logo

గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే

ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి.

Updated : 26 Apr 2024 04:49 IST

పలాస, ఇచ్ఛాపురంలో దాహం కేకలు
పాలకులకు చెప్పినా విస్మరించారని బాధితుల ఆవేదన
న్యూస్‌టుడే, పలాస, ఇచ్ఛాపురం

ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం ఇంటింటికీ నీరందించడంలో విఫలం కావడంతో కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు.

లాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని, పురపాలక కార్యాలయం పక్కన ఉన్న రెండు హరిజన వీధుల ప్రజలు నీటి కోసం కటకటలాడుతున్నారు. రెండు రోజులకొకసారి 8 లేదా 10 ఇళ్లు ఒక బృందంగా ఏర్పడి రూ.800 చెల్లించి ట్యాంకరు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. ప్రతి ఇంటి ముందు డ్రమ్ములు ఏర్పాటు చేసుకుని నీరు నిల్వ చేసుకునే దుస్థితి వారికి ఏర్పడింది. వీధుల్లో ఇంటింటికీ వేసిన కుళాయిల నుంచి అప్పుడప్పుడు నీరు రావడంతోదిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయని నివాసితులు వాపోతున్నారు.

తాగేందుకు ఇబ్బంది

ఇచ్ఛాపురం పురపాలకసంఘంలో తాగునీరు ప్రధాన సమస్యగా మారింది. పురపాలకసంఘం సరఫరా చేసే నీరు.. నాణ్యతాప్రమాణాలకు విరుద్ధంగా ఉండడంతో చాలామంది తాగేందుకు ఇబ్బంది పడుతున్నారు. దీంతో స్థానికులు బయట నీరు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న పలువురు పుర పరిధిలోనే 8 నీటి విక్రయ కేంద్రాలు పెట్టి, వ్యాపారం చేస్తున్నారు. నీటి డబ్బాకు రూ.25 నుంచి రూ.35వరకూ వసూలు చేస్తున్నారు. కుళాయిల ద్వారా నీరందిస్తే తామేందుకు బయట సొమ్ము చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


రెండురోజులకొకసారి

- నందిక తులసి, పురుషోత్తపురం, ఇచ్ఛాపురం పురపాలకసంఘం

మా ప్రాంతానికి కులాయినీరు రావడం లేదు. ట్యాంకరు ద్వారా రెండు రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారు. అది దుర్వాసన వస్తోంది. దాంతో ఏఎస్‌పేట నుంచి నీరు కొనుగోలు చేసుకుంటున్నాం.


ఉపయోగం లేదు

-శాంతమ్మ, పలాస

మా ఇంట్లో అయిదుగురు ఉంటాం. కుళాయి కనెక్షన్‌ ఉంది. నీరు సక్రమంగా రాకపోవటంతో ఇబ్బంది పడుతున్నాం. రూ.800 ఇచ్చి ట్యాంకరు తెప్పించుకుని వాడుకుంటున్నాం. పురపాలిక ట్యాంకర్‌ పంపిస్తే మాకు డబ్బులు మిగిలేవి.  


చేతులు దులుపుకొన్నారు

-చల్లా అప్పలస్వామి, పలాస

మా వీధిలో నీటిఎద్దడి ప్రతీ ఏటా ఉంటుంది. అధికారులు బోర్లు తక్కువ లోతులో వేసి, చేతులు దులుపుకోవడంతో నీరు రావడం లేదు. పాలకులకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని