logo

రాళ్లవాగును అటకెక్కించావు.. జగనూ

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్‌లో భాగంగా అర్థవీడు మండలం అంకభూపాలెం సమీపంలో సమారు రూ.22 కోట్ల వ్యయంతో రాళ్లవాగుపై ఆనకట్ట జలాశయం ఏర్పాటు చేశారు.

Published : 10 May 2024 01:37 IST

చిన్న రాయి కూడా వేయించలేక పోయావు
భూగర్భ జలాల పెంపు ఎలా?

అర్థవీడు, న్యూస్‌టుడే: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్‌లో భాగంగా అర్థవీడు మండలం అంకభూపాలెం సమీపంలో సమారు రూ.22 కోట్ల వ్యయంతో రాళ్లవాగుపై ఆనకట్ట జలాశయం ఏర్పాటు చేశారు. వర్షాధారంగా నల్లమల అడవుల్లోని వరదనీటితో ఈ జలాశయాన్ని నింపి..చుట్టూ పరిధి ఆరు గ్రామాల్లో రెండు వేల ఎకరాల సాగుతో పాటు ఈ ప్రాంత భూగర్భజలాల పెంపునకు ఈ ఆనకట్ట ప్రయోజనం కానుంది. అయితే గత ప్రభుత్వంలో రాళ్లవాగు ఆనకట్ట పనులు 20 శాతం చేయగా..తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ అయిదేళ్లలో పనులను అటకెక్కించింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆనకట్ట పనులకు అవసరమైన మట్టి, రాయి, ఇసుక తరలింపు టెండర్లలో గుత్తేదారుకు ధరలు కల్పించకపోవడంతో పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. అప్పటి వరకు చేపట్టిన పనులు సైతం మూడేళ్ల క్రితం రాళ్లవాగుకు వరద రావడంతో ఆనకట్టలో నింపిన ఇసుక, మట్టి కొట్టుకుపోయింది. రాళ్ల కట్టడం సైతం పడిపోయింది. ఈ పనులు సకాలంలో పూర్తి చేసుంటే..పల్లెల్లో భూగర్భ జలాల పెంపునకు దోహదపడేవి.

నిలిచిపోయిన రాళ్లవాగు ఆనకట్ట నిర్మాణం

ఎత్తిపోతల పథకాలు ఎత్తిపోయాయి

వెలుగొండ ప్రాజెక్ట్‌ కాకర్ల ఆనకట్ట జలాశయం నుంచి బొల్లుపల్లి, వెలగలపాయ లోయలకు వెలుగొండ జలాలను తరలించేందుకు సుమారు రూ.51 కోట్ల వ్యయంతో అనుమతులు పొందిన రెండు ఎత్తిపోతల పథకాలు వైకాపా నాయకులకు ఎన్నికల నజరాణాగా మరాయి. అర్థవీడు రెండు లోయలకు ఎలాంటి నీటి వనరులు లేవు.  నల్లమల అడవుల్లో కురిసే వర్షంతో జంపలేరు, పెద్దవాగు వరద నీటితో అయిదు చెరువులు నిండుతాయి. ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకుంటే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుంది. కానీ వైకాపా నాయకులు ఓట్ల కోసం ఈ పథకాన్ని తెరపైకి తెస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.


బోర్లు ఎండిపోతున్నాయి..
- రామయ్య, రైతు, బొల్లుపల్లి.

ఎత్తిపోతల పథకం కానీ..రాళ్లవాగు ప్రాజెక్ట్‌ గానీ సకాలంలో పూర్తి చేసుంటే మా ప్రాంతానికి భూగర్భజలాలు ఎండుముఖం పట్టేవి కాదు. ఆనకట్ట నిర్మాణం చేస్తున్నారంటే ఎంతో సంతోషపడ్డాం. కానీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ పనులను విస్మరించి ఈ అయిదేళ్లలో చిన్న రాయి కూడ అక్కడ వేయలేక పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని