logo

పాలకుల పక్షపాతం.. మారని పల్లెచిత్రం..!

జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మట్టి రహదారులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తెదేపా హయాంలో బీటీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది.

Published : 30 Apr 2024 05:40 IST

తెదేపా హయాంలో పనులు చేపట్టిన రోడ్లను పట్టించుకోని సర్కారు
రూ.296.19 కోట్ల నిధులు గాలికొదిలేసిన వైనం
న్యూస్‌టుడే, లావేరు, రణస్థలం గ్రామీణం, జి.సిగడాం, ఎచ్చెర్ల

జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మట్టి రహదారులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తెదేపా హయాంలో బీటీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. 250 జనాభాకు పైబడిన 362 గ్రామాలకు ప్రయోజనం చేకూరేలా ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) నుంచి నిధులు మంజూరయ్యాయి. రెండు దశల్లో నాలుగు ప్యాకేజీలుగా 395 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రావెల్‌ రహదారులను బీటీ, సీసీ రోడ్లుగా మార్చేందుకు పంచాయతీరాజ్‌శాఖ విభాగం (పీఐయూ) ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. మొదట దశ ‘ఏ’ ప్యాకేజీలో భాగంగా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో అప్పట్లో టెండర్లు పిలిచారు. వీటిలో కొన్ని పనులు ప్రారంభించగా వివిధ దశల్లో ఉన్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మిగిలిన 296.19 కోట్ల నిధులు వృథాగా మారాయి.

చిన్నపాటి వర్షం కురిసినా తాళ్లవలస కూడలి నుంచి నాగంపాలెం, గుమ్మడాం వెళ్లే రోడ్డు దుస్థితి

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..

మట్టి రహదారులు ఉన్న గ్రామాలకు తారు రోడ్లు మంజూరు కావడంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఎంతో సంతోష పడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది. గడిచిన నాలుగేళ్లలో కనీసం ఒక్క రహదారి నిర్మాణం సైతం చేపట్టలేదు. ప్రస్తుతం ఉన్న రహదారులపై అత్యవసర సమయంలో కనీసం 108 వాహనం కూడా రాని పరిస్థితి. తెదేపా హయాంలో ప్రారంభించిన రహదారులు పూర్తి చేస్తే ఆ ప్రభుత్వానికి పేరు వస్తుందని వైకాపా నాయకులు పనులు చేయకుండా నిలుపుదల చేశారని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని తీసుకుంటే నాలుగు మండలాల పరిధిలో 38 రహదారుల్లో ఇప్పటి వరకు 16 రోడ్లకు సంబంధించి పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం ఈ పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ ఈ నెల 24తో ముగిస్తుంది. దీంతో పనులు రద్దవడం ఖాయమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కంకర తేలి అధ్వానంగా మారిన తామాడ నుంచి కొత్తరౌతుపేట, సూర్యనారాయణపురం వెళ్లే మార్గం

ఇదీ పరిస్థితి

జాతీయ రహదారి తాళ్లవలస నుంచి వేణుగోపాలపురం, పిట్టపాలెం, నాగంపాలెం, గుమ్మడాం జడ్పీ రహదారి వరకు 6.4 కి.మీ. బీటీ రహదారి నిర్మాణానికి రూ.3.53 కోట్లు నిధులు 2018లో మంజూరయ్యాయి. ఈ రహదారికి సంబంధించి 2019 జనవరిలో హైదరాబాద్‌కు చెందిన యారో సంస్థ సుమారు రూ.20 లక్షలతో పనులు ప్రారంభించింది. రహదారికి ఇరువైపులా పనికిరాని మొక్కలు తొలగించి కల్వర్టుల నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు గాలికొదిలేసింది. ఇప్పటి వరకు రహదారిపై కనీసం తట్టెడు మట్టి సైతం వేయలేదు. రహదారి నిర్మాణం చేపడితే సుమారు 20 గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లేందుకు అనువుగా ఉంటుంది.

సూర్యనారాయణపురం సమీపంలో కొట్టుకుపోయిన రోడ్డు

  • లావేరు మండలం తామాడ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కొత్తరౌతుపేట, నడుపూరిపేట, సూర్యనారాయణపురం గ్రామాల వరకు 3.7 కి.మీ. బీటీ రహదారి నిర్మాణానికి రూ.1.6 కోట్లు నిధులు మంజూరయ్యాయి. తెదేపా హయాంలో కంకర, మట్టి వేసి రహదారి నిర్మాణం 70 శాతం పూర్తి చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక వీటిని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు.
  • కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి రహదారి నుంచి టెక్కలి, సారవకోట మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిని తారురోడ్డుగా మార్చేందుకు రూ.69.23 లక్షలతో 2019లో పనులు ప్రారంభించారు. దీని పరిస్థితి సైతం అలాగే మారింది. ఈ రహదారి పూర్తయితే మూడు మండలాలకు చెందిన ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.

నరకయాతన పడుతున్నాం
- నడిమింటి చార్లెస్‌, అదపాక

రహదారులు అధ్వానంగా మారడవంతో అత్యవసర సమయంలో మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నాం. తరచూ ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాలు పాడవుతుండటంతో వాటిని బాగు చేసుకోవడానికే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. పలుమార్లు సమస్యను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు.  


ఒక్క రహదారి పూర్తి చేయలేదు
- గొర్లె శ్రీనువాసరావు, మాజీ సర్పంచి, తామాడ పంచాయతీ

తెదేపా హయాంలో మంజూరైన రోడ్డు పనులను వైకాపా ప్రభుత్వం నిలిపివేయడం సరికాదు. చిన్నపాటి వర్షం కురిసినా మట్టి రహదారులు బురదమయంగా మారడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక లావేరు మండలంలో ఐదేళ్లలో ఒక్క రహదారి సైతం పూర్తి చేయలేదు. మా గ్రామానికి బీటీ రహదారి మంజూరైందని సంతోషించాం. చివరికి అరకొరగా పనులు చేపట్టి వదిలేశారు.  


  • నిధుల మంజూరు: ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు(ఏఐఐబీ) నుంచి
  • జిల్లా వ్యాప్తంగా మంజూరైనవి :  312 రహదారులు
  • పనులు ప్రారంభం :   జనవరి 2019లో
  • నిధులు :   రూ.362.78 కోట్లు
  • ఖర్చు చేసినది : రూ.66.59 కోట్లు
  • పొడవు : 484.43 కి.మీ.
  • చేపట్టిన పనులు :  102.71 కి.మీ.
  • ఇప్పటి వరకు ప్రారంభించిన రోడ్లు : 266
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని