logo

పండుటాకుల ప్రాణాలతో జగన్నాటకం..!

ప్రభుత్వం ఆడిన జగన్నాటానికి పండుటాకులు నరకం చూస్తున్నారు. పింఛను డబ్బులు చేతికి అందించే అవకాశమున్నా పట్టించుకోకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. జిల్లాలో శుక్రవారం సైతం మండుటెండలో బ్యాంకుల వద్ద వృద్ధులు పడిగాపులు కాశారు.

Published : 04 May 2024 06:00 IST

పొందూరులో పై అంతస్తులో ఉన్న బ్యాంకుకు వెళ్లేందుకు వృద్ధురాలి అవస్థలు

ప్రభుత్వం ఆడిన జగన్నాటానికి పండుటాకులు నరకం చూస్తున్నారు. పింఛను డబ్బులు చేతికి అందించే అవకాశమున్నా పట్టించుకోకుండా వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. జిల్లాలో శుక్రవారం సైతం మండుటెండలో బ్యాంకుల వద్ద వృద్ధులు పడిగాపులు కాశారు. గొంతు తడారిపోతున్నా తాగునీరందించే దారి లేక వారంతా విలవిలలాడిపోయారు. కూర్చునేందుకు కుర్చీలేక.. గంటల తరబడి నిల్చోలేక  నరకయాతన అనుభవించారు. పింఛనుదారుల ప్రాణాలతో ఆటలాడి.. వారిని అష్టకష్టాలు పెట్టి వికృత ఆనందం పొందారు.

న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌, గార, సోంపేట, టెక్కలి పట్టణం, పొందూరు: జిల్లాలో 3,20,913 మందికి మే నెల పింఛను అందించాల్సి ఉంది. వారిలో 2,42,984 మందికి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని, 77,929 మందికి ఇంటి వద్దే నగదు అందిస్తారని చెప్పారు. బ్యాంకుల ద్వారా ఇస్తామన్న లబ్ధిదారులను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఎంపిక చేసిందో అర్థం కావట్లేదు. ఎవరి ఖాతాల్లో డబ్బులు పడ్డాయి.. ఎంత మంది పింఛను సొమ్ము అందుకున్నారనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. అధికారులు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దివ్యాంగులు, మంచం పట్టినవారు, తదితర ఆరేడు రకాల లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛను ఇస్తామని చెప్పినప్పటికీ చాలా మందికి ఇవ్వలేకపోయారు. దీంతో గత్యంతరం లేక వయోవృద్ధులు, మంచానికే పరిమితమైనవారు సైతం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

మంచం పట్టినా కనికరం లేకుండా...

ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు పి.పార్వతి. సోంపేటకు చెందిన ఈమెది నడవలేని  స్థితి. ఇద్దరి సాయంతో పింఛను కోసం బ్యాంకుకు వచ్చారు. మంచం పట్టిన ఈమెకు ఇంటి వద్దే ఇవ్వాల్సి ఉన్నా బ్యాంకుల చుట్టూ తిప్పించి.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని కుటుంబ సభ్యులు వాపోయారు.

నడుము వంగి.. నానా కష్టాలు పడుతూ..

శాలిహుండం గ్రామానికి చెందిన చింతల శెంచమ్మ ఉదయం 8 గంటలకే గార మండల కేంద్రంలోని బ్యాంకు వద్దకు వచ్చారు. నడుము సహకరించకపోయినా చేతికర్ర ఊతంగా మెల్లగా నడుచుకుంటూ వచ్చి పింఛను సొమ్ము తీసుకుని వెళ్లారు. ఇంటి వద్దే ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

క్యూలైన్‌లో నిలబడలేక..

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న గార మండలం అగ్రహారం గ్రామానికి చెందిన అమ్మన్నమ్మ పింఛను కోసం అరసవల్లిలోని బ్యాంకుకు వచ్చారు. అతి కష్టం మీద పై అంతస్తులో ఉన్న బ్యాంకు వద్దకు చేరుకుని క్యూలైన్‌లో నిలబడలేక ఇలా కూర్చుండిపోయారు.

ఇది మంచి పద్ధతి కాదు..

మా అమ్మ వీరమ్మకు 70 ఏళ్లు పైబడ్డాయి. పింఛను కోసం గత నెల ఆమెను సచివాలయానికి తీసుకువెళ్లేందుకే ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈసారి బ్యాంకుకు రమ్మన్నారు. ఉదయం 8 గంటలకు వచ్చాం. ఇద్దరికీ ఆటో ఛార్జీ కింద ఒక వైపు రూ.120 ఖర్చయింది. రాజకీయాల కోసం ఇలా చేస్తారా? ఇది మంచి పద్ధతి కాదు.

కశింకోట పారమ్మ, దీపావళిపేట, టెక్కలి మండలం

వేరొక చోటుకు వెళ్లమంటున్నారు..

సచివాలయ సిబ్బందిని అడిగితే అరసవల్లిలోని ఏపీజీవీ బ్యాంకుకు వెళ్లమని చెప్పారు. అందుకని ఉదయం 10 గంటలకే ఆటోలో ఇక్కడికి వచ్చాను. ఖాతాను పరిశీలించిన బ్యాంకు అధికారులు పింఛను డబ్బులు పడలేదని చెప్పారు. వేరే బ్యాంకు ఖాతా ఉంటే అక్కడికి వెళ్లాలని చెబుతున్నారు. ఆ బ్యాంకులోనైనా డబ్బులు పడ్డాయో.. లేదో తెలియట్లేదు.

తోటాడ తవిటయ్య, రెడ్డిపేట

పడుతున్న కష్టాల్లో కొన్ని..

  • ఆధార్‌ అనుసంధానం కాని లబ్ధిదారులను ఆ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత రావాల్సిన బ్యాంకు సిబ్బంది సూచిస్తున్నారు. దీనికి సుమారు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
  • కొందరి పేరున ఒకటికి మించి ఖాతాలు ఉన్నాయి. ఏ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో తెలుసుకోవడానికి తంటాలు పడుతున్నారు.
  • కొంతకాలంగా లావాదేవీలు జరగని ఖాతాల పునరుద్ధరణకు ఆధార్‌ కార్డు, ఫొటోలు అడుగుతున్నారు. వాటి కోసం పదేపదే తిరగాల్సి వస్తోంది.
  • ఖాతాల నిర్వహణ రుసుం పేరిట కొంత నగదు మినహాయించుకుని మిగిలిన డబ్బులు చేతికిస్తుండటంతో వృద్ధులు ఆవేదన చెందుతున్నారు.
  • కొన్ని బ్యాంకుల వద్ద డబ్బులు లేవని చెప్పి రేపు రావాలని వెనక్కి పంపిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని