logo

నిబంధనలు అతిక్రమిస్తే కొరడా..!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను అతిక్రమించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తనిఖీలను ముమ్మరం చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు.

Updated : 01 May 2024 06:54 IST

ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు

శ్రీకాకుళంలో తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదును లెక్కిస్తున్న అధికారులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలను అతిక్రమించిన వారిపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తనిఖీలను ముమ్మరం చేసి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.3.5 కోట్ల విలువైన  బంగారం, మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు. 459 మందిపై కేసులు నమోదు చేశారు.

మూడు కిలోల బంగారం స్వాధీనం

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.1.36 కోట్ల విలువైన దాదాపు మూడు కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం విశాఖ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.29.5 లక్షల నగదు పట్టుకున్నారు.

7,812 మంది వాలంటీర్లు రాజీనామా

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు 93 చోటు చేసుకోగా 34 కేసులు నమోదు చేశారు. 67 మంది ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయగా 39 మందిని సర్వీసు నుంచి తొలగించారు. 17 మందిపై ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది. 7,812 మంది గ్రామ, వార్డు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 26 మంది రాజకీయ నాయకులపై 17 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీరిలో అధికార పార్టీ వైకాపాకు చెందిన 10 మంది, తెదేపా నాయకులు ఏడుగురు ఉన్నారు.

459 మంది అరెస్టు

నగదు, మద్యం, గంజాయి, వంటి అక్రమ రవాణా కేసులో ఇప్పటివరకు 459 మందిని అరెస్టు చేయగా 716 కేసులు నమోదు చేశారు. 36 ద్విచక్ర వాహనాలు, 13 కార్లు, ఒక వ్యాను, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని కారణంగా 13 చరవాణులు, 10 చేతి గడియారాలు, 14 చీరలు, 10వేల టీషర్టులు, 2,500 కరపత్రాలను సీజ్‌ చేశారు.

అధికారులు సీజ్‌ చేసిన వాటి వివరాలు ఇలా...

  • నగదు: రూ.1,30,18,920
  • బంగారం: 2,901 గ్రాములు (విలువ: రూ.1,36,80,284)
  • వెండి: 26,581 గ్రాములు (విలువ: రూ.14,41,669)
  • మద్యం విలువ: రూ.74 లక్షలు
  • గంజాయి: 124.05 కిలోలు (విలువ: రూ.5.36 లక్షలు)
  • బెల్లం ఊటలు ధ్వంసం: 77 వేల లీటర్లు

నిఘా పటిష్ఠం చేస్తాం

ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా నిఘా మరింత పటిష్ఠం చేస్తాం. 8 నియోజకవర్గాల్లో 24 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పనిచేస్తున్నారు. వీరితో పాటు సరిహద్దులో నిఘా బృందాలు పనిచేస్తున్నాయి. 

రాఘవేంద్ర మీనా, సహాయ కలెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని