logo

జగన్మాయ..!

ఉద్దానం పేరు వినగానే కిడ్నీ వ్యాధితో అతలాకుతలమైన కుటుంబాలు గుర్తుకొస్తాయి. కాశీబుగ్గ వద్ద తెదేపా హయాంలో శంకుస్థాపన చేసిన భవన నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం పూర్తి చేసినా తగిన వసతులు కల్పించలేదు.

Updated : 07 May 2024 05:31 IST

డయాలసిస్‌కే పరిమితమైన కిడ్నీ పరిశోధన కేంద్రం
సూపర్‌ స్పెషాలిటీ వైద్యులే లేని 200 పడకల ఆసుపత్రి
ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

‘వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు కిడ్నీ మార్పిడికి అవసరమైన యంత్రాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాం.. బాధితులు చికిత్స కోసం విశాఖ, ఇతర నగరాలకు వెళ్లకుండా అత్యాధునిక వసతులతో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం.’

- గతేడాది డిసెంబరు 15న పలాసలోని కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు

జగన్‌ మాటలు నమ్మిన ఆ ప్రాంత వాసులు సంబరపడ్డారు. ఆసుపత్రికి వెళ్లేందుకు అప్పు చేయాల్సిన అవసరం ఉండదని భావించారు. ఏళ్ల నుంచి అనుభవిస్తున్న కష్టాలు తీరుతాయని అనుకున్నారు. వ్యాధి నయమవుతుందనే ఆశతో దూర ప్రాంతాల నుంచి రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. అవసరం మేరకు చికిత్స అందడం లేదని తెలుసుకుని ఉసూరుమంటూ వెనక్కి వెళ్తున్నారు. పూర్తిస్థాయిలో వసతుల కల్పన జరపకుండా మయసభ మాదిరిగా పరిశోధన కేంద్రాన్ని నిర్మించి జగన్‌ మాయ చేశారని ధ్వజమెత్తుతున్నారు.


పోస్టులు భర్తీ చేయరు...వైద్యం అందించరు: కిడ్నీ పరిశోధన 200 పడకల ఆసుపత్రి, డయాలసిస్‌ కేంద్రం ప్రారంభించి ఐదు నెలలు గడిచినా ఇప్పటికీ సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల నియామకం చేపట్టలేదు. సాధారణ వైద్యులే సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం 128 మంది వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. 206 పోస్టులకు 78 పోస్టులు భర్తీ చేయాలి. ఆయా నియామకాలు పూర్తయితేనే పరిస్థితి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.


విశాఖ నగరం మద్దిలపాలెం ప్రాంతంలో నివసించే రాజేశ్వరికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. సహాయకులు లేకుండా నడవలేని స్థితి ఆమెది. పలాసలో కిడ్నీ పరిశోధన ఆసుపత్రి ప్రారంభించారని తెలిసి ఈ నెల 18న కుమార్తె సాయంతో వచ్చారు. వారిని గమనించిన వైద్యులు ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు. ఆసుపత్రిలో తగిన పరికరాలు లేవు. ఇక్కడ కంటే విశాఖే ఉత్తమం’ అని చెప్పడంతో వారు తల పట్టుకున్నారు ఏం చేయాలో తెలియక విశాఖకు బయలుదేరారు. ఇలా రోజూ పదుల సంఖ్యలో ఆసుపత్రి గడప తొక్కుతున్న బాధితులకు ఇక్కడ ఎలాంటి సదుపాయాలు, అవసరమైన చికిత్స అందడం లేదనే మాటలు చెవిన పడేసరికి వారి ఆశలు ఆవిరైపోతున్నాయి..


పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధి నెమలినారాయణపురానికి చెందిన బి.బుడ్డు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనను భార్య కిడ్నీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యుల్ని సంప్రదించారు. ఇక్కడ ఇస్తున్న మందులు సరిపడక సీరం క్రియేటినిన్‌ పెరిగిపోతుండటంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. ప్రతి నెల మందులకు రూ.5 వేల వరకు ఖర్చు అవుతోందని.. ప్రభుత్వం నుంచి పింఛను అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  
 

ద్దానం పేరు వినగానే కిడ్నీ వ్యాధితో అతలాకుతలమైన కుటుంబాలు గుర్తుకొస్తాయి. కాశీబుగ్గ వద్ద తెదేపా హయాంలో శంకుస్థాపన చేసిన భవన నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం పూర్తి చేసినా తగిన వసతులు కల్పించలేదు. అవసరమైన ఉపకరణాలను సమకూర్చలేకపోయింది. వైద్యులను పూర్తిస్థాయిలో నియమించలేదు. పలు సమస్యలు నెలకొన్నా ఎన్నికలు సమీపిస్తున్నాయని 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ, డయాలసిస్‌, కిడ్నీ పరిశోధన ఆసుపత్రిని ముఖ్యమంత్రి గతేడాది డిసెంబరు 15న ఆర్భాటంగా ప్రారంభించారు. రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రి కళ్ల ముందే ఉన్నా వైద్యం అందక కిడ్నీ బాధితులు అవస్థలు పడుతున్నారు. తెదేపా హయాం నుంచి పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నెఫ్రోప్లస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాలసిస్‌ కేంద్రాన్ని కొత్తగా ప్రారంభించిన కిడ్నీ ఆసుపత్రికి తరలించారు. ఆయా పరికరాలతోనే డయాలసిస్‌ చేస్తున్నారు. సీఎం గొప్పగా చెప్పిన అధునాతన చికిత్స ఇక్కడ అందడం లేదు. కిడ్నీ బాధితులు విశాఖపట్నం, ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.


కౌన్సెలింగ్‌, రక్త పరీక్షలకే పరిమితం

కిడ్నీ పరిశోధన ఆసుపత్రిలో వ్యాధికి కారణం తెలుసుకునేందుకు జార్జి ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో కొందరు పని చేస్తున్నారు. నాలుగో అంతస్తులో ప్రయోగశాల ఏర్పాటు చేసినా ఇటీవల ‘ఈనాడు’ ప్రతినిధులు పరిశీలనకు వెళ్లినప్పుడు తాళం వేసి ఉండటం గమనార్హం. ఆసుపత్రి ఆవరణలోని చిన్న గదిలో కిడ్నీ బాధితులకు కౌన్సెలింగ్‌, రక్త పరీక్షలు మాత్రమే చేస్తున్నారు.


ఆరు నెలలుగా జీతాలు లేవు

క్కడ పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు అందడం లేదు. గతేడాది అక్టోబరు నుంచే ఆసుపత్రిలో తాత్కాలికంగా సేవలు ప్రారంభం కావడంతో నియామకాలు చేపట్టారు. అప్పటి నుంచి మార్చి వరకు జీతాలు పడకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఊసూరుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. స్టాఫ్‌ నర్సుల ఖాతాల్లో ఇటీవల జీతాలు జమ కావడంతో మిగిలిన సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు.  


వైద్యుల విముఖత

పరిశోధన కేంద్రానికి అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులు మంజూరైనా విశాఖకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో పలాస ఉండటంతో ఇక్కడికి రావడానికి సముఖత చూపట్లేదు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో జీతాలు అధికంగా ఉండటంతో ఓ వైపు కన్సెల్టెంట్‌గా సేవలందిస్తూ మరోవైపు ఉద్యోగం చేసుకోవడానికి విశాఖపట్నం వంటి నగరాలు వారికి అనువుగా ఉంటాయి. పలాసలో ఆ తరహా సదుపాయం లేకపోవడంతో ఆయా పోస్టుల్లో చేరేందుకు ముందుకు రావట్లేదు. అందుబాటులో ఉన్న వైద్యుల ఆధ్వర్యంలో ఐదు నెలల్లో పది శస్త్రచికిత్సలు జరిగాయంటే ఇక్కడి ఆసుపత్రి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


నెఫ్రోప్లస్‌ ఆధ్వర్యంలోనే డయాలసిస్‌

తంలో పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నిర్వహిస్తున్న నెఫ్రోప్లస్‌ 20 యూనిట్లు, యంత్ర సామగ్రిని కిడ్నీ పరిశోధన ఆసుపత్రికి తరలించి బాధితులకు డయాలసిస్‌ చేస్తున్నారు. నెలకు సుమారు వెయ్యి మందికి డయాలసిస్‌ చేస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నా ప్రభుత్వం నుంచి డయాలసిస్‌ యూనిట్లు ఇప్పటివరకు రాలేదు. నెఫ్రోప్లస్‌ ఏజెన్సీ డయాలసిస్‌ యూనిట్ల నిర్వహణ, జీతాల చెల్లింపు, రోగులకు సేవలు అందిస్తుండగా.. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం ఏర్పాట్లు చేసిందనే వివరాలు అధికారులు చెప్పలేకపోతున్నారు. రెండో అంతస్తులో 20 పడకల చొప్పున రెండు వార్డులు డయాలసిస్‌కు కేటాయించగా.. నెఫ్రోప్లస్‌ ఆధ్వర్యంలో ఒక వార్డులో సేవలు అందిస్తున్నారు. రెండో వార్డులో డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఖాళీగా ఉంది. రోగులతో వచ్చే సహాయకులకు తగినన్ని కుర్చీలు లేకపోవడంతో వారంతా నేలపై కూర్చొని వేచి ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని