలల క్రితం దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన రవి అనే నాయకుడితో ఆమె మాట్లాడిన ఆడియో కాల్‌ ఎన్నికల వేళ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు విడులైన ఈ ఆడియో ఇప్పుడు దర్శి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఏం వాగినా.. నస పెట్టినా భరిద్దాం: ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ వెంకటరెడ్డి అలియాస్‌ మహేష్‌, వైస్‌ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, రాష్ట్ర బ్యూటీ, గ్రీనరీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కుమ్మిత అంజిరెడ్డిలను ఉద్దేశిస్తూ బూచేపల్లి సతీమణి నందిని ఈ వ్యాఖ్యలు చేయడం., వాళ్లను నమ్ముకుని తాము ఎన్నికలకు రాలేదని, కాకపోతే ఈ రెండు నెలలు వాళ్లని భరించి ఆ తర్వాత పక్కన పెడదామనడం గమనార్హం. ‘వాళ్లు ఏం వాగినా, ఎంత నస పెట్టినా సరే.. బాస్‌కు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో మీకు తెలుసు. ఆయన్ను మనం గెలిపించి ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి. రెండు నెలల తర్వాత ఎవడ్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడదాం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని