logo

కల్తీ మద్యం ఉచ్చు.. బడుగు బతుకుల్లో చిచ్చు..!

ఎన్నికల వేళ మద్యం ఎక్కడికక్కడ ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దొరుకుతున్న నాసిరకం మద్యం సరిపోనట్లు రాజకీయ నాయకులు గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ సరకు తీసుకువస్తున్నారు.

Updated : 09 May 2024 06:12 IST

ఎన్నికల వేళ ఏరులై పారుతున్న నాసిరకం సరకు

ఆసుపత్రుల బాట పడుతున్న మందుబాబులు

 ఎన్నికల వేళ మద్యం ఎక్కడికక్కడ ఏరులై పారుతోంది. రాష్ట్రంలో దొరుకుతున్న నాసిరకం మద్యం సరిపోనట్లు రాజకీయ నాయకులు గోవా, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి కల్తీ సరకు తీసుకువస్తున్నారు. పేదవాడి బలహీనతను ఆసరాగా చేసుకొని ఓట్లు దండుకొనేందుకు.. వారి కుటుంబాల్లో చీకట్లు నింపేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఓటర్లను మత్తులో ముంచి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో పెద్ద ఎత్తున సరకు నిల్వలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరకును సైతం కొందరు ఇళ్లలో నిల్వ చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. ఇలాంటి నాసిరకం, కల్తీ మద్యం తాగితే ప్రాణాలకే ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అతిగా మద్యం తాగి ఆసుపత్రుల బాట పట్టేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.
- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, గుజరాతీపేట, టెక్కలి, టెక్కలి పట్టణం, నరసన్నపేట, హిరమండలం, జలుమూరు, కవిటి గ్రామీణం, పోలాకి, శ్రీకాకుళం అర్బన్‌, కోటబొమ్మాళి

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు కెల్ల మల్లెమ్మ. రణస్థలం మండలం నగరప్పాలెంకు చెందిన ఈమె భర్త కెల్ల భద్రయ్య కూలి పనిచేస్తూ జీవనం సాగించేవాడు. విపరీతంగా మద్యం తాగి ఎనిమిది నెలల కిందట మృతి చెందాడు. ఆ తర్వాత కుటుంబం రోడ్డున పడింది. కుమారుడు ఇజ్జాడపాలెంలోని తాతగారింటి వద్ద ఉండి చదువుకుంటున్నాడు. తన భర్తను మద్యం మహమ్మారే బలిగొందని మల్లెమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ప్రాణాలతో చెలగాటం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాణ్యత కలిగిన మద్యం దొరకడం గగనమైంది. ఏవేవో కొత్త బ్రాండ్లు తీసుకువచ్చి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాసిరకం మద్యం తాగి ఎంతో మంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పాలకులే డబ్బుల కోసం బినామీ కంపెనీల పేర్లతో మద్యం వ్యాపారం చేస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు.

- పందిరి చంద్రరావు,దర్జీ, గొట్టాబ్యారేజీ సెంటర్‌, హిరమండలం


పిల్లల చదువులు ఆగిపోయాయి

రజకవృత్తి చేసుకుంటూ జీవనం సాగించే వాళ్లం.. ఇద్దరు కుమారులను చదివించుకుంటూ చక్కగా ఉండేవాళ్లం. భర్త మద్యానికి బానిసయ్యాడు. నాసిరకం మద్యం ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. తాగితేగానీ నిద్రలోకి వెళ్లని పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల ఇద్దరి చదువులు ఆగిపోయాయి. పనిచేసేందుకు వలసలు వెళ్లారు. నాలుగిళ్లలో పనులు చేసుకుంటూ బతుకుతున్నాను.    
- నౌపడ పావిత్రి, కొత్తపల్లి


కలిగే దుష్ప్రభావాలిలా..

  • నాసిరకం, మద్యం తాగేవారిలో ఎక్కువగా కాలేయం, ఉదర సంబంధిత రుగ్మతలు తలెత్తుతాయి.
  • గ్యాస్ట్రిక్‌, క్లోమం (ప్యాంక్రియాస్‌)పై ప్రభావం చూపడంతో రక్తపు వాంతులు, విరోచనాల ద్వారా రక్తం రావడం, ఒళ్లు నొప్పులు, నరాల బలహీనత వస్తుంటాయి.
  • లివర్‌(కాలేయ)కు సంబంధించి సిర్రోసిస్‌ అనే దీర్ఘకాలిక సమస్య కూడా వస్తుంది. దీనికి చికిత్స సైతం ఉండదని.. అది వస్తే ప్రాణాంతకమేనని వైద్యులు చెబుతున్నారు.
  • మెదడు పనితీరు మందగిస్తుంది.
  • ఉద్రేకం, మతిమరుపు వంటివి కలిగిస్తూ మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది.

ఆసుపత్రుల్లో పెరుగుతున్న బాధితులు

  • శ్రీకాకుళం నగరంలోని జీజీహెచ్‌లో ఉన్న వ్యసన విముక్తి కేంద్రానికి 2021 మార్చి నుంచి ఇప్పటి వరకు 7,044 మంది వ్యసన పరులు చికిత్సకు వచ్చారు. వారిలో మద్యం తాగేవారే 5,610 మంది ఉన్నారు. కల్తీ, నాసిరకం మద్యమే అనారోగ్య సమస్యలకు దారి తీసి.. ప్రాణాల మీదకు తీసుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు.
  •  టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని మానసిక వైద్యవిభాగానికి రోజూ ఏడుగురు రోగులు వివిధ సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. వారిలో ముగ్గురు నుంచి నలుగురు మద్యానికి బానిసైనవారేనని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాల్‌ శాతం అధికంగా ఉన్న మద్యం తీసుకోవడంతో గ్యాస్‌ట్రబుల్‌, కాలేయ సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నట్లు తెలిపారు.
  • కవిటి మండలం తిప్పనపుట్టుగ గ్రామానికి చెందిన కేశవ దొళాయి వెల్డర్‌గా పని చేస్తున్నాడు. కల్తీ మద్యం తాగి అనారోగ్యం బారిన పడ్డారు. ప్రస్తుతం మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ‘కుటుంబం గడవడం కష్టంగా మారిందని, భార్య కూలికి వెళ్తే తప్ప పూట గడవట్లేదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇలా అవ్వడానికి కల్తీ మద్యమే కారణమని వైద్యులు చెప్పారు.

శ్రీకాకుళం గ్రామీణ మండలం సానివాడ గ్రామానికి చెందిన రుప్ప నాగరాజు చిరు వ్యాపారం చేసుకుంటూ.. ఓ నాలుగైదు కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ సమాజంలో హుందాగా బతికేవారు. నాసిరకం మద్యం అధికంగా తాగడంతో కామెర్ల వ్యాధిన పడి మృతి చెందాడు. దీంతో భార్య, ఇద్దరు కుమారులు రోడ్డున పడ్డారు. ఎప్పుడు ఇంటి నుంచి అడుగు బయట అడుగుపెట్టని ఆమె బిడ్డలను పోషించేందుకు చిరుద్యోగంలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అవయవాలపై ప్రభావం..

మద్యం తాగితే కణాలు దెబ్బతిని కాలేయ వ్యవస్థ దెబ్బతింటుంది. దానిపై ప్రభావం, నరాలు, కిడ్నీ, క్లోమగ్రంధి, మెదడు తదితర అవయవాలపై కూడా పడుతుంది. మద్యానికి బానిసైనవారు మానసికంగా కుంగిపోవడం, ఆలోచనాశక్తి కోల్పోతారు. ఒక దశలో కాలేయ మార్పిడి తప్ప మరో అవకాశం ఉండదు. క్లోమగ్రంథి పాడైతే చికిత్స చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు.
- డాక్టర్‌ ప్రశాంత్‌, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌


లివర్‌ సిర్రోసిస్‌ను నివారించలేం..

నాసిరకం మద్యం తాగితే క్లోమ గ్రంథి, కాలేయం దెబ్బతింటాయి. కల్తీ మద్యం తయారీకి వినియోగించే రసాయనాలతో చిన్నప్రేగులు, కాలేయ రుగ్మతలు తలెత్తుతాయి. ఎక్కువగా తీసుకోవడంతో లివర్‌ సిర్రోసిస్‌ వ్యాధి వస్తుంది. దీన్ని నివారించలేం. కాలేయం మార్పిడి మినహా మందులు కూడా పని చేయవు. మద్యం బాగా తీసుకునేవారు మొదటి దశలోనే వ్యాధి తీవ్రతను గుర్తించి ఆసుపత్రికి వెళ్లడం మంచిది. అలవాటు తప్పించాలనుకుంటే డ్రగ్‌ డీ ఎడిక్షన్‌ కేంద్రాలను సంప్రదించాలి.
- డాక్టర్‌ శ్రీహర్ష, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌

గత నెల 23న శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు ఇంట్లో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ప్రధాన అనుచరుడైన నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.

కుటుంబం రోడ్డున పడింది...

నేను కూలి పనులకు వెళ్తుంటాను. మద్యం తాగే అలవాటు ఉంది. రోజువారీ వచ్చిన కూలీ డబ్బుల్లో కొంత మద్యానికి కేటాయించుకునేవాణ్ని. మిగిలిన దాంతో కుటుంబాన్ని పోషించేవాడిని. వైకాపా అధికారంలోకి వచ్చాక ధరలు పెంచేశారు. పైగా నాసిరకం మద్యం అమ్ముతుండటంతో నా ఆరోగ్యం దెబ్బతింది. ప్రస్తుతం పనికి వెళ్లలేకపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబమంతా రోడ్డున పడింది.
- గంగరాపు రాములు, కరకవలస గ్రామం


  • ఇటీవల శ్రీకాకుళం నగరంలోని ఓ వైద్యుడి ఇంట్లో భారీగా మద్యం పట్టుబడింది. దీని వెనుక అధికార పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉందని తేలింది. దొరికింది ఒక్కటే అయినా ఇలా దొరకని స్థావరాలు ఇంకెన్నో ఉన్నాయని నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు.
  • ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నం నియోజకవర్గానికి అక్కడి నుంచి నిత్యం పెద్ద ఎత్తున మద్యం వస్తోంది. రాత్రి వేళ లారీలతో గుట్టుగా సరకు తరలించేస్తున్నారని, సమాచారమిచ్చినా పోలీసులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  • ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మద్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది. అక్కడి నుంచి పలాసకు నిత్యం సరకు తరలించేందుకు ఒడిశాకు చెందిన ఓ డిస్టిలరీ యజమాని నేరుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. నియోజకవర్గానికి అప్పగించే బాధ్యతతో ఇప్పటికే 2,000 కేస్‌ల మద్యం తరలించారని ఇటీవల అధికార పార్టీ నుంచి బయటకు వచ్చిన ఓ నేత తెలిపారు.
  • టెక్కలి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మద్యం నిల్వలు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఓ డంపింగ్‌ పోలీసులకు దొరికినా దగ్గరుండి దాన్ని తరలించి అధికారులు స్వామి భక్తి చాటుకున్నట్లు సమాచారం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని