logo

రాజ్యమా! జె గ్యాంగ్‌ సామ్రాజ్యమా

జగన్‌ అయిదేళ్ల పాలనలో అరాచక పర్వం రాజ్యమేలింది. అన్యాయంపై ఎవరూ నోరెత్తకూడదు. బాధితులు అదేమని అడగకూడదు. హామీలు అమలు చేయాలంటూ నిరసన ప్రదర్శనలు చేయకూడదు.

Updated : 09 May 2024 09:00 IST

జగన్‌ జమానాలో అరాచక పర్వం
అధికారం మాటున విపక్షాలపై జులుం
ఈనాడు, ఒంగోలు; మార్కాపురం నేర విభాగం, న్యూస్‌టుడే

జగన్‌ అయిదేళ్ల పాలనలో అరాచక పర్వం రాజ్యమేలింది. అన్యాయంపై ఎవరూ నోరెత్తకూడదు. బాధితులు అదేమని అడగకూడదు. హామీలు అమలు చేయాలంటూ నిరసన ప్రదర్శనలు చేయకూడదు. ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల పైనా అదేమని ప్రశ్నించకూడదు. ఎవరైనా నోరు తెరిస్తే కేసులు పెట్టించారు. పోలీసులను ప్రయోగించి కక్ష సాధింపు చర్యలకు దిగారు. తమ అనుచరణ గణాన్ని ఉసిగొల్పి వేధింపులకు గురిచేశారు. అదే సమయంలో నేతలు ఆధిపత్యం.. అజమాయిషీ కోసం నియంతృత్వ పోకడలను అనుసరించారు. అన్ని స్థాయిల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించారు. కొందరు పోలీసులు కూడా వైకాపా తొత్తులుగా మారారు. సిఫార్సులతో పోస్టింగులు తెచ్చుకుని స్వామిభక్తి ప్రదర్శించారు. వారు చేప్పిన ప్రతి పనికీ జీ హుజూర్‌ అంటూ సామాన్యులపై విరుచుపడ్డారు. నాయకుల అడుగులకు మడుగులొత్తడమే తమ కర్తవ్యంగా భావించారు. దీంతో బాధితులు స్టేషన్లకి వెళ్లాలంటేనే బెంబేలెత్తే పరిస్థితులు సృష్టించారు.

మంత్రిని వదిలి చంద్రబాబుపై కేసులు...

త ఏడాది ఏప్రిల్‌లో తెదేపా అధినేత పశ్చిమ ప్రకాశంలో పర్యటించారు. యర్రగొండపాలెంలో ఆయన్ను అడ్డుకునేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో దాదాపు వంద మందికి పైగా వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. వీరిని పోలీసులు కట్టడి చేయలేదు. దీంతో చంద్రబాబుపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఇందులో తీవ్రంగా గాయపడిన తెదేపా కార్యకర్త ఒకరు అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇంత జరిగినా పోలీసులు తిరిగి చంద్రబాబు పైనే రెండు కేసులు నమోదు చేశారు. ఉద్రిక్తతలకు కారణమైన మంత్రి సురేష్‌పై ఈగ కూడా వాలనివ్వలేదు.


నేతలే రౌడీల్లా రెచ్చగొట్టినా...

గతేడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒంగోలులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, ఆయన కుమారుడు పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లి వీరంగం సృష్టించారు. దీంతో ఆయన అనుచరణ గణం రెచ్చిపోయింది. తెదేపా నాయకుడిపై దాడికి తెగబడింది. అయినా విపక్షాల పైనే పోలీసులు కేసులు నమోదు చేశారు.


హామీలడిగితే  నోరు నొక్కుడు...

హామీలు అమలు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2022 ఫిబ్రవరి, 2023 ఫిబ్రవరిలో అంగన్‌వాడీలు చలో కలెక్టరేట్‌ ఆందోళన నిర్వహించాయి. కార్యకర్తలు, సీఐటీయూ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ముందుగానే గృహనిర్బంధం చేశారు. కొందరిని అరెస్టు చేశారు. విజయవాడలో తలపెట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన అనేకమందినీ అడ్డుకున్నారు.


అమరావతి పైనా అక్కసు...

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు చేపట్టిన పాదయాత్ర 2021 నవంబరులో జిల్లాలో సాగింది. అడుగడుగునా పోలీసులు అడ్డుతగిలారు. పాదయాత్రలో పాల్గొనకుండా ప్రజలు, విపక్షాల నేతలను అడ్డుకున్నారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతులపై లాఠీఛార్జి చేశారు. వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే సూచనల మేరకే పోలీసులు జులుం ప్రదర్శించారని వివిధ సంఘాలు, పార్టీలు విమర్శలు గుప్పించాయి.


ప్రశ్నిస్తే.. ప్రాణం తీసుకునేలా చేశారు...

పారిశుద్ధ్య సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు బేస్తవారపేట మండలం సింగరపల్లికి చెందిన జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడును వైకాపా నాయకులు వేధింపులకు గురిచేశారు. ఆయన బలవన్మరణానికి పాల్పడేలా చేశారు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ స్పందించి వైకాపా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.


ప్రత్యేక జిల్లాపై ఉక్కుపాదం...

మార్కాపురాన్ని జిల్లా చేయాలని ప్రతిపక్షాలు ఉద్యమిస్తే.. వైకాపా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నాయకుల్ని అరెస్టులు చేసి నిర్బంధించింది. ప్రస్తుత తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిపై కేసులు నమోదు చేయించింది. దేవాలయం నుంచి సచివాలయం వరకు పేరుతో చేపట్టిన కార్యక్రమాన్నీ పోలీసులతో భగ్నం చేయించింది. కందులను కాలు కదపకుండా చేసింది.


కాలు కదపకుండా కట్టడి...

గతేడాది తెదేపా అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు నంద్యాలలో అరెస్టు చేసి జిల్లా మీదుగా విజయవాడ తరలించారు. ఈ సమయంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తెదేపా శ్రేణులపై పేర్నమిట్ట వద్ద చేసిన లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం జిల్లాలోని ముఖ్య నాయకులందరినీ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 43 మందిపై కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించారు. రోజుల తరబడి ఇళ్ల నుంచి కాలు బయటికి పెట్టనివ్వలేదు.


అయిదేళ్ల వైకాపా పాలనలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థులపై మొత్తం 59 అక్రమ కేసులు బనాయించారు. ఇందులో దామచర్ల జనార్దన్‌(ఒంగోలు)పై 19, కందుల నారాయణరెడ్డ్డి (మార్కాపురం)పై 14, బాలవీరాంజనేయస్వామి(కొండపి)పై 11, బీఎన్‌.విజయ్‌ కుమార్‌(సంతనూతలపాడు)పై 5, గూడూరి ఎరిక్షన్‌బాబు(యర్రగొండపాలెం)పై 5, ఉగ్ర నరసింహారెడ్డి(కనిగిరి)పై 3, ముత్తుముల అశోక్‌రెడ్డి (గిద్దలూరు) 2 ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని