logo

అభివృద్ధి అన్నారు.. అ‘శాంతి’ మిగిల్చారు..!

ఉత్తరాంధ్రలో పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని గత ఎన్నికల ముందు ఊదరగొట్టారు. శాంతమ్మ చెబితే శాసనమేనని ప్రజలూ నమ్మారు.

Updated : 09 May 2024 06:22 IST

గత హామీలతోనే పాతపట్నం నుంచి మళ్లీ బరిలోకి

 ఐదేళ్లలో ఏం చేశారని ప్రజల నుంచి ప్రశ్నల వర్షం

 

ఉత్తరాంధ్రలో పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని గత ఎన్నికల ముందు ఊదరగొట్టారు. శాంతమ్మ చెబితే శాసనమేనని ప్రజలూ నమ్మారు. ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారు. అయిదేళ్లు గడిచినా ఎలాంటి మార్పూ కనిపించలేదు. గత హామీలనే మరోసారి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తుండటంతో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇన్నాళ్లు ఏం చేశారు.. మరోసారి అధికారం కట్టబెట్టడానికి’ అని నిలదీస్తుండటంతో అక్కడి నుంచి జారుకుంటున్నారు.  

- ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, పాతపట్నం


ఆశ పెట్టారు..విస్మరించారు

హామీ: జిల్లేడుపేట గ్రామం వద్ద మహేంద్రతనయ నదిపై వంతెన నిర్మిస్తాం.
ప్రస్తుత పరిస్థితి: వైకాపా అధికారంలోకి రాగానే జిల్లేడుపేట వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఏళ్లు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడంతో నిధులు వెనక్కి మళ్లాయి. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నాటు పడవపై ప్రయాణిస్తున్నారు.


చుక్క నీరివ్వలేకపోయారు..

హామీ: వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.

ప్రస్తుత పరిస్థితి: తెదేపా హయాంలోనే వంశధార ప్రాజెక్టు పనులు 87 శాతం జరిగాయి. వైకాపా అయిదేళ్ల పాలనలో 97 శాతం వరకు చేయగలిగారు. మిగిలిన పనులు పూర్తి చేయలేకపోవడంతో చుక్కనీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కాలువల ద్వారా సుమారు 2.57 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉన్నా సాధ్యపడలేదు. వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సాగునీరందిస్తాం.


గిరిజనులను వదిలేశారు..

హామీ: పెద్దమడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించి గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తాం.

ప్రస్తుత పరిస్థితి: జగన్‌ పాదయాత్రలో మెళియాపుట్టి మండలం పెద్దమడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేస్తామన్నారు. అది సాకారం చేసే బాధ్యతను ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీసుకోలేదు. గతి లేక గిరిజన ప్రాంత ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రాథమిక వైద్యానికి సైతం భారీగా ఖర్చు అవుతుండటంతో ఆమె తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


రహదారులు ఎక్కడ?

హామీ: గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు, తారు రోడ్లు నిర్మిస్తాం.
ప్రస్తుత పరిస్థితి: పాతపట్నం మండలంలోని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం కిమిడి-రుగడ రహదారి కీలకమైంది. పలు గిరిజన గ్రామాలను కలుపుతూ పాతపట్నం, కొత్తూరు, హిరమండలం మండలాలను అనుసంధానం చేస్తుంది. అయిదేళ్ల కిందట టెండరు వేసినప్పటికీ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. నిధులు మంజూరైనా గుత్తేదారులు ముందుకు రావట్లేదు. మెళియాపుట్టి మండలంలో గిరిజన ప్రాంతాలైన గొడ్డ ఆంపురం, చందనగిరి, మదనాపురం, నేలబొంతు-భీంపురం రోడ్డు, కూరాసింగిగూడ, హడ్డివాడ తదితర రహదారులు నిర్మాణం చేపట్టలేదు. కొన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.


కలగానే కళాశాల ఏర్పాటు..

హామీ: మెళియాపుట్టిలో మహిళా జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తాం.
ప్రస్తుత పరిస్థితి: జగన్‌ పాదయాత్రలో మెళియాపుట్టి మండలం పెద్దమడిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేస్తామన్నారు. అది సాకారం చేసే బాధ్యతను ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీసుకోలేదు. గతి లేక గిరిజన ప్రాంత ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రాథమిక వైద్యానికి సైతం భారీగా ఖర్చు అవుతుండటంతో ఆమె తీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి: అయిదేళ్లు గడిచినా కళాశాల మంజూరు విషయమే పట్టించుకోలేదు. బాలికలు వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇతర ప్రాంతాలకు వెళ్లి విద్య అభ్యసిస్తున్నారు.


ఇవి కూడా చేయలేదు..

  • కడగండి రిజర్వాయర్‌ నుంచి ఎల్‌ఎన్‌పేట మండలానికి కాలువలు నిర్మిస్తామని చెప్పారు. ఆ పనులూ చేయకపోవడంతో ఖరీఫ్‌, రబీ సీజన్లలో నీరు రిజర్వాయర్‌ ద్వారా వృథాగా బయటకు వెళ్లిపోతుంది. నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ సైతం నెరవేర్చలేదు. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు నష్ట తీవ్రత పెరుగుతోంది.
  • వంశధార నదికి వరద వస్తే కొత్తూరు మండల పరిధిలో పంట పొలాలు, గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు వర్షాల సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని