logo

నాడు సిరి.. నేడు ఉరి

వ్యవసాయానికి గుండెకాయలాంటి సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి జగన్‌  అంతులేని నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా జిల్లాలోని పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి. కొత్త ప్రాజెక్టులకు చిల్లిగవ్వ మంజూరు చేయకపోవడం..చెరువులు, కాలువల మరమ్మతులు విస్మరించడంతో అన్నదాత రోడ్డున పడ్డాడు.

Published : 10 May 2024 02:28 IST

చంద్రన్న హయాంలో జల వనరులకు నిధుల వరద
అయిదేళ్లలో చిల్లిగవ్వ ఇవ్వని జగన్‌
కానరాని నీళ్లు.. పొలాలన్నీ బీళ్లు
కర్షకుడి బతుకు కన్నీటిమయం
న్యూస్‌టుడే, ఒంగోలు నగరం, సంతనూతలపాడు, కంభం, పామూరు, మార్కాపురం

వ్యవసాయానికి గుండెకాయలాంటి సాగునీటి రంగంపై ముఖ్యమంత్రి జగన్‌  అంతులేని నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా జిల్లాలోని పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి. కొత్త ప్రాజెక్టులకు చిల్లిగవ్వ మంజూరు చేయకపోవడం..చెరువులు, కాలువల మరమ్మతులు విస్మరించడంతో అన్నదాత రోడ్డున పడ్డాడు. వరితో పాటు వాణిజ్య పంటలైన మిరప, శనగ, పొగాకు సాగుచేసినా నీరందక నిలువునా ఎండిపోవడంతో అతనికి అప్పులే మిగిలాయి. చంద్రబాబు హయాంలో ఏటా వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నవీకరణ, చెరువులు, కాలువల మరమ్మతులు చేపట్టేవారు. దీంతో చివరి ఆయకట్టూ దిగుబడులతో కళకళలాడింది. అయిదేళ్లలో జగన్‌ చేసిన గాయంతో కర్షకుడి బతుకు కన్నీటిమయమైంది.

డిచిన అయిదేళ్లలో సాగునీటి చెరువులు, ఎత్తిపోతల పథకాలను పాలకులు గాలికొదిలేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐడీసీ ద్వారా ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులు విడుదల చేశారు. అయితే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక వాటి జాడలేదు. నాగులుప్పలపాడు మండలంలో కనపర్తి ఎత్తిపోతల పథకం కింద సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఈ ఏడాది గుండ్లకమ్మలో నీరు లేనందున ఈ పథకం మూలన పడింది. రూ.కోటి వ్యయం చేసి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు గేటు పెట్టలేక ఈ ఏడాది రైతుల్ని నిలువునా ముంచారు. మరోవైపు ఒంగోలు, కొన్ని గ్రామాలకు రావాల్సిన తాగునీరు నిలిచిపోయింది.

ఎత్తిపోతల పథకాలు పడక

గుండ్లకమ్మ జలాశయంపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు పనిచేయక రైతులు కొద్దిపాటి మెట్ట పంటలకే పరిమితమయ్యారు. సాగునీటి చెరువులను విస్మరించారు. వేసవి కాలంలో చెరువుల్లో పూడికతీసి కట్టలు పటిష్ఠ పరిస్తే వర్షాకాలంలో సామర్థ్యం మేరకు నీరు నిండుతాయి. భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో కట్టలు గండ్లు పడకుండా పటిష్టపరిచే పనులు చేపట్టాలి. ఎక్కడా వాటి ఊసేలేదు. చీమకుర్తి మండలం కేవీపాలెం, మువ్వావారిపాలెం, గోనుగుంట చెరువుల కింద ఆయకట్టు ఉంది. ఆయా చెరువులు అభివృద్ధి చేస్తే రైతులు నమ్మకంగా మాగాణి సాగు చేసుకుంటారు. చెరువుల్లో పూడిక వల్ల నీరు సరిపోక పంట మధ్యలో ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఆసియాలోనే ఘనత..  నిధులివ్వక కలత

ఆసియా ఖండంలోనే రెండో పెద్దదైన చారిత్రక కంభం చెరువు వైకాపా పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. సుమారు 3 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న తటాకం. అధికారికంగా 7 వేల ఎకరాలు, అనధికారికంగా మరో 5 ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తోంది. అయితే వైకాపా అధికారం చేపట్టాక కనీస మరమ్మతులు చేయించేందుకు ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదు. చెరువుకు ఉన్న మూడు ప్రధాన తూముల నుంచి నిత్యం నీరు వృథాగా పోతోంది. రోజూ సుమారు 25 క్యూసెక్కుల మేర జలం వృథా అవుతున్నా బాగు చేయించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

పెద్ద కంభం తూము నుంచి వృథాగా పోతున్న జలం

రైతులే డబ్బులు సమీకరించి..  

నాలుగేళ్లుగా కంభం చెరువులో నీరుంది. అయితే కాలువల బాగుకు  ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది పంటల సాగుకు నీరు విడుదల చేసిన తర్వాత కాలువల్లో నాచు, గడ్డి, గుర్రపుడెక్క పేరుకుపోయింది. సంబంధిత అధికారుల వద్ద నిధులు లేకపోవడంతో ఆయకట్టు రైతులే డబ్బులు వసూలు చేసుకొని కాలువలను బాగు చేయించుకున్నారు. తటాకంలో నీరుంటే మూడు మండలాల్లోని 25 గ్రామాలకు సాగు, మరో 30 గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. ప్రస్తుతం చెరువులో 4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. లీకేజీలతో రోజురోజుకు తగ్గిపోతోంది. ఇంతటి చారిత్రక చెరువును అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయకపోవడంపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు, తూముల లీకేజీ, కాలువలు మరమ్మతులు తదితర వాటిని బాగు చేసేందుకు రూ. 22 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు నీటి పారుదల శాఖ జేఈ వెంకటేశ్వర్లు తెలిపారు. కానీ నిధులు మంజూరు కాలేదని చెప్పారు.


ఇరు జిల్లాల కల్పతరువుపైనా అదే నిర్లక్ష్యం

మోపాడు జలాశయం (పాత చిత్రం)

కనిగిరి అంతా వర్షాభావ ప్రాంతం. గత కొన్నేళ్లుగా వరుణుడు ముఖం చాటేయడంతో నేల తల్లిని..ఉన్న ఊరిని వదిలి బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస బాట పడుతున్నారు. దీనికితోడు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ప్రాజెక్టులన్నవి ఊహకందని విషయం. కనీసం బ్రిటిష్‌ వారి కాలంలోని వాటిని పరిరక్షించడంలోనూ విఫలమయ్యారు. పామూరు మండలంలోని మోపాడు జలాశయం పరిస్థితీ ఇదే. దీని నీటి నిల్వ సామర్థ్యం 2.09 టీఎంసీలు. అధికారికంగా 15 వేల ఎకరాలు, అనధికారికంగా మరో అయిదువేల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ జలాశయం కట్ట బలహీనంగా మారింది. అలుగు, తూములకు మరమ్మతులు చేసింది లేదు. ప్రస్తుతం జలాశయంలో 7 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.

కట్ట దెబ్బతింటే ఇసుక బస్తాలతో సరి

మోపాడు రిజర్వాయర్‌ నుంచి నెల్లూరు జిల్లాలోని కొండాపురం మండలం, తదితర ప్రాంతాలకు కూడా సాగు నీరందుతుంది. 2021 డిసెంబరులో కురిసిన భారీ వర్షాలకు పూర్తిస్థాయిలో జలాశయం నిండిపోయి కట్టకు లీకులు ఏర్పడి దెబ్బతింది. దీంతో  జలాశయంలోని నీరు కొద్దిమేర బయటకు పోయింది. అంత కీలకమైన ప్రాజెక్టు కట్ట వద్ద  అప్పట్లో ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకున్నారు. జలాశయంలో నీటి పరిమాణం పెరిగితే మోపాడు, ఇనిమెర్ల, నుచ్చుపొద, బొట్లగూడూరు., లక్ష్మీనరసాపురం, కంబాలదిన్నె తదితర గ్రామాల్లోని నీళ్లు చేరతాయి. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించే ప్రమాదముంది.

జలాశయం కట్ట లీకేజీల వద్ద వేసిన ఇసుక బస్తాలు (పాత చిత్రం)

రూ.3.5 కోట్ల ప్రతిపాదనలేమయ్యాయి ?

జలాశయం కట్ట, అలుగు బలోపేతం, నిర్వహణకు రూ.3.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా, ఇప్పటికీ వైకాపా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. కట్ట లోపలి భాగంలో చిల్లచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. కట్ట పైనా దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. కట్ట, తూములు, అలుగు నిర్వహణను యంత్రాంగం పూర్తిగా వదిలేసింది.

అప్పట్లో మహా ఉపద్రవంతో..

26 ఏళ్ల క్రితం మోపాడు జలాశయం కట్ట తెగిపోయి నీళ్లు దిగువ గ్రామాలను ముంచెత్తాయి. అదీ రాత్రి సమయం కావడంతో దాదాపు వందమంది ప్రాణాలు నిద్రలోనే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. 2021లో కట్టకు లీకేజీలు వచ్చిన వేళ.. తెగిపోతుందని చుట్టుపక్కల గ్రామాల వారు వారంరోజుల పాటు నిద్రాహారాలు మాని బిక్కుబిక్కుమంటూ గడిపారు. 2.09 నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయం మరమ్మతులకు ముఖ్యమంత్రి జగన్‌ నిధులు మంజూరు చేయకపోవడంపై కర్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


800 చెరువులు.. కుంటలు ఖాళీ

పిచ్చిమొక్కలతో నిండిన మార్కాపురం చెరువు

మార్కాపురంలో తాగునీటికి ఎంతో కీలకమైన పెద్ద చెరువును సైతం అభివృద్ధి చేయలేదు. మార్కాపురం సప్లయి ఛానల్‌ నవీకరణ, కాలువ విస్తరణ కోసం రూ.18 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా మంజూరు కాలేదు.

తెదేపా హయాంలో నీరు-మీరుతో మహర్దశ

తిప్పాయపాలెంలోని జలాశయం తెల్లదొరల కాలం నాటిది. దీనికింద తిప్పాయపాలెం, బిరుదులనరవ, చింతకుంట, బడేఖాన్‌పేట, ఎల్‌బీఎల్‌నగర్‌, అయ్యవారిపల్లె, కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామాల్లోని సుమారు 1500 మంది రైతులు సాగు చేసే అవకాశముంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నీరు- చెట్టు కింద పనులు చేపట్టారు. అయితే వైకాపా పాలనలో చిల్లచెట్లతో అడవిని తలపిస్తోంది. వేములకోట చెరువును తాగునీటి చెరువుగా మార్చాలని అనుకున్నా లక్ష్యం నెరవేరలేదు. దీని ఆయకట్టు కింద 1800 ఎకరాలున్నా ఒక్క ఎకరం కూడా సాగు కాలేదు. లీకేజీలతో నీరంతా వృథాగా పోతోంది. భూపతిపల్లె, పెద్దనాగులవరం ఆయకట్టు చెరువుల కింద గత ప్రభుత్వ హయాంలో రైతులు పంటలు సాగు చేశారు. వైకాపా పాలనలో ఇవన్నీ ఛిద్రమయ్యాయి.

చిట్టడవిని తలపిస్తున్న తిప్పాయపాలెం చెరువు

మార్కాపురం డివిజన్‌లో: మార్కాపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో చిన్న, పెద్ద చెరువులు, కుంటలు దాదాపు 800 వరకు ఉన్నాయి. ఈ చెరువుల్లో గత ప్రభుత్వ హయాంలోనే నీరు- చెట్టు కింద అభివృద్ధి చేయడంతో అక్కడ పుష్కలంగా నీరు నిల్వ ఉండి రైతన్నలకు మేలు జరిగింది. వీటికి నేడు నిధులివ్వకపోవడంతో  జలవనరులశాఖ అధికారులు, ఇంజినీర్లు ఖాళీగా కార్యాలయాల్లో కాలక్షేపం చేసే దుస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని