logo

అక్కుపల్లిలో ఎలుగు దాడి!

వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లికి చెందిన జీడి రైతు సూరాడ లోకనాథంపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.

Published : 06 Jun 2023 04:46 IST

తీవ్రంగా గాయపడిన జీడి రైతు

పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లో కనాథం

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లికి చెందిన జీడి రైతు సూరాడ లోకనాథంపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... లోకనాథం సోమవారం ఉదయం జీడి పిక్కలు ఏరేందుకు తోటకు వెళ్లారు. పిక్కలు సేకరించి తిరిగి వస్తుండగా పిల్లతో ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా అతని మీద పడింది. తప్పించుకునేలోపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వెంటనే బాధితుడు కేకలు వేయడం, అక్కడ ఉన్న కుక్కలు మొరగడంతో సమీప తోటల్లో ఉన్న రైతులు వచ్చారు. అప్పటికే ఎలుగుబంటి పిల్లతో పాటు వెళ్లిపోయింది. క్షతగాత్రుడిని హుటాహుటిన పలాస సామాజిక ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సెక్షన్‌  అధికారి బీవీబీ రెడ్డి, సిబ్బంది ఘటనా  స్థలానికి వెళ్లి పరిశీలించి, బాధితుడి, కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వైద్యఖర్చులతో పాటు ఆర్థిక సాయం అందించి  బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఉద్దానాన్ని వీడని భయం..

ఉద్దానం వాసులకు ఎలుగుబంట్ల బెడద తప్పడం లేదు. ఈ ప్రాంతంలో గతేడాది ఇదే నెల 19, 20వ తేదీల్లో కిడిసింగి, వజ్రపుకొత్తూరు తోటల్లో జరిగిన ఎలుగు దాడి ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ ఆ ఘటనలు తలచుకుంటునే స్థానికులు భయపడిపోతున్నారు. అప్పట్లో ప్రత్యేక బృందాలు వచ్చి ఎలుగును బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ సోమవారం జరిగిన దాడితో ఉద్దానంలో ఎలుగుబంట్ల కలకలం మొదలైంది. తోటలకు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. జిల్లా  అటవీ శాఖాధికారులు స్పందించి          నివారణకు చర్యలు తీసుకోవాలని ఉద్దానం ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని