logo

ఉత్పత్తుల ఎగుమతికి ప్రత్యేక కేంద్రం

నీలగిరి జిల్లాలో ఉత్పత్తి చేసే వస్తువులను ఎగుమతి చేసేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. నీలగిరి జిల్లా ఊటీ 200వ ఏడాది ఉత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శనివారం జరిగింది. సీఎం పాల్గొన్నారు.

Published : 22 May 2022 04:43 IST

నీలగిరిలో ఏర్పాటుకు చర్యలు

ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడి

పలు పథకాలకు ప్రారంభోత్సవం

వీసీ ద్వారా పథకాలను ప్రారంభిస్తున్న సీఎం స్టాలిన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: నీలగిరి జిల్లాలో ఉత్పత్తి చేసే వస్తువులను ఎగుమతి చేసేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. నీలగిరి జిల్లా ఊటీ 200వ ఏడాది ఉత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శనివారం జరిగింది. సీఎం పాల్గొన్నారు. రూ.118.79కోట్ల విలువైన పలు పథకాలను ప్రారంభించారు. రూ.34.30కోట్ల పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం 9,500 లబ్ధిదారులకు రూ.28.13 కోట్ల విలువైన సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సహజ అందాలతో వెలుగొందుతున్న ఊటీలో పలు ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఊటీలానే తన మనసు కూడ చల్లదనంగా ఉందన్నారు. గిరిజన ప్రజల ఆదరణ ఎంతగానో ఉత్సాహపరిచిందని చెప్పారు. ప్రజల సమస్యల కోసం ఎంపీ ఎ.రాజా గళమెత్తుతున్నారని అభినందించారు. నీలగిరి జిల్లాకు పలు పథకాలు డీఎంకే అందించిందని తెలిపారు. యునెస్కో సంస్థ జిల్లాను బయోగ్రాఫికల్‌ ఆర్కైవ్‌గా ప్రకటించిందన్నారు. ముదుమణలై శరణాలయాన్ని విస్తరింపజేసి, కేంద్రప్రభుత్వానికి వివరణాత్మక ప్రాజెక్ట్‌ నివేదికను కరుణానిధి అందించారని తెలిపారు. తేయాకు తోట కార్మికుల వేతనాలను పెంచింది కూడా ఆయనేనని గుర్తుచేశారు. అధికారంలో లేనప్పుడు కూడా ప్రజల కోసం సేవ చేసిన పార్టీ తమదేనని పేర్కొన్నారు. ప్రకృతిని, మానవుడితో కలిసి జీవించే అడవిని రక్షించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. నీలగిరిలో పర్యాటకాన్ని కాపాడేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. అటవీ విస్తరణను 20 నుంచి 30 శాతానికి పెంచేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. అటవీ జంతువులను కాపాడేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. తొప్పక్కాడు ఏనుగుల శిబిరంలో అధునాతన వసతులు కల్పిస్తున్నామని వెల్లడించారు. జిల్లాలో ఉత్పత్తి చేసే వస్తువులను ఎగుమతి చేసేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పర్యాటకానికి చెందిన కార్మికులను లెక్కించి గుర్తింపుకార్డు అందజేస్తామని తెలిపారు.

ఊటీ ఏర్పడి 200 ఏళ్లు అవుతున్న సందర్భంగా దీని అభివృద్ధికి కృషి చేసిన జాన్‌ సులివన్‌ జ్ఞాపకార్థకంగా ఉదగై తావరవియల్‌ పార్క్‌కు వెళ్లే మార్గంలో రూ.20లక్షల ఖర్చుతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆవిష్కరించారు. వేడుకలకు ప్రభుత్వం రూ.10కోట్లు కేటాయించారు.

పోషకాహార లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక వైద్య పరీక్షల కేంద్రాన్ని నీలగిరి జిల్లా దొడ్డబెట్టా పంచాయతీ ముత్తోర బాలల కేంద్రంలో స్టాలిన్‌ ప్రారంభించారు. జిల్లాలలో ఈ కార్యక్రమం నెలపాటు జరుగుతుంది. పిల్లలను గుర్తించి వారి పెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. వివరాలు ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేసి పర్యవేక్షిస్తారు. కార్యక్రమాల్లో మంత్రులు స్వామినాథన్‌, రామచంద్రన్‌, ఎంపీ ఎ.రాజా, నీలగిరి కలెక్టర్‌ అమ్రిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని