logo

గురువుల ముఖాలు గుర్తుంచలే..!

విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొస్తున్న యాప్‌లపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా మంగళవారం నుంచి తెరపైకి వచ్చిన ముఖ హాజరు యాప్‌తోనూ అవస్థలు తప్పలేదు

Published : 17 Aug 2022 06:35 IST

నరసన్నపేట: సత్యవరం ఉన్నత పాఠశాలలో బయటకొచ్చి ఉపాధ్యాయుల పాట్లు..

విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొస్తున్న యాప్‌లపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా మంగళవారం నుంచి తెరపైకి వచ్చిన ముఖ హాజరు యాప్‌తోనూ అవస్థలు తప్పలేదు. పాఠశాల ప్రాంగణంలో తమ చరవాణిలోని యాప్‌లో ఉదయం 9 గంటలకు హాజరు నమోదు చేసేందుకు వారు పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. నిర్ణీత సమయానికి చాలామంది హాజరు నమోదు చేసుకోలేకపోయారు. నిత్యం పాఠశాల సమయంలో యాప్‌లతో కుస్తీ పట్టడమే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఉపాధ్యాయ హాజరు నమోదులో జిల్లా తొలిరోజు రాష్ట్రంలో 23వ స్థానంలో నిలిచింది. సాంకేతిక సమస్యల కారణంగా ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో యాప్‌లో ఉపాధ్యాయుల వివరాలను కూడా నమోదు చేసేందుకు కుదరలేదు. మంగళవారం పాఠశాలలకు వెళ్లేసరికి వివరాలు నమోదు చేసేందుకు యాప్‌ సహకరించలేదు. ఈ క్రమంలో కేవలం 40.32 శాతం మాత్రమే తొలిరోజు వివరాలు నమోదు చేసుకోగలిగారు. వారిలోనూ కొందరే హాజరు వేశారు. ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయడానికి ప్రధానోపాధ్యాయులు నానా తంటాలు పడ్డారు. యాప్‌ డౌన్‌లోడ్‌ అయిన తర్వాత ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయగా కొంత పూర్తయిన తరువాత యాప్‌ క్లోజ్‌ అయిపోతోందని చెబుతున్నారు. అప్పుడు మళ్లీ మొదటికి రావడంతో చాలా సమయం వృథా అవుతోందని పేర్కొంటున్నారు.

నెట్‌వర్క్‌ లేక ఇబ్బందులు... ముఖహాజరు నమోదుకు నెట్వర్క్‌ లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరు సొంత చరవాణిలో నమోదు చేయాలనడం సరికాదు. ఒక్క నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణించడం, జీతంతో ముడిపెట్టడం సమంజసం కాదు. ప్రభుత్వం ఇందుకు తగిన నెట్‌వర్క్‌ పరికరాలను ఏర్పాటు చేయాలి. ఆ తరువాతే నిబంధనలు అమలు చేయాలి.  
- చౌదరి రవీంద్ర, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

రద్దు చేయాలి... విద్యార్థులకు పాఠాలు చెప్పలేకపోతున్నాం. ఒక పూటంతా యాప్‌లతోనే సరిపోతోంది. అన్ని రకాల యాప్‌లను రద్దు చేయాలి. ముఖ హాజరును సొంత మొబైల్‌ ద్వారా వేయాలనడం సరికాదు. ఉపాధ్యాయుల హాజరు ఆన్‌లైన్‌ ద్వారా తప్పనిసరి అయితే కచ్చితంగా ప్రభుత్వమే అందుకు తగిన పరికరాలు అందజేసి సమస్య లేకుండా చూడాలి.
- మజ్జి మదన్‌మోహన్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని